ఇంటికి లక్ష్మీదేవీ రూపంగా భావించుకునే ఆడపిల్లల పుట్టుక ఇప్పుడు భయానక మవుతోంది. కనికరం లేని కొందరు తల్లిదండ్రులు పుట్టిన పాపాయిలు ఈ లోకం చూడకుండానే కాటికి పంపేస్తున్నారు. అదీ దారుణంగా. సభ్య సమాజం తలదించుకునేలా. మానవత్వం మరిచేలా. కొడంగల్‌లో జరిగిన ఈ సంఘటనే ఇందుకు సాక్ష్యం. ఎందరినో కదిలించిన వైనం.
కొడంగల్, న్యూస్‌లైన్ : ‘అమ్మా..నన్నెందుకు కన్నావ్...? నేనేం నీ కడుపులోనే పుడతానను కోలేదే. నా ప్రమేయం లేకుండా ఈ భూమ్మీదకు తెచ్చిన వెంటనే నువ్వు మురుగు కాలువ పాల్జేస్తే నేను ఓ 18 గంటలు మృత్యువుతో పోరాడి మిమ్మల్నందర్నీ వదిలి వెళ్లి పోయా. అంత దానికి నన్ను 9 నెలలు ఎందుకు మోసావ్. పెంచడమే భారమనుకుంటే ఆ మాత్రం అనుభూతి కూడా నాకెందుకు’. ఇదీ ఓ పసికందు ఆత్మ ఘోష.
ఎంతో గొప్పదనుకున్న బ్రహ్మముహూర్తంలో పుట్టిన ఆడపిల్ల మారని ఈ లోకం తీరుపై రువ్విన ప్రశ్నలు.గతి తప్పుతున్న సమాజానికి వేస్తున్న చురకలు. గుండెల్ని పిండేసిన ఈ సంఘటన కొడంగల్ పట్టణంలో గురువారం తెల్లవారున చోటు చేసుకుంది. స్థానిక పెద్దలు బొంకులు శంకరప్ప, బాకీ కైసర్, కానకుర్తి నర్సింహారెడ్డిలు రోజూ వారి మాదిరిగానే వాకింగ్‌కు బయలు దేరారు. వారిళ్లకు సమీపంలో ఉన్న షాబజార్ ప్రాంతంలోని మురుగు కాలువలో ఓ పసికందు తేలియాడుతూ కనిపించింది.
అమ్మ పొత్తిళ్లలో వెచ్చగా పడుకోవాల్సిన ఆ చిన్నారి గడ్డగట్టించే చలిలో దుర్భర స్థితిలో కనిపించడంతో చలించి పోయారు. మానవత్వం మేల్కొంది. వెంటనే ఈవిషయాన్ని విలేకరులకు, పోలీసులకు, 108 అంబులెన్స్‌కు తెలియజేశారు. విషయం తెలుసుకొని కలాల్‌వాడీలో ఉంటున్న అంగన్‌వాడీ టీచర్లు కానుకుర్తి యాదమ్మ, బైండ్ల శశికళలు అక్కడకు చేరుకొని పసికందును తీసుకొని 108లో కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అప్పటికే ఆ చిట్టి తల్లి పరిస్థితి విషమంగా మారడంతో తాండూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అమ్మపాలుతో కడుపు నింపుకోవాల్సినా చిన్నారి మురుగునీటిని తెలీకుండానే తాగేసింది. మరోవైపు ఇన్‌ఫెక్షన్‌లు సోకి ముక్కు నుంచి నోట్లో నుంచి రక్తస్రావం ప్రారంభమైంది.కన్నవారు చేసిన ఘనకార్యానికి పాపాయి గుండె కూడా చివుక్కుమందేమో అదీ మండకొడి స్పందనలతోనే సరిపెట్టుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన వైద్యులు అత్యవసరంగా చికిత్సలందించాలంటే తక్షణమే రూ. 2వేల విలువచేసే ఇంజక్షన్ వేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జయశ్రీ తాండూరుకు చేరుకొని అక్కడి ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డితో మాట్లాడి చిన్నారికి సాయం చేయాలని కోరారు. ఆయనా చలించి ముందుకు వచ్చినా... తాండూరులోని మెడికల్ షాపులన్నీ వెతికినా ఆ చిన్నారికి కావాల్సిన ఇంజక్షన్ దొరకలేదు.
అలా అప్పటి వరకూ మృత్యువుతో పోరాడిన చిట్టి ఈ లోకం పోకడ అర్ధం చేసుకొని ఇక చాల్లే అనుకొని సరిగ్గా రాత్రి 8గంటల సమయంలో కాలుని గూటికి చేరుకుంది. అమ్మే అక్కరలేదనుకున్నప్పుడు ఈ సంఘానికి తానెందుకు భారం కావాలనుకుందేమో చివరి శ్వాస వదలి శాశ్వత లోకాలకు వెళ్లిపోయింది. డాక్టర్ అంచనా ప్రకారం ఆ శిశువు గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ భూమిపైకి అడుగు పెట్టి ఉండవచ్చు. అంటే కేవలం 18 గంటల్లో బతుకు పాఠాలను తెలుసుకుందన్నమాట. ఉన్న కొద్ది గంటల్లోనూ తనకోసం శ్రమించిన వారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పి వీడ్కోలు పలికింది. అందరికీ కల్లు చెమర్చేలా చేసింది.
పసి వేదన
Published Fri, Dec 20 2013 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement