power meters
-
రైతుల మేలుకోరి.. ముందడుగు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు వీలుగా విద్యుత్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి, వారిలో ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేశారు. ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరం గ్రామాన్ని ఎంచుకొని, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను బిగించి పరిశీలించారు. బెంగళూరులోని ప్రయోగశాల నుంచి వీటిని పరీక్షించారు. సానుకూల ఫలితాలు రావడంతో ఉమ్మడి జిల్లాలోని 1,08,859 వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు వీలుగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి గానూ అర్హత పొందిన ఏజెన్సీలు మీటర్లను దశల వారీగా సరఫరా చేయనున్నాయి. సంబంధిత ఏజెన్సీ బిల్లులు తయారు చేసి డిస్కంలకు అందజేయనున్నాయి. వీటి ఆధారంగా ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ప్రస్తుతం నగదు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. దీంతో పాటు రైతుల నుంచి డెబిట్ మ్యాన్‌డేట్ ఫారాలను సేకరిస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వం జమ చేసే బిల్లు మొత్తం సంబంధిత డిస్కంకు బదిలీ అయ్యేందుకు ఆమోదం తెలిపినట్లవుతుంది. బ్యాంకు ఖాతాల సేకరణ ఇలా.. విజయవాడ సర్కిల్ పరిధిలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 1,08,859 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటీకి సంబంధించి డిస్కంల వద్ద ఉన్న రికార్డుల వివరాలను పోల్చుకొని, అప్డేట్ చేస్తున్నారు. అప్డేట్ కాని చోట్ల రికార్డుల్లో మార్పులు చేస్తున్నారు. పాస్ పుస్తకం, భూ యజమాన్య హక్కు పత్రం ఆధారంగా కనెక్షన్లను, ప్రస్తుతం ఉన్న హక్కుదారుడి పేరిట నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి డిస్కంల వద్ద 55,610 ఖాతాలుండగా, తాజాగా మరో 11,415 ఖాతాలను రైతుల ద్వారా ఓపెన్ చేయించారు. మిగిలిన 41,834 వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి, రైతులతో ఖాతాలు తెరిచే పనిలో విద్యుత్ సిబ్బంది నిమగ్నం అయ్యింది. ప్రధానంగా వ్యవసాయ కనెక్షన్లు అధికంగా ఉన్న నూజివీడు, విజయవాడ రూరల్, ఉయ్యూరు డివిజన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అపోహలను తొలగిస్తున్నాం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను బిగించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ విధానంపై రైతుల్లో నెలకొన్న అపొహలను తొలగిస్తున్నాం. వారి ఖాతాల్లో బిల్లుకు సంబంధించిన నగదును జమ చేసేందుకు వీలుగా బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నాం. రైతుల నుంచి డెబిట్ మ్యాన్‌డేట్ ఫారాలను సేకరిస్తున్నాం. – శివప్రసాద్‌రెడ్డి, ఎస్ఈ, విజయవాడ సర్కిల్ -
ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ కాలితే.. బీపీ పెరగడం ఖాయం!
సాక్షి, హైదరాబాద్: ప్రీపెయిడ్ స్మార్ట్ విద్యుత్ మీటర్లు కాలిపోతే వినియోగదారుల నుంచే వాటి విలువను ఆరేళ్ల కింద ఉన్న అధిక ధరలతో వసూలు చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) నిర్ణయం తీసుకుంది. మీటర్ వ్యయాన్ని వినియోగదారుల నెలవారీ విద్యుత్ బిల్లులో కలిపి వసూలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ ఫేజ్ ప్రీపెయిడ్ మీటర్‌కు రూ.8,687, త్రీఫేజ్ ప్రీపెయిడ్ మీటర్‌కు రూ.11,279 వ్యయాన్ని జీఎస్టీతో కలిపి వసూలు చేయాలని అన్ని సర్కిళ్ల పర్యవేక్షక ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. 4 రెట్లు అధిక వ్యయం గత కొంతకాలంగా బహిరంగ మార్కెట్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధరలు భారీగా తగ్గిపోయాయి. 2017 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) నిర్వహించిన టెండర్లలో రూ.2,503కే సింగిల్ ఫేజ్ ప్రీపెయిడ్ మీటర్ విక్రయించడానికి ఐటీఐ లిమిటెడ్ అనే కంపెనీ ముందుకు వచ్చింది. అంతకుముందు టెండర్లలో రూ.2,722కే ఈ మీటర్‌ను విక్రయించడానికి ఎల్అండ్టీ సంస్థ బిడ్ దాఖలు చేసింది. దేశంలోని విద్యుత్ వినియోగదారులందరికీ దశలవారీగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో వీటికి డిమాండ్ భారీగా పెరిగిపోయి ధరలు ఇంకా పతనం అవుతున్నాయి. మరోవైపు కాలిపోయిన మీటర్ల వ్యయాన్ని వినియోగదారుల నుంచి 6 ఏళ్ల కింద ఉన్న నాలుగైదు రెట్ల అధిక ధరలతో వసూలు చేయాలని టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం నిర్ణయించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పరిశ్రమలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లను టీఎస్ఎస్పీడీసీఎల్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం దాదాపు 20 వేల మీటర్లను సింగిల్ ఫేజ్ మీటర్‌కు రూ.8,687, త్రీఫేజ్ మీటర్‌కు రూ.11,279 చెల్లించి ఆరేళ్ల కింద టెండర్ల ద్వారా కొనుగోలు చేసింది. వీటిలో కొన్ని రిజర్వులో ఉన్నాయి. ఎక్కడైనా స్మార్ట్‌మీటర్ పాడైతే... గతంలో అధిక ధరలకు కొన్నవాటినే బిగి స్తున్నామని, సంస్థ నిబంధనల ప్రకారం ఈ ధరలనే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నట్టు ఓ అధికారి వివరించారు. కొత్తగా ప్రీపెయిడ్ మీటర్లు కొనుగోలు చేసే వరకు ఈ పాత ధరలే కొనసాగుతాయని పేర్కొంటున్నారు. ఈ అంశంపై టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి వివరణ కోసం ‘సాక్షి’ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు. చదవండి: హైదరాబాద్ ఐఎస్బీ.. మరో ఘనత కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి.. -
స్కూళ్లకు విద్యుత్ మీటర్ల షాక్..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ మీటర్ల షాక్ తగిలింది. గతేడాది నుంచి బిగిస్తున్న ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లకు అయ్యే ఖర్చు చెల్లించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ప్రధానో పాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. అసలు పాఠశాలల విద్యుత్ చార్జీలు చెల్లించేందుకే పాఠశాల విద్యా శాఖ సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదని ఆందోళన చెందు తుంటే.. ఇప్పుడేమో విద్యుత్ మీటర్ల చార్జీలు చెల్లించాలంటే ఆదేశిస్తే.. ఏం చేయాలంటూ డీఈవోలకు ప్రధానో పాధ్యాయులు మొర పెట్టుకుంటున్నారు. సింగిల్ ఫేజ్ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ ఒక్కో దానికి రూ.8,687 చెల్లించాలని ఆదేశిం చింది. రాష్ట్రంలోని 30,601 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ మీటర్ల ఖర్చు కిందే రూ.26.50 కోట్లకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. దీంతో ఏం చేయాలన్న విషయంలో విద్యా శాఖ ఉన్నతాధికారులు కూడా తలలు పట్టుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీట ర్లను బిగిస్తున్నామని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. అందులో భాగంగానే కొన్ని పాఠశాలల్లో మీటర్లు బిగించించామని, మిగతా పాఠశాలల్లోనూ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు బిగిస్తున్నామని స్పష్టం చేసింది. వాటికయ్యే ఖర్చును ప్రధానోపాధ్యా యులు/ సంబంధిత అధికారులు చెల్లించాలని పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న నెల రోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆయా నోటీసుల్లో స్పష్టం చేసింది. లేదంటే ఆ తర్వాత మూడు నెలల విద్యుత్ బిల్లులో ఆ మొత్తాన్ని వేసి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం పాత మీటర్లతో వినియోగించిన విద్యుత్ చార్జీలనే మంజూరు చేయడంలో విద్యా శాఖ జాప్యం చేస్తోందని, ఇప్పుడు కొత్త మీటర్లకు డబ్బులు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఆ మొత్తాన్ని మంజూరు చేయాలని ప్రధానో పాధ్యాయులు కోరుతున్నారు. 8,687 ఒక్కో సింగిల్ ఫేజ్ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు (రూ.లలో) 26.50రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు (రూ. కోట్లలో) -
పగులుతున్న అక్రమాల పుట్ట
సాక్షి, సిటీబ్యూరో: తీగలాగితే డొంక కదిలిన చందంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో మీటర్ రీడింగ్‌లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. సెక్షన్ల వారీగా విద్యుత్ సరఫరా, నెలవారీ బిల్లులపై ఎప్పటికప్పుడు సమీక్షించి, లోపాలను సరిదిద్దాల్సిన డివిజనల్, అసిస్టెంట్ ఇంజనీర్లు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. వినియోగదారుల నుంచి వసూలు చేసిన బిల్లులో ఎక్కువ శాతం సొంతఖాతాల్లోకి మళ్లించి, సాధారణ బిల్లులను డిస్కం ఖాతాలో జమ చేస్తుండటం విశేషం. సరూర్‌నగర్ డివిజన్ హయత్‌నగర్ సెక్షన్ పరిధిలోని వీరభద్రనగర్కు చెందిన ఓ వినియోగదారుడు విద్యుత్ కనెక్షన్ కోసం 2012లో డిస్కంకు దర ఖాస్తు చేసుకోగా, ఆయనకు త్రీఫేజ్ మీటర్ జారీ చేశారు. మొదట్లో నెలకు సగటున 250 యూనిట్ల వరకు మీటర్ రీడింగ్ నమోదైనప్పటికీ...ఆ తర్వాత కొద్ది రోజులకే అది వేలల్లోకి చేరింది. మీటర్ కాలిపోయిందనే ఫిర్యాదు పేరుతో తొలిసారిగా 2013 సెప్టెంబర్‌లో పాతమీటర్ను మార్చి దాని స్థానంలో కొత్త మీటర్ అమర్చారు. ఆ తర్వాత 2014 డిసెంబర్, 2015 నవంబర్, 2016 జులై, 2016 అక్టోబర్, 2017 అక్టోబర్, 2018 మేలో మరో సారి, ఇలా ఏడాదికో సారి చొప్పున మొత్తం ఏడు సార్లు మీటర్లు మార్చడం గమనార్హం. అధిక మొత్తంలో రీడింగ్ నమోదైన ప్ర తిసారీ ఏదో ఒక సాంకేతిక కారణం చూపి మీ టర్ మార్చడం పరిపాటిగా మారింది. ఇలా ఒక ఏడాది 1120 యూనిట్లు రికార్డు కాగా.. మరో ఏడాది 4000 యూనిట్లకుపైగా నమోదైంది. ఇలా రీడింగ్ పెరిగిన ప్రతిసారి మీటర్లు మార్చడంలో ఆంతర్యమేమిటో సంబంధిత అధికారులకే తెలియాలి. వసూలు వేలల్లో..సంస్థకు వందల్లో ఇలా మీటర్ మార్చిన ప్రతిసారి సుమారు మూడువేలకుపైగా యూనిట్ల వ్యతాసం ఉండేది. ఎప్పటికప్పుడు వినియోగదారుని నుంచి పూర్తి బిల్లు వసూలు చేస్తున్నప్పటికీ..సంస్థ ఖాతాలో జమైంది మాత్రం వందల్లోనే కావడం గమనార్హం. రీడింగ్ భారీగా నమోదైన ప్రతిసారి స్టకప్, బరŠట్న్ వంటి సాంకేతిక కారణాలు చూపి వేలల్లో నమోదైన రీడింగ్‌ను వందలోపుకు మార్చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ఈ అక్రమాల్లో భాగస్వామం ఉన్నట్లు తెలిసింది. ఒకే సర్వీసు కనెక్షన్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటం, మీటర్లు మార్చుతుండటంపై ఉన్నతాధికారులు కూడా దృష్టిసారించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే వినియోగదారుడి పేరులోని అక్షరాలు, చిరునామాలను అటు ఇటు మార్చడంతో పా టు ఒకసారి చిరునామా ఆధారంగా, మరోసారి సర్వే నెంబర్ ఆధారంగా పలు మీటర్లు పొందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే సెక్షన్ పరిధిలో మరో ఐదు మీటర్లు ఉన్నట్లు తెలిసింది. నమోదైన మీటర్ రీడింగ్ ప్రకారం కనెక్షన్ లోడు కేటగిరి మారాల్సి ఉన్నా..చాలా మీటర్లు ఒక కిలోవాట్ పరిధిలోనే బిల్లులు జారీ అవుతున్నాయి. అక్రమాలపై కూపీ లాగుతున్నాం విద్యుత్ మీటర్లలో తలెత్తుతున్న సాంకేతికలోపాలు, వాటిస్థానంలో కొత్త మీటర్ల ఏర్పాటు, ప్యానల్ బోర్డుల కేటాయింపు అంశంపై కూపీ లాగుతున్నాం. ఇప్పటికే ఓల్డ్‌బోయిన్‌పల్లి ఘటనలో లైన్మెన్ సహా ఏఈలను సస్పెండ్ చేశాం. సరూర్‌నగర్ డివిజన్ హయత్‌నగర్ సెక్షన్ పరిధిలో చోటు చేసుకున్న అక్రమాలపై కూడా ఆరా తీస్తున్నాం. ఇప్పటికే సర్వీస్ నంబర్ల ఆధారంగా సమగ్ర విచారణకు ఆదేశించాం. ఒకటి రెండు రోజుల్లో పూర్తి నివేదిక వచ్చే అవకాశం ఉంది. సంస్థ ఖజానాకు గండికొట్టే వారెంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. –శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్, ఆపరేషన్స్ -
అడిగేవారెవరు!
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: విద్యుత్ మీటర్ల మార్పులో కాంట్రాక్టర్లు అందినంతా దోచుకుంటున్నారు. నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా పనులు చేస్తూ వినియోగదారులపై భారం మోపుతున్నారు. స్పెషల్ చార్జీల పేరిట వసూళ్లకు తెగబడినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో మీటర్ల మార్పునకు సంబంధించి డోన్ డివిజన్ కాంట్రాక్టర్‌కు ఇతర డివిజన్ల కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో గతంలో ఏర్పాటు చేసిన మెకానికల్ మీటర్ల కారణంగా లైన్‌లాస్ అధికంగా ఉండటంతో విద్యుత్ శాఖ హైటెక్నాలజీతో తయారు చేసిన డిజిటల్ మీటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మీటర్లు సెల్‌ఫోన్ చార్జర్ లైటు, విద్యుత్ స్వీచ్ బోర్డులోని చిన్నపాటి ఎల్ఈడీ లైటు వెలిగినా వాడకాన్ని నమోదు చేస్తాయి. ఈక్రమంలో రీప్లేస్మెంట్ ఆఫ్ హై అక్యూరసీ స్కీం కింద పాత మెకానికల్ మీటర్లు ఉన్న ప్రాంతంలో కొత్త డిజిటల్ మీటర్లు ఏర్పాటును గతేడాది నుంచి ఆచరణలోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పనులను డివిజన్ల వారీగా విభజించి, టెండర్ల ద్వారా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే మీటర్ల మార్పిడిలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఇదిలాఉండగా ఇతర డివిజన్లలో ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల కంటే డోన్ డివిజన్ కాంట్రాక్టర్‌పై అధికారులు మక్కువ చూపుతున్నారు. పాత మీటరు ఇంటి బయటే ఉంటే ఒక్కోదానికి రూ.66 చొప్పున చెల్లిస్తున్నారు. విద్యుత్ మీటరు ఇంట్లో ఉంటే ఆరుబయట ఏర్పాటు చేసేందుకు రూ.220(మాగ్జీమమ్) కాంట్రాక్టరుకు చెల్లించవచ్చని ఉన్నతాధికారుల ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ పనిని అంచనా వేసిన కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజినల్ ఇంజినీర్లు(ఆపరేషన్స్) ఇంట్లోని మీటర్‌ను ఆరుబయట అమర్చేందుకు మాగ్జీమమ్ మొత్తాన్ని తగ్గించి రూ. 195 మాత్రమే చెల్లిస్తామని కాంట్రాక్టర్లతో ఒప్పదం కుదుర్చుకొని పనులు చేయిస్తున్నారు. అయితే ఇదే పని కోసం డోన్ డివిజన్ కాంట్రాక్టర్‌కు రూ. 220 చెల్లిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. పనులు ఎలా చేయాలి... ఏం జరుగుతోంది పాత మీటర్ల స్థానంలో ఏర్పాటు చేసే డిజిటల్ మీటర్లు ఉచితంగా అమర్చాలి. కానీ కొత్త మీటర్ ఏర్పాటు చేసినందున డబ్బు ఇవ్వాలని కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ. 100 నుంచి రూ.200కు పైగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మీటరు ఏర్పాటుకు బోర్డు ఉంటే దానిపైనే అమార్చాలి. లేకపోతే ఉచితంగా చెక్కబోర్డు ఏర్పాటు చేసి మీటర్లు బిగించాలి. కానీ కొన్నిచోట్ల చెక్కబోర్డు ఏర్పాటు చేయకుండా గోడలపైనే నేరుగా మీటర్లు అమరుస్తున్నారు. గతంలో ఇంట్లో మీటర్ ఉంటే ఆరు బయటకు తీసుకొచ్చి అమర్చేందుకు తగిన విద్యుత్ తీగలు, సర్వీసు వైరు ఉచితంగా ఇవ్వాలి. కాని వైరు ఖర్చు పేరిట డబ్బు దండుకుంటున్నారు. మీటర్‌కు కనెక్షన్ ఇచ్చే సర్వీసు వైరుకు ఒక మీటర్ పోడవు(100 సెంటీమీటర్లు) ప్లాస్టిక్ పీవీసీ పైపు లేదా రింగ్ టైపు పైపు వేయాలి. అది అరకొరగా వేసి పని కానిచ్చేస్తున్నారు. ఫిద్యాదు చేస్తే కాంట్రాక్టర్లపై చర్యలు: డిజిటల్ మీటర్లను ఉచితంగా ఏర్పాటు చేయాలి. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ కొత్త మీటర్ల ఏర్పాటు పేరిట డబ్బు వసులు చేస్తున్నట్లు నా దృష్టికీ వచ్చింది. కొందరు వినియోగదారులు ఫోన్ చేసినా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. మీటరు మార్పు సందర్భంగా చెక్కబోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. వైర్లు ఉచితంగా వేసి, పీవీసీ రింగ్ పైపును అమర్చాలి. డోన్ డివిజన్లో కాంట్రాక్టర్‌కు రూ.220 ఇస్తున్న మాట వాస్తవమే. అక్కడ మార్పు చేయాల్సిన కనెక్షన్లు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. పరిశీలించి పనులు చేయాలంటే కాంట్రాక్టర్‌కు గిట్టుబాటు కావడం లేదనే ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నాం. - టి.బసయ్య, ఎస్ఈ, కర్నూలు -
తొలగని చీకట్లు
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టరేట్లో రెండు రోజులైనా చీకట్లు తొలగిపోలేదు. కోట్లలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించడంలో ఆయా శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎప్పుడూ బిజీగా ఉండే కలెక్టరేట్ శుక్ర, శనివారాల్లో అంధకారంలోనే మగ్గిపోరుంది. కలెక్టరేట్ సముదాయంలోని 42 కార్యాలయాల్లో పాలనపరమైన వ్యవహారాలన్నీ పూర్తిగా స్తంభించారు. ఏ సమాచారం కావాలన్నా కంప్యూటర్‌పైనే ఆధారపడడంతో ఒక్క పనీ జరగలేదు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది మొక్కుబడిగా వచ్చి కాలక్షేపానికే పరిమితమయ్యారు. కలెక్టరేట్లో మొత్తం రూ.3.87 కోట్ల విద్యుత్ బకారుులు ఉన్నారుు. తరచూ బకాయిలు పేరుకుపోతుండడంతో ఇటీవల శాఖలవారీగా విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కొన్ని కార్యాలయాల్లో మీటర్లు అమర్చినప్పటికీ.. బకాయిలు చెల్లించే వరకు కనెక్షన్ ఇవ్వబోమని ట్రాన్స్‌కో అధికారులు తేల్చి చెప్పేశారు. జిల్లా పాలనయంత్రాంగం నుంచి కూడా బకాయిల చెల్లింపుపై స్పందన లేకపోవడంతో విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేశారు. స్కాలర్షిప్ దరఖాస్తులకు గడువు సమయం కావడంతో సాంఘిక సంక్షేమ కార్యాలయంలో కార్యకలాపాలన్నీ నిలిచిపోయి విద్యార్థులు, వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెండు రోజులు చీకట్లతోపాటు ఆదివారం సెలవుదినం కావడంతో వరుసగా మూడు రోజులు కలెక్టరేట్ కు కరెంట్ కట్‌కట తప్పడం లేదు. సింగిల్‌ఫేస్.. ట్రాన్స్‌ఫార్మర్‌లో బ్రేక్ బకాయిల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాన్స్‌కో అధికారులు కలెక్టర్, జేసీ, డీఆర్వో కార్యాలయాలకు మినహాయింపునిచ్చారు. వీటికి సింగిల్ ఫేస్ ద్వారా కరెంట్ సరఫరా చేయడంతో ఓవర్‌లోడ్ పడి ట్రాన్స్ఫార్మర్లలో బ్రేక్ ఏర్పడింది. దీంతో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న బకాయిలను వసూలు చేసుకుందామనుకుంటే కొత్త సమస్యలు తలెత్తడంతో విద్యుత్‌శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ మరమ్మతుల వల్ల అదన పు భారాన్ని మోయాల్సి వస్తోందని వాపోతున్నారు.