
నెలల తరబడి వెతనాలు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఒకవైపు సిబ్బంది కొరత.. మరోవైపు పనిభారం. ప్రభు త్వ శాఖలను ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్య ఇది. అయినా ప్రభుత్వం ఖాళీల భర్తీపై పెద్దగా దృష్టి సారించకపోగా.. తాత్కాలిక పని కానిచ్చేసేందుకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను సృష్టించింది. పోనీ వారికైనా సక్రమంగా వేతనాలిస్తున్నారా అంటే.. అదీ లేదు. ఇస్తున్న అరొకర జీతాలు కూడా నెలల తరబడి చెల్లించకపోవడంతో ఈ విధానంలో పని చేస్తున్న వేలాది ఉద్యోగుల కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. జిల్లాలో మూడు నుంచి ఎనిమిది నెలలుగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదు. ఫలితంగా నానా అవస్థలు పడుతున్న ఉద్యోగులు కొత్త ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయో..
అసలు తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారుగా 20 ప్రభుత్వ శాఖల్లో వేలమంది ఉద్యోగులు ఈ విధానంలో పనిచేస్తున్నారు. వీరికి నెలకు ఒక్కొక్కరికి కనీసం రూ.8వేల వేతనం వేసుకున్నా రూ.2 కోట్లు అవుతుందని అంచనా. ఈ లెక్కన ఐదు నెలల వేతన బకాయిలు సుమారు రూ.10 కోట్ల వరకు నిలిచిపోయాయి. జీతాలు విడుదల కాకపోవడంతో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక అవస్థలు పడుతున్నారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు, వెచ్చాలు వంటి రోజువారీ అవసరాలు కూడా తీరక ఇబ్బంది పడుతున్నారు. వరుసగా ఐదు నెలల జీతాలు లేకపోవడంతో ఇప్పటికే పలు చోట్ల అప్పులు చేశారు. ఇక కొత్త అప్పులు పుట్టే అవకాశం కూడా లేక అనేక కుటుంబాలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. నిన్నటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
ఒక దశలో ఈ ఉద్యోగులను తొలగిస్తామని కూడా తెలిపింది. మరోవైపు రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడే ఆర్థిక ఇబ్బందులు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం వంటి పరిణామాలు ఉద్యోగుల భవిష్యత్తునే అయోమయంలోకి నెట్టేశాయి. కొన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగులు.. వారికి ఎన్ని నెలల వేతన బకాయిలు ఉన్నాయన్న విషయాన్ని పరిశీలిస్తే.. వైద్య ఆరోగ్యశాఖలో సుమారు 800 మంది ఓట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్నారు. వీరందరికీ ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించలేదు. సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖల్లో సుమారు 105 మంది పని చేస్తుండగా.. వీరికి కూడా ఎనిమిది నెలలుగా వేతనాలు అందలేదు. ఏపీ వైద్యవిధాన పరిషత్ పరిధిలో 60 మంది వరకు ఉన్నారు. వీరికి ఆరు నెలలుగా జీతాలు లేవు. రెవెన్యూ శాఖలో 102 మంది తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లుగా, భూసేకరణ విభాగంలో జూనియర్ అసిస్టెంట్లుగా వీరంతా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఎనిమిది నెలలుగా జీతాలు విడుదల కాలేదు.
అటవీశాఖలో మూడు నెలలుగా జీతాలు లేవు. ఈ శాఖలో 40 మంది వరకు పని చేస్తున్నారు. విద్యాశాఖ కార్యాలయంతోపాటు వివిధ పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా 420 మంది వరకు పని చేస్తున్నారు. వీరికి నాలుగు నెలలుగా జీతాలు చెల్లించలేదు. రిమ్స్ ఆస్పత్రిలో 180 వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి మూడు నెలలుగా జీతాలు విడుదల కాలేదు. 108, 104 సర్వీసుల్లో సుమారు 130 మంది సిబ్బంది ఉన్నారు. వీరికి ఆరు నెలలుగా జీతాలు లేవు. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో 456 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పని చేస్తున్నారు. వీరికి నాలుగు నెలల నుంచి జీతాలు విడుదల కాలేదు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, మున్సిపల్, వ్యవసాయ, భూసేకర ణ విభాగం, క్షయ నియంత్రణ, తదితర శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు లేవు.