టీడీపీలో బుకీల కలకలం
- క్రికెట్ బుకీలతో కొందరు టీడీపీ నేతలకు సత్సంబంధాలు
- పోలీసులకు పట్టుబడ్డ కీలక బుకీ బాలాజీ అధికార పార్టీ ఎమ్మెల్యేకి బంధువు
- ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు
సాక్షి, గుంటూరు: జిల్లాలోని అధికార పార్టీలో క్రికెట్ బుకీల కలకలం రేగింది. ఇటీవల గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు కీలక క్రికెట్ బుకీతోపాటు, క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కీలక బుకీ అయిన మాదినేని బాలాజీ రాజధాని ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేకు వరసకు బావమరిది కావడంతో పాటు మరో బుకీ అయిన బి.చిరంజీవి సదరు ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు కావడంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్ళు తెచ్చారు. అయితే క్రికెట్ బెట్టింగ్‌ల్లో డబ్బులు పోగొట్టుకుని తనకు లక్షల్లో బాకీ పడ్డ వారి నుంచి సదరు క్రికెట్ బుకీ సుమారు పది ఎకరాలకు పైగా భూమి, 50 సెంట్ల ఇళ్ళ స్థలాలు బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బాధితులు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేను ఆశ్రయించడం, ఆయన సూచనతోనే బాధితులంతా అర్బన్, రూరల్ జిల్లాల ఎస్పీలను కలిసి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో అర్బన్ ఎస్పీ విజయరావు.. ఇద్దరు డీఎస్పీలతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందం ఐదు రోజుల క్రితం కీలక బుకీ బాలాజీతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి క్రికెట్ బెట్టింగ్‌లకు వినియోగించే సెల్‌ఫోన్, బ్యాగులు, ల్యాబ్‌టాప్‌లు, నగదు వంటివి స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్ళు పెరిగిపోవడంతో వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇంకా వీరి నుంచి కీలక సమాచారం రాబట్టడంతోపాటు, పరారీలో ఉన్న మరికొంత మంది కీలక బుకీలను అదుపులోకి తీసుకుంటే క్రికెట్ బెట్టింగ్ మూలాన్ని పట్టే అవకాశం ఉంటుంది.
అజ్ఞాతంలోకి పలువురు బుకీలు..
ఇదిలా ఉంటే క్రికెట్ బెట్టింగ్ ముఠా పోలీసులు అదుపులో ఉన్నారని తెలుసుకున్న జిల్లాలోని అనేక మంది కీలక బుకీలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అధికార పార్టీలోని తమ గాడ్‌ఫాదర్‌ల వద్దకు వెళ్లి వారి స్థావరాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా గుంటూరు నగరంలోని ఓ కీలక బుకీ అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత వద్దకు వెళ్ళగా, మరో క్రికెట్ బుకీ పల్నాడు ప్రాంతానికి చెందిన అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే వద్దకు, మరికొందరు ఓ మంత్రి వద్దకు వెళ్ళి పోలీసులు తమ జోలికి రాకుండా ఆశ్రయం కోరినట్లు తెలిసింది.
పోలీసులు తమను అరెస్టు చేయకుండా కాపాడితే భారీ మొత్తంలో ముట్టజెబుతామని ఆఫర్లు ఇచ్చినట్లు కూడా సమాచారం. గతంలోనూ పోలీసులు బుకీలను అదుపులోకి తీసుకున్న ప్రతి సందర్భంలో కొందరు అధికార పార్టీ నేతలు కలుగజేసుకుని ఒత్తిడి తీసుకురావడం అందరికి తెలిసిందే. దీంతో కీలక బుకీలను పోలీసులు విచారిస్తే అధికార పార్టీ నేతల మూలాలు సైతం బయటకు వస్తాయనేది బహిరంగ రహస్యమే. అయితే అధికార పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు మాత్రం బెట్టింగ్ బుకీలపై కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తుండటంతో బెట్టింగ్ రాజకీయం వేడెక్కింది.
బుకీల అరెస్టులు..
బుకీలను అర్బన్ జిల్లా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే సదరు బుకీలు గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని పెదకూరపాడు మండలం కంభంపాడు గ్రామానికి చెందిన వారు కావడంతో తమ వద్ద బలవంతంగా లాక్కొన్న భూములను తిరిగి ఇప్పించాలంటూ రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడుకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అయితే జిల్లాలోని క్రికెట్ బుకీలపై ఇప్పటికే పూర్తి స్థాయి నిఘా ఉంచామంటున్న రూరల్ ఎస్పీ క్రికెట్ బుకీల ఆట కట్టిస్తామని చెబుతున్నారు.
క్రికెట్ బెట్టింగ్ మహమ్మారికి జిల్లాలోని అనే కుటుంబాలు రోడ్డున పడడంతోపాటు బలవన్మరణాలకు పాల్పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు బెట్టింగ్ మాఫియాపై సీరియస్‌గా దృష్టి సారించి పార్టీలకు అతీతంగా ఎంతటివారు ఇందులో ఉన్నా కఠినంగా వ్యవహరిస్తేనే దీన్ని రూపుమాపే అవకాశం ఉంటుందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు.