జగ్జీ వాసుదేవ్ వెనక కార్పొరేట్ లాబీ
♦ ముఖ్యమంత్రి చంద్రబాబే నదీ తీరాన్ని ఆక్రమించారు
♦ వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ధ్వజం
సాక్షి, అమరావతి: ఆథ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన నదుల పరిరక్షణ ఉద్యమం వెనుక కార్పొరేట్, రాజకీయ లాబీ ఉందని వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆరోపించారు. నదుల పరిరక్షణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నదుల అనుసంధానం కంటే నదుల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రతి నదిలోని నీటికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయని, వేర్వేరు లక్షణాలున్న నీటిని నదుల అనుసంధానం పేరుతో కలిపితే ప్రకృతి విపత్తు జరుగుతుందన్నారు. విభిన్న గ్రూపులకు చెందిన రక్తాన్ని ఒక వ్యక్తికి ఎక్కిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో వేర్వేరు లక్షణాలున్న నదుల నీటిని కలిపితే అదే ఫలితం వస్తుందని చెప్పారు. లక్షల కోట్లతో చేపట్టే నదుల అనుసంధానం కాంట్రాక్టర్లకే లాభాన్ని చేకూరుస్తుందన్నారు.
కృష్ణా తీరంలో రాజధాని నిర్మాణం ప్రమాదకరం
ఇసుక తవ్వకాలు, ఆక్రమణలను నిలువరించకుంటే నదుల మనుగడ ఎక్కువ కాలం కొనసాగదన్నారు. యథారాజా తథాప్రజా అన్నట్టుగా ముఖ్యమంత్రే చట్టానికి విరుద్ధంగా నది పక్కనే నివాసం ఏర్పరుచుకుంటే ప్రజలు ఆక్రమణలు, ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా పరీవాహక ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకోవడం చట్టవిరుద్ధమన్నారు.