
వంటకు తంటా
నగదు బదిలీ.. ఈ పేరు చెబితేనే సగటు లబ్ధిదారుల్లో గుబులు పుడుతోంది. వచ్చేనెల పదో తేదీ నుంచి వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలన్న కేంద్రం నిర్ణయంపై సగటు వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. గతంలో ఎదురైన చేదు అనుభవాలే ఇందుకు కారణం కాగా.. అందరూ ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఏలూరు: యూపీఏ సర్కార్ హయాంలో 2012 అక్టోబర్ నుంచి జిల్లాలో నగదు బదిలీ అమలు ప్రారంభమైంది. తీవ్ర ఒడిదుడుకులతో సాగినప్పటికీ ఆధార్ సీడింగ్ లేకపోవడంతో పేద వర్గాల వారు సైతం సబ్సిడీ లేకుండా రూ.800 నగదును చెల్లించి గ్యాస్ బండ భారాన్ని మోశారు. చివరకు ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నగదు బదిలీని కేంద్రం నిలిపివేసింది. తాజాగా మళ్లీ అమలు చేయాలని నిర్ణయించడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.
జిల్లావ్యాప్తంగా కనెక్షన్లు
జిల్లా 56 గ్యాస్ ఏజెన్సీల పరిధిల్లో 8,05,042 గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇందులో సింగిల్ సిలిండర్లు 3,79,222, డబుల్ 2,78,948, దీపం కనెక్షన్లు 1,45,914 మందికి ఉన్నాయి. ఇందులో అప్పట్లో 90 శాతం ఆధార్ సీడింగ్ ఉన్నవారికే నగదు బదిలీని అమలు చేశారు. ఇప్పుడు ఆధార్ సీడింగ్‌ను 96 శాతంకు పెంచామని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు.
లోపాలెన్నో!
నగదు బదిలీ పథకంలో సబ్సిడీ సొమ్ము వినియోగదారులకు సక్రమంగా జమకాకపోవడంతో తీవ్ర ఇక్కట్లపాలైన సంఘటనలతో ఈ విధానాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకుల పరంగా కూడా సబ్సిడీ సొమ్ము జమలో రూ.50ల వరకు వినియోగదారుడికి కోత పడేది. దీనికి తోడు గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్న వ్యక్తి ఖాతాకు 15 రోజుల తర్వాత కూడా సబ్సిడీ సొమ్ము జమ అయిన సందర్భాలు లేవు. గ్యాస్ సిలిండర్ ధర రూ.405 అయితే.. దీనికి అదనంగా రూ. 435 కలిపి కలిపి రూ.840 వరకు చెల్లించాల్సి వచ్చేది. చేతిలో డబ్బులు లేకపోయినా.. సిలిండరు తప్పనిసరికావడంతో ముందుగా అప్పుచేసి విడిపించుకున్నా.. సకాలంలో నగదు బదిలీ కాకపోవడంతో ప్రతినెలా ఇబ్బందులు తప్పేవి కావు.
తప్పనిసరి అయితే ప్రత్యేక సెల్ అవసరం
ఈ పథకం అమలు తప్పనిసరైతే లోపాలను సవరించుకునే దిశగా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిలిండర్ ధర చెల్లించిన ఒకటి రోజుల్లోనే వినియోగదారుని ఖాతాకు సొమ్ము జమ అయ్యేలా చూడాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ సెల్ ఏర్పాటు చేస్తేనే పథకం సజావుగా సాగే వీలుంది.
అమలుకు సిద్ధం (అభిప్రాయం)
జిల్లాలో నవంబర్ 10 నుంచి వంటగ్యాస్‌కు నగదు బదిలీ అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపై త్వరలోనే గ్యాస్ ఏజెన్సీలతో చర్చించి వారిని సమాయత్తం చేస్తాం. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా లేకపోయినా కొంత కాలం పాత పద్ధతిలోనే చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. వంట గ్యాస్ సబ్సిడీ ఎంతనేది త్వరలోనే నిర్ణయం అవుతుంది.
-శివశంకర్‌రెడ్డి, డీఎస్‌వో