నౌకా నిర్మాణ కేంద్రంలో ప్రైవేటు పెత్తనం!
విశాఖపట్నం: దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన తూర్పు నావికాదళ నౌకా నిర్మాణ కేంద్రం క్రమశిక్షణ తప్పుతోంది. అత్యంత పారదర్శకతతో జరగాల్సిన కీలక పనులన్నీ కాంట్రాక్టర్ల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. జలాంతర్గాములు, ఇతర అస్త్రాల తయారీలో నావికాదళ నిపుణులకు బదులు అనుభవంలేని బయటివ్యక్తుల పెత్తనం పెరిగిపోతోంది.
కొందరు ఉన్నతాధికారుల కమీషన్ల కక్కు ర్తి దేశప్రతిష్ఠకు మచ్చ తెస్తోంది. భద్రతా వారోత్సవాలు జరుగుతున్న సమయంలోనే నౌకానిర్మాణ కేంద్రంలో భద్రత కొరవడుతుండడం విస్మయపరుస్తోంది. నౌకాదళ మాజీ ఉద్యోగులను చేర్చుకుని ప్రైవేటు కంపెనీలు ఆడుతున్న కాసులాటలో పరువు మంటగలుస్తోంది.
ఏదీ పారదర్శకత?
నేవల్‌బేస్‌లోని తూర్పునావికాదళం అమ్ములపొదిలోని నౌకానిర్మాణ కేంద్రం అత్యంత కీలకమైనది. ఈ ప్రాంత సముద్రజలాల భద్రతకు కావలసిన జలాంతర్గాములు, ఇతర కీలక ఆయుధాలు, అస్త్రాల తయారీలో దీనిదే ముఖ్యపాత్ర. ఇటువంటి కీలకమైన నౌకానిర్మాణ కేంద్రంలో ప్రస్తుతం ప్రైవేటు పెత్తనం పెరిగిపోయింది. చేతిలో ఉన్న నిపుణులను కాదని ప్రతిపనికి ప్రైవేటు వారిపైనే ఆధారపడుతుండడంతో ఏక్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోననే భయం వ్యక్తమవుతోంది. శనివారం న్యూక్లియర్ సబ్ మెరైన్‌లో జరిగిన ప్రమాదం ఈ భయాలను మరింత పెంచుతోంది. ప్రస్తుతం జాతీయ భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి.
ఈనెల 15 వరకు నేవీతోపాటు అనేక కేంద్రాల్లో సేఫ్టీఫోర్త్ నైట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో న్యూక్లియర్ జలాంతర్గామిలో ప్రమాదం జరగడం నావికాదళం పనుల్లో నాణ్యతపై అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. అత్యంత పకడ్బందీ బందోబస్తు, బయటి ప్రపంచంతో సంబంధంలేని ఈ కేంద్రంలో ప్రస్తుతం మూడో కంటికి తెలియకుండా జరుగుతున్న పరిణామాలు భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలకు ఆస్కారం కల్పిస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రంలో జలాంతర్గాములు, ఇతర ఉత్పత్తులకు సంబంధించిన పలు కీలక పనులు జరుగుతున్నాయి. దేశరక్షణకు సంబంధించిన వీటి తయారీలో అడుగడుగునా శిక్షణ పొందిన నేవీ నిపుణులు పాత్ర అధికంగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది.
ప్రస్తుతం లోపల ప్రైవేటు కంపెనీల హవా నడుస్తోంది. కొందరు ఉన్నతాధికారులు ప్రతీ పనిని ప్రైవేటు కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు. దీనివల్ల వీరి జోక్యం పెరిగిపోయి నాణ్యత నానాటికి దిగజారిపోతోంది. శనివారం జరిగిన ప్రమాదంలో నేవీ నిపుణులు లేకుండానే టెస్టింగ్ పనులు చేసి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి ప్రమాదం చోటుచేసుకున్న న్యూక్లియర్ సబ్‌మెరైన్ పనులను అవుట్‌సోర్సింగ్‌కు ఇవ్వకూడదు. అధికారులు ఇదేం పట్టించుకోకపోవడంతో ఇంత నష్టం వాటిల్లిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైడ్రో పనుల టెస్టింగ్ జరిగేటప్పుడు క్వాలిటి ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో జరపాలి. కాని అది జరగకపోవడంపై వీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నౌకానిర్మాణ కేంద్రంలో ఎక్కువ పనులు ఎల్‌అండ్‌టీ సంస్థ చేపడుతోంది. ఈ సంస్థ అనుమతుల్లేకుండా ఇతర పనులను బయట కంపెనీలకు సబ్‌లీజులకు ఇస్తోంది. నేవీ అధికారులకు ఈ కంపెనీలపై ఏమాత్రం అజమాయిషీ లేకుండా పోతోంది.నౌకనిర్మాణ కేంద్రంలో సుమారుగా 1100మంది వరకు నేవీ ఉద్యోగులు పనిచేస్తుంటే బయట వ్యక్తులు, కాంట్రాక్టు కూలీలు కలిపి 2,500 మందికిపైగా ఉన్నారు. ప్రస్తుతం అధికశాతం పనులు వీరి చేతులమీదుగానే జరుగుతున్నాయి. పనులను సబ్‌లీజులకు ఇచ్చేయడం, సొంత నిపుణులను పక్కనబెట్టి కమీషన్లకు కక్కుర్తిపడడం వల్లే ఇదంతా జరుగుతుందని మాజీ అధికారులు వివరిస్తున్నారు.
అంతేకాకుండా ఈ నౌకా నిర్మాణ కేంద్రంలో ఉద్యోగ విమరణ చేస్తున్న వారికి ప్రైవేటు కంపెనీలు మంచిహోదాతో తిరిగి ఉద్యోగం కల్పిస్తున్నాయి. దీంతో కొందరు సిబ్బంది ముందునుంచే వీరికి పలు కాంట్రాక్టులు లభించేలా సూచనలు, సలహాలు ఇస్తుండడంతో నౌకానిర్మాణ కేంద్రం నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది.