సాక్షి, కడప: ఇటీవల కురిసిన వర్షం దెబ్బకు ఓ వైపు కళ్లెదుటే పంటకుళ్లిపోయి..మరోవైపు సాగుకు చేసిన పెట్టుబడి గుర్తుకొస్తూ వేలాది రైతులు వేదనపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం రైతుల వద్దకు వచ్చి, పంట పొలాలు పరిశీలించి వారికి దన్నుగా నిలవాలి. నష్టపోయిన పంటలను గుర్తించి పరిహారం చెల్లించాలి. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం పరిహారపు లెక్కలను పరిహాసంగా చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 40-50వేల ఎకరాల్లో పంటనష్టపోతే కేవలం 9,203 ఎకరాల్లో మాత్రమే పంటనష్టం వాటిల్లిందని అంచనాలు సిద్ధం చేస్తున్నారు. ఈ అంచనాలనే అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తే...జిల్లాలో నష్టపోయిన రైతులకు అందే అరకొర పరిహారం కూడా దూరమయ్యే ప్రమాదముంది.
ఈ నష్టాలు కన్పించలేదా?:
ఈ నెల 22వ తేదీ రాత్రి నుంచి వర్షాలు మొదలయ్యాయి. ఆరు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిశాయి. వర్షం దెబ్బకు జిల్లాలో సాగుచేసిన వరి, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, కొర్ర, సజ్జ, పెసర, మినుముతో పాటు ఉద్యాన పంటలైన చామంతి, ఇతర పూలతోటల్లో ఐదు రోజులపాటు వర్షపునీరు నిలిచి పంట మొత్తం నీటిపాలైంది. కొన్నిచోట్ల వంకలు, వాగులు పారి పంటల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. రాళ్లు వచ్చాయి. వర్షం కురిసినన్ని రోజులు, రోజూ అధికారులు సమావేశం నిర్వహించి పంటనష్టంపై ఆరా తీశారు. దీంతో అధికారయంత్రాంగం పంటనష్టంపై చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని బాధలో ఉన్న రైతులూ ఆనందపడ్డారు. తీరా అంచనాలు సిద్ధమయ్యాక చూస్తే కేవలం 9,200 ఎకరాల్లో మాత్రమే పంటనష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు.
వాస్తవానికి జిల్లాలో 40-50 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు సుస్పష్టంగా తెలుస్తోంది. పెద్దముడియం మండలంలో ఏటా 40వేల ఎకరాల్లో పప్పుశనగ సాగు చేస్తారు. ఈ ఏడాది 25వేల ఎకరాల్లో ఇటీవల పంటసాగు చేశారు. వర్షం దెబ్బకు దాదాపు 20వేల ఎకరాల్లో పొలంలో వేసిన విత్తనం కుళ్లియిపోయింది. మొలకలు వచ్చిన పంట నిలువునా మునిగింది. అలాగే రాజుపాళెం మండలంలో 3వేల ఎకరాల్లో పప్పుశనగ, 2వేల ఎకరాల్లో పత్తి, మరో వెయ్యి ఎకరాల్లో ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. ఈ రెండు మండలాల్లోనే 26వేల ఎకరాల నష్టం వాటిల్లింది.
అలాగే జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మండలాల్లో పప్పుశనగ, జొన్నకు నష్టం వాటిల్లింది. చాపాడు, దువ్వూరు, మైదుకూరుతో పాటు కుందూపరీవాహక ప్రాంతాల్లో వరిపంట నీట మునిగింది. పసుపుకూ తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే పెండ్లిమర్రి, వేముల మండలాల్లో ఉళ్లి పంటలు నష్టపోయాయి. చింతకొమ్మదిన్నె మండలంలోనే వేరుశనగ, పత్తి, సజ్జ, పసుపు, టమోటా, చామంతి, వరి కలిపి వెయ్యి ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఈ విధంగా వేంపల్లి, మైలవరం, సింహాద్రిపురం, తొండూరుతో పాటు చాలా మండలాల్లో పలురకాల పంటలకు నష్టం వాటిల్లింది.
ఈ క్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తిగా పంటలను పరిశీలించి నివేదికలు రూపొందించితే వాస్తవంగా ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లిందనే అంశాలు స్పష్టంగా తెలుస్తాయి. కానీ మొక్కుబడిగా పర్యటించి కేవలం వారి అంచనాల మేరకే ప్రణాళికలు రూపొందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
లెక్క తప్పారు
Published Wed, Oct 30 2013 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement
Advertisement