డీఆర్వో చాంబర్ ఎదురుగా అధికారుల పిలుపు కోసం వేచిచూస్తున్న కాంట్రాక్టర్లు
నిబంధనలకు నీళ్లొదిలారు.. అడ్డగోలు వ్యవహారానికి తెర తీశారు. రూపాయి ఖర్చు చేసే చోట వంద పెట్టారు.. అందిన కాడికి దోచుకోవాలని భావించారు. ఇష్టానుసారంగా బిల్లులు పెట్టేశారు. ఈ దోపిడీ వ్యవహారంపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో అక్రమార్కులు అవాక్కయ్యారు. స్పందించిన కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ అధికారులుగా జేసీ విజయకృష్ణన్, డీఆర్వోను నియమించారు. సమగ్ర విచారణ జరిగి నిజానిజాలు తేలేవరకు బిల్లులు చెల్లించకూడదని ఆదేశించారు. విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విచారణలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగుచూస్తున్నాయి.
సాక్షి, మచిలీపట్నం: జూలై 9, 10, 11 తేదీల్లో మంగినపూడి బీచ్ వద్ద బీచ్ ఫెస్టివల్ నిర్వహిం చారు. ఆహ్లాదం పేర దోపిడీ పర్వానికి తెర తీశా రు. స్టేజ్ ఏర్పాటు నుంచి లైటింగ్, ఆఖరికి నీళ్లు ఇవ్వకపోయినా ఇచ్చినట్లు రూ.లక్షల్లో బిల్లులు పెట్టారు. ఈ అక్రమ తంతుపై ‘సాక్షి’లో ‘బీచ్ ఫెస్టివల్ దోపిడీ’, ‘బీచ్.. లెక్కలన్నీ తూచ్’ శీర్షికన వ రుస కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పటి నుంచి సాగుతున్న విచారణ.. ప్రస్తుతం ఓ కొలిక్కి వస్తోంది. ఒక్కో బిల్లు వారీగా లోతైన విచారణ జరుగుతుండటంతో తమ బిల్లుల్లో ఎక్కడ కోత పడుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్వో చాంబర్‌లో డీఆర్వో లావణ్యవేణి, ఆర్డీఓ ఉదయభాస్కర్‌రావు బిల్లుల బాధితులతో ఇంటర్వ్యూలు నిర్వహించి బిల్లులకు సంబంధించి ఆరా తీశారు.
ఒక్కో కుండీ రూ.12 వేలు పైమాటే
బీచ్ ఫెస్టివల్‌లో భాగంగా రహదారులకు ఇరువైపులా మొక్కలు ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టు అప్పగించారు. ఒక్కో కుండీకి రూ.12 వేలకు పైగా బిల్లు పెట్టారు. ఇలా 1060 కుండీలకు గాను రూ.13 లక్షలు చెల్లించారు. ఈ విషయమై అధికారులు సదరు కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. కుండీలు అంత ధర పలుకుతాయా? వర్క్‌ఆర్డర్ లేకుండా ఎలా పనులు చేపట్టారు? అన్ని మొక్కలు పెట్టాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించినట్లు సమాచారం.
వెలుగుల మాటున మాయ!
బీచ్ ఫెస్టివల్ నిర్వహించిన మూడు రోజుల పాటు విద్యుత్ వెలుగులకు రూ.38 లక్షలు వెచ్చించారు. ఒక లైట్ పెట్టేచోట అన్ని లైట్లు ఎందుకు ఏర్పాటు చేశారు? ఎవరు పెట్టమని చెప్పారు? మూడు రోజులకు అంత మొత్తం ఎందుకు అవుతుంది? అని ప్రశ్నించారు. ముడా అధికారులు బాగా చేయాలని చెప్పడంతో పెట్టామని సదరు కాంట్రాక్టర్లు సమాధానం చెప్పినట్లు తెలిసింది.
ప్రకటనల పేరుతో పక్కదారి
బీచ్ ఫెస్టివల్ కార్యక్రమానికి సంబంధించి నాలు గు టీవీ ఛానళ్లకు (సాక్షి కాదు) ప్రకటనలు ఇచ్చి నట్లు బిల్లులు పెట్టారు. ఆ బిల్లులు సైతం కంపెనీ పేరు మీద కాకుండా ఓ యాడ్ ఏజెన్సీ పేరుమీద పెట్టారు. సదరు ఏజెన్సీ నిర్వాహకుడిని పిలిచి ఎలాంటి ప్రకటనలు ప్లే చేశారని ప్రకటించగా.. స్క్రోలింగ్ వేశామని సమాధానమిచ్చారు. స్కో లింగ్ ఒక్కో చానల్‌కు రూ.1.60 లక్షలు అవుతుం దా? అని అధికారులు ప్రశ్నించారు. యాడ్స్ ప్లే చేసినట్లు ఆధారాలు తీసుకురావాలని కోరగా.. నిర్వాహకుడు తెల్లమొహం వేసినట్లు తెలిసింది.
యూట్యూబ్‌కు రూ.56 వేలా?
విజయవాడకు చెందిన ఫేస్‌బుక్ అనుబంధంతో కూడిన ఓ యూట్యూబ్ చానల్‌కు ఏకంగా రూ.56 వేలు చెల్లించారు. ఆ ఛానల్‌లో వీడియో ఎప్పుడు ప్లే అయ్యిందో తెలియని పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా ఫ్లెక్సీలకు రూ.10 లక్షలు వెచ్చించినట్లు బిల్లులు పెట్టారు. మూడు రోజుల పాటు కూల్ ప్యూరిఫైడ్ వాటర్ సరఫరా చేసినట్లు రూ.9 లక్షలు బిల్లులు పెట్టారు. ఐడీ కార్డులకు రూ.70 వేలు, డివైడర్ల మధ్య, పూల కుండీలకు మట్టి తోలినట్లు రూ.లక్షల్లో బిల్లులు పెట్టేశారు.
అంతా కమీషన్ల వ్యవహారమే
అక్రమ బిల్లుల వెనుక అంతా కమీషన్ల వ్యవహారం నడిచినట్లు సమాచారం. బీచ్‌లో మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన స్టేజ్‌కు రూ.40 లక్షలు బిల్లు పెట్టారు.
అధికారులపై గుర్రు
బీచ్ ఫెస్టివల్‌లో బిల్లులు పెట్టిన వారిని శుక్రవారం డీఆర్వో ఛాంబర్‌కు పిలిపించి విచారించారు. అందులో ఎందుకు అంత మొత్తం బిల్లు పెట్టారు?, వర్క్ ఆర్డర్ లేకుండా ఎలా చేశారు? అసలు కొటేషన్లు సైతం నామమాత్రంగా ఎందుకు వేయించారు? అన్న ప్రశ్నలు సంధించారు. బిల్లుల్లో కొంచెం తగ్గిస్తే మంజూరవుతుందని అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే సమగ్ర విచారణ నిర్వహిస్తే మరిన్ని నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. బిల్లులు పరిశీలించిన అధికారులు తాము పనులకు తగ్గ బిల్లులు పెట్టామని ఎక్కువగా చేయలేదని పేపర్ మీద రాయించుకుని పంపించివేశారు.
Comments
Please login to add a commentAdd a comment