సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి రెండో విడతలో మంజూరైన 234 మోడల్ పాఠశాలల భవనాల నిర్మాణానికి బ్రేక్ పడింది. నిర్మాణ వ్యయం పెరిగినందున కొత్త రేట్లు ఇస్తేనే.. భవనాలను నిర్మిస్తామంటూ రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూడీసీ) చేతులెత్తేసింది. మరోవైపు కేంద్రం మాత్రం వాటి కోసం అదనంగా పైసా ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే తొలివిడతలో మంజూరైన మోడల్ పాఠశాలల్లో పూర్తిగా సదుపాయాలు చేకూరకపోగా... ఇప్పుడు రెండో విడత పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది.
2012 డిసెంబర్‌లో కేంద్రం రాష్ట్రానికి 234 మోడల్ స్కూళ్లను మంజూరు చేసింది. వాటి నిర్మాణం కోసం ఒక్కో స్కూల్‌కు రూ. 2.71 కోట్ల చొప్పున నిర్ణయించి.. నిధులు కూడా విడుదల చేసింది. అయితే స్టీల్ ధరలు పెరిగి పోయాయని, నిర్మాణ వ్యయం కూడా పెరిగినందున ప్రస్తుత రేట్లతో నిర్మాణాలు చేపట్టబోలేమని మౌలిక సదుపాయాల సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఆ భవనాల నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. అయితే, ఇంతకు ముందు తొలి విడతలో మంజూరైన 355 స్కూళ్ల నిర్మాణాలు ఆలస్యమైనప్పుడు కూడా... రేట్లు పెరిగాయని, రివైజ్డ్ రేట్లు ఇవ్వాలని సెకండరీ విద్యా శాఖ కేంద్రాన్ని కోరింది. కానీ, తాము అదనంగా పైసా ఇవ్వబోమని, అదనంగా అవసరమైతే మీరే భరించండి అని కేంద్రం స్పష్టం చేసింది కూడా. ఈ నేపథ్యంలో ప్రస్తుత రెండో విడతలో మంజూరైన మోడల్ స్కూళ్లకు కూడా అదనపు నిధులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జూన్ 2న కొత్తగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడి, కొత్త ప్రభుత్వాలు రానున్నందున.. ఆయా ప్రభుత్వాల నిర్ణయంపై ఈ స్కూళ్ల నిర్మాణం ఆధారపడి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వెనుకబడిన అన్ని మండలాలకు స్కూళ్లు..
రాష్ట్రంలో విద్యాపరంగా వెనుకబడిన మండలాలు 737 ఉన్నాయి. ఈ మండలాలు అన్నింటికి మోడల్ స్కూళ్లను మంజూరు చేసేందుకు కేంద్రం 2009 డిసెంబరులోనే అంగీకరించింది. అందులో భాగంగా తొలివిడతలో 355 స్కూళ్లను మంజూరు చేసింది. 2011లోనే అవి ప్రారంభం కావాల్సి ఉన్నా.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా 2013లో ప్రారంభించారు. అయినా వాటిలో ఇప్పటివరకు 250 స్కూళ్లకు కూడా అన్ని వసతులు సమకూరలేదు. ఈ పరిస్థితుల్లోనే 2012 డిసెంబరులో మరో 234 స్కూళ్లను కేంద్రం మంజూరు చేసింది. కానీ నిర్మాణ వ్యయ భారం పేరుతో అవీ ఆగిపోయాయి. వీటి నిర్మాణాలను పూర్తి చేస్తే తప్ప మరో 148 స్కూళ్లను కేంద్రం మంజూరు చేసే పరిస్థితి లేదు.
రెండో విడత మంజూరైన మోడల్ స్కూళ్లు..
శ్రీకాకుళం 8, విజయనగరం 4, విశాఖపట్నం 20, తూర్పుగోదావరి 4, కృష్ణా 1, గుంటూరు 5, ప్రకాశం 18, అనంతపూర్ 24, కడప 17, చిత్తూరు 1, కర్నూలు 7, మహబూబ్‌నగర్ 40, నల్లగొండ 5, ఖమ్మం 7, వరంగల్ 10, నిజమాబాద్ 14, రంగారెడ్డి 6, మెదక్ 9, ఆదిలాబాద్‌కు 34 స్కూళ్లు మంజూరయ్యాయి.