కూచిపూడి నృత్య శిక్షణలో బాలికలు
ఆర్థిక పరిస్థితులు.. కుటుంబ కారణాలుఆ పిల్లలను విద్యకు దూరం చేశాయి. పేదరికం బడిమానిపించేసింది. కొందరినైతే బడిముఖం కూడా చూడనివ్వలేదు. ‘ఆడపిల్లకు చదువెందుకు’ అంటూ సమాజం వెక్కిరించింది. ఇలాంటి పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నాయి కస్తూర్బా పాఠశాలలు. బడి బయట పిల్లల కు విద్యనందించడమే ధ్యేయంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పాఠశాలలు మొదలయ్యాయి. ఇక్కడ అవకాశాలను అందిపుచ్చుకున్న బాలికలు చదువులో అదరగొడుతున్నారు. కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా ముందుకు సాగుతున్నారు.చదువుతోపాటు కళలు, ఇతర ఉపాధి కోర్సుల్లో ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.
అచ్యుతాపురం(యలమంచిలి) :జిల్లాలో 34 కస్తూర్బా పాఠశాలలున్నాయి. ఒక్కొక్క పాఠశాలలో 200 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బడిమానేసినవారు, తండ్రి చనిపోయి తల్లిపోషణలో ఇబ్బందులు పడుతున్న కుటుంబాల్లో పిల్లలకు ఈ పాఠశాలల్లో ప్రవేశానికి ప్రాధాన్యమిచ్చారు. వికలాంగులైన పిల్లలు, తల్లిదండ్రులు వికలాంగులై ఉండి.. ఆడపిల్లని పోషించుకోలేని పరిస్థితి ఉన్నవారికి కూడా ఈ పాఠశాలల్లో సీట్లు కేటాయించారు. ఇలాంటి పిల్లలు కస్తూర్బా పాఠశాలల్లో అడుగుపెట్టారు. ఆశయాల సాధనకు కృషి చేస్తున్నారు. చదువుల్లో తాము ఎవరికీ తక్కువ కాదనే విషయాన్ని పదోతరగతి ఫలితాల్లో 10/10 సాధించి.. నిరూపించారు. రెట్టించిన ఉత్సాహంతో ఉన్నత చదువుల దిశగా ముందుకు సాగుతున్నారు. విద్యతో పాటు ఉపాధి కల్పనే లక్ష్యంగా వివిధ కోర్సులను వీరికి నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో వీరికాళ్లపై వీరు నిలబడేలా ప్రోత్సహిస్తున్నారు. నిర్వాహకులు ఖాళీసమయాల్లో వివిధ అంశాలను నేర్పించేందుకు దృష్టి సారిం చారు. కూచిపూడి నృత్యం, కరాటే, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, జానపద కళలు, వివిధ క్రీడల్లో ఇక్కడి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వాటిలో కూడా ప్రతిభ చూపి శభాష్ అనిపించుకున్నారు. తల్లిదండ్రులు వీరి ప్రతిభాపాటవాలు చూసి ‘మా పిల్లలలేనా..’ అంటూ మురిసిపోయేలా తీర్చిదిద్దారు.
ప్రణాళికాబద్ధంగా...
జిల్లాలోని అన్ని కస్తూర్బా పాఠశాలల్లోనూ ప్రణాళికాబద్ధంగా చదివించారు. వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, డిజిటల్ తరగతులతో అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా నిష్ణాతులైన ఉపాధ్యాయులతో మెలకువలను బోధించారు. అవన్నీ విద్యార్థుల ప్రగతికి దోహదపడ్డాయి.
కరాటే, యోగా శిక్షణలో రాణించారు...
కస్తూర్బా బాలికల పాఠశాలల్లో విద్యతోపాటు కరాటే, యోగా, వివిధ సాంస్కృతిక అంశాలపై శిక్షణ అందించారు. విద్యార్థుల సమయం వృధా కాకూడదని ప్రత్యేక శిబిరాల్లో శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు, పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పఠనా సామగ్రి, ఇన్వెర్టర్, కంప్యూటర్లను అందజేసి ప్రోత్సహిస్తున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకొని బాలికలు తమ సత్తాచాటుతున్నారు.
ప్రతిభ చూపారు..
ఇక్కడ విద్యనభ్యసించిన బాలికలు పదోతరగతి పరీక్షల్లో 10/10 పాయింట్లు సాధించి సత్తాచాటారు. విద్యార్థినులకు విద్యపట్ల ఉన్న ఆసక్తి మంచి ఫలితాలకు దోహదపడుతోంది. ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రణాళికా
బద్ధంగా చదివిస్తున్నాం. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు పాఠశాలల అభివృద్ధికి సహాయం అందిస్తున్నారు. ఇంటర్ చదివే అవకాశం కూడా కొన్ని కస్తూర్బా పాఠశాలల్లో ఏర్పాటు చేశాం. ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించాం.– వి.భారతి ఎస్‌ఓ అచ్యుతాపురం కేజీబీవీ
ఆసక్తితో ముందుకు...
ఇళ్లకు వెళ్తే ఏదో ఒక పనిలో పెడతారనే భయం పిల్లల్లో ఉంది. ఏదైనా నేర్చుకునే ఆసక్తి బాగా కనబడింది. అందుకే తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకున్నారు. కరాటే, యోగా, భరతనాట్యంలో ప్రతిభ చూపారు. విద్యతోపాటు ఇతర రంగాల్లో రాణిస్తున్నారు. ఖాళీ సమయాన్ని క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అల్లికలు నేర్పేందుకు ఇక్కడి సిబ్బంది చొరవచూపుతున్నారు. చదువు పూర్తయిన తరువాత ఉపాధి అవకాశం పొందేలా ప్రోత్సహిస్తున్నారు. – దేవరాయల్, ఎంఈఓ, అచ్యుతాపురం
Comments
Please login to add a commentAdd a comment