దక్షిణ కోస్తాపై ‘హెలెన్’ పడగ | Cyclone Helen threat for south coastal of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

దక్షిణ కోస్తాపై ‘హెలెన్’ పడగ

Published Thu, Nov 21 2013 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM

దక్షిణ కోస్తాపై ‘హెలెన్’ పడగ

దక్షిణ కోస్తాపై ‘హెలెన్’ పడగ

  • రేపు ఉదయం ఒంగోలు వద్ద తుపాను తీరం దాటే అవకాశం
  •   నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ముప్పు
  •   అప్రమత్తమైన ప్రభుత్వం.. రంగంలోకి సహాయక దళాలు 
  •   భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  •  
     సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్/ఢిల్లీ: పై-లీన్ తుపాను, భారీవర్షాల దెబ్బ నుంచి కోలుకుంటున్న రాష్ట్రంపైకి మరో పెనుతుపాను ముంచుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారానికి తుపానుగా మారిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలి పింది. దీన్ని ‘హెలెన్’ తుపానుగా పిలుస్తున్నారు. పశ్చిమంగా పయనిస్తూ మచిలీపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 310 కి.మీ. దూరంలో, కావలికి తూర్పున 420 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. తీవ్ర తుపానుగా మారి నెల్లూరు-మచిలీపట్నం మధ్య ఒంగోలు వద్ద శుక్రవారం ఉదయానికి తీరం దాటే అవకాశాలున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల బుధవారం రాత్రి నుంచే కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. 
     
     హెలెన్ పెను తుపాను ప్రభావం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్త ఒ.ఎస్.ఆర్.యు.భానుకుమార్ ‘సాక్షి’తో చెప్పారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెట్లు నేలకొరగడం, విద్యుత్ వైర్లు తెగిపడటం, ఇళ్ల పైకప్పులు లేచిపోవడం వంటి సంఘటనలు జరగవచ్చని తెలిపింది. దాదాపు 2 మీటర్ల మేర అలలు ఎగిసి పడనున్నాయి. ఉభయగోదావరి జిల్లాలతోపాటు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో హెలెన్ తుపాను ప్రభావం వల్ల ఈదురుగాలులు, చెదురుమదురు వర్షాలు మినహా పెద్ద ప్రమాదం ఉండబోదని చెబుతున్నారు. తీరం దాటాక 48 గంటలపాటు దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలపై ఉంటుందన్నారు. దక్షిణ కోస్తాంధ్రలో బుధవారం రాత్రి నుంచే గాలులు గంటకు 55-65 కి.మీ. వేగంతో వీచే అవకాశాలున్నట్టు అధికారులు తెలిపారు. కృష్ణపట్నంలో 5వ, వాడ్రేవులో 7వ, నిజాంపట్నం, మచిలీపట్నంలో 6వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొదని, సముద్రంలో ఉన్నవారు తక్షణమే తీరానికి చేరుకోవాలని హెచ్చరించారు. 
     
     అధికార యంత్రాంగం అప్రమత్తం: ‘హెలెన్’ తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి 4 జిల్లాల కలెక్టర్లను ఆదేశిం చారు. బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. చిత్తూరు పర్యటనలో ఉ న్న సీఎం కిరణ్ కూడా హెలెన్ తుపాన్‌పై ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శితో ఫోన్‌లో మాట్లాడారు. జాతీయ బృందాలతోపా టు, కోస్తా ప్రాంత రక్షణ విభాగం, మెరైన్ పోలీసు సిబ్బంది ప్రజలకు సాయం అందించడానికి రంగంలోకి దిం చినట్లు తెలిపారు. సచివాలయంలో 23456005, 23451043 నం బర్లతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా, డివిజన్, మండలస్థాయిల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటయ్యాయి. 
     
     25 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం: పార్థసారథి
     హెలెన్ తుపాను ప్రభావం వల్ల నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 25 సెంటీమీటర్ల వరకూ భారీ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ సి పార్థసారథి వెల్లడించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు రెండేసి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఒక్కొక్క జాతీయ విపత్తు నివారణ దళ బృందాలను పంపినట్లు తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
     మర్రి శశిధర్‌రెడ్డి సమీక్ష: తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఎ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి బుధవారం సమీక్షించారు. తదనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 6 జాతీయ విపత్తు నివారణ దళం బృందాలను ముందుగానే పంపామన్నారు.   
     
     నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 33 మండలాలపై తీవ్ర ప్రభావం
     నెల్లూరు జిల్లాలో 12 మండలాల పరిధిలోని తీరంలోని గ్రామా ల నుంచి 25 వేలమందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు.  మంగళగిరి నుంచి 90 మందితో కూడిన నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ బృందాలు రెండు కావలి, నెల్లూరు చేరుకున్నాయి. ప్రకాశం జిల్లాలో తీరం వెంబడి ఉన్న 11 మండలాల్లోని 28 గ్రామాలపై తుపాను ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుంటూరు జిల్లాలో 6 మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. మంగళవారం వేటకు వెళ్లిన కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సొర్లగొందికి చెందిన నలుగురు జాలర్లు బుధవారం సురక్షితంగా ఇంటికి చేరారు. 
     
     లైలా అంతటి తీవ్రత..
     న్యూఢిల్లీ: హెలెన్ తుపాను తీవ్రత ఫై-లిన్ తుపాను అంత ఉండదని, అయితే 2010లో ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడిన లైలా తుపాను అంతటి విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ  శాస్త్రవేత్త ఎం మహాపాత్ర బుధవారం  న్యూఢిల్లీలో విలేకరులతో చెప్పారు. మచిలీపట్నం- నెల్లూరు మధ్య ఒంగోలు సమీపంలో 22వ తేదీ ఉదయం హెలెన్ తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement