కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: విద్యుత్ మీటర్ల మార్పులో కాంట్రాక్టర్లు అందినంతా దోచుకుంటున్నారు. నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా పనులు చేస్తూ వినియోగదారులపై భారం మోపుతున్నారు. స్పెషల్ చార్జీల పేరిట వసూళ్లకు తెగబడినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో మీటర్ల మార్పునకు సంబంధించి డోన్ డివిజన్ కాంట్రాక్టర్‌కు ఇతర డివిజన్ల కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో గతంలో ఏర్పాటు చేసిన మెకానికల్ మీటర్ల కారణంగా లైన్‌లాస్ అధికంగా ఉండటంతో విద్యుత్ శాఖ హైటెక్నాలజీతో తయారు చేసిన డిజిటల్ మీటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మీటర్లు సెల్‌ఫోన్ చార్జర్ లైటు, విద్యుత్ స్వీచ్ బోర్డులోని చిన్నపాటి ఎల్‌ఈడీ లైటు వెలిగినా వాడకాన్ని నమోదు చేస్తాయి.
ఈక్రమంలో రీప్లేస్‌మెంట్ ఆఫ్ హై అక్యూరసీ స్కీం కింద పాత మెకానికల్ మీటర్లు ఉన్న ప్రాంతంలో కొత్త డిజిటల్ మీటర్లు ఏర్పాటును గతేడాది నుంచి ఆచరణలోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పనులను డివిజన్ల వారీగా విభజించి, టెండర్ల ద్వారా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే మీటర్ల మార్పిడిలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది.
ఇదిలాఉండగా ఇతర డివిజన్లలో ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల కంటే డోన్ డివిజన్ కాంట్రాక్టర్‌పై అధికారులు మక్కువ చూపుతున్నారు. పాత మీటరు ఇంటి బయటే ఉంటే ఒక్కోదానికి రూ.66 చొప్పున చెల్లిస్తున్నారు. విద్యుత్ మీటరు ఇంట్లో ఉంటే ఆరుబయట ఏర్పాటు చేసేందుకు రూ.220(మాగ్జీమమ్) కాంట్రాక్టరుకు చెల్లించవచ్చని ఉన్నతాధికారుల ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ పనిని అంచనా వేసిన కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజినల్ ఇంజినీర్లు(ఆపరేషన్స్) ఇంట్లోని మీటర్‌ను ఆరుబయట అమర్చేందుకు మాగ్జీమమ్ మొత్తాన్ని తగ్గించి రూ. 195 మాత్రమే చెల్లిస్తామని కాంట్రాక్టర్లతో ఒప్పదం కుదుర్చుకొని పనులు చేయిస్తున్నారు. అయితే ఇదే పని కోసం డోన్ డివిజన్ కాంట్రాక్టర్‌కు రూ. 220 చెల్లిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
పనులు ఎలా చేయాలి... ఏం జరుగుతోంది
పాత మీటర్ల స్థానంలో ఏర్పాటు చేసే డిజిటల్ మీటర్లు ఉచితంగా అమర్చాలి. కానీ కొత్త మీటర్ ఏర్పాటు చేసినందున డబ్బు ఇవ్వాలని కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ. 100 నుంచి రూ.200కు పైగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
మీటరు ఏర్పాటుకు బోర్డు ఉంటే దానిపైనే అమార్చాలి. లేకపోతే ఉచితంగా చెక్కబోర్డు ఏర్పాటు చేసి మీటర్లు బిగించాలి. కానీ కొన్నిచోట్ల చెక్కబోర్డు ఏర్పాటు చేయకుండా గోడలపైనే నేరుగా మీటర్లు అమరుస్తున్నారు.
గతంలో ఇంట్లో మీటర్ ఉంటే ఆరు బయటకు తీసుకొచ్చి అమర్చేందుకు తగిన విద్యుత్ తీగలు, సర్వీసు వైరు ఉచితంగా ఇవ్వాలి. కాని వైరు ఖర్చు పేరిట డబ్బు దండుకుంటున్నారు.
మీటర్‌కు కనెక్షన్ ఇచ్చే సర్వీసు వైరుకు ఒక మీటర్ పోడవు(100 సెంటీమీటర్లు) ప్లాస్టిక్ పీవీసీ పైపు లేదా రింగ్ టైపు పైపు వేయాలి. అది అరకొరగా వేసి పని కానిచ్చేస్తున్నారు.
ఫిద్యాదు చేస్తే కాంట్రాక్టర్లపై చర్యలు:
డిజిటల్ మీటర్లను ఉచితంగా ఏర్పాటు చేయాలి. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ కొత్త మీటర్ల ఏర్పాటు పేరిట డబ్బు వసులు చేస్తున్నట్లు నా దృష్టికీ వచ్చింది. కొందరు వినియోగదారులు ఫోన్ చేసినా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. మీటరు మార్పు సందర్భంగా చెక్కబోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. వైర్లు ఉచితంగా వేసి, పీవీసీ రింగ్ పైపును అమర్చాలి. డోన్ డివిజన్‌లో కాంట్రాక్టర్‌కు రూ.220 ఇస్తున్న మాట వాస్తవమే. అక్కడ మార్పు చేయాల్సిన కనెక్షన్లు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. పరిశీలించి పనులు చేయాలంటే కాంట్రాక్టర్‌కు గిట్టుబాటు కావడం లేదనే ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నాం.
- టి.బసయ్య, ఎస్‌ఈ, కర్నూలు
అడిగేవారెవరు!
Published Sat, Nov 30 2013 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement
Advertisement