Cyclone Helen
-
అపార నష్టం.. తీరని కష్టం
సాక్షి, ఏలూరు :‘ఏం పాపం చేశామని మాకీ శాపం. పుడమి తల్లిని నమ్ముకున్న మాకు ఎందుకీ శోకం...’ అంటూ అన్నదాతలు దీనంగా ఆ దేవుణ్ణి అడుగుతున్నారు. కలోగంజో తాగుతూ.. నాలుగు తాటాకులతో గూడు కట్టుకున్న తమపై ప్రకృతికి ఎందుకింత కోపమని అభాగ్యులు ఆక్రోశిస్తున్నారు. పంటలు మునిగి.. ఇళ్లు కూలి.. దిక్కుతోచని స్థితిలో ప్రజలంతా వేదనకు గురవుతున్నారు. తుపాను ప్రభావానికి గురైన 8 మండలాల్లోని 37 గ్రామాల్లో ‘సాక్షి’ బృందం శనివారం పర్యటించింది. ఎక్కడ చూసినా కళ్లు చెమర్చే దృశ్యాలే కనిపించాయి. అష్టకష్టాల్లో అన్నదాతలు హెలెన్ తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా 2లక్షల 57 వేల 115 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కొద్దోగొప్పో మిగిలిన పంటను దక్కించుకోవడానికి అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. నేలనంటిన.. నీట మునిగిన వరి దుబ్బులను కోసి.. బరకాలపై వేసి రోడ్లపైకి తెచ్చుకుంటున్నారు. ఎక్కడికక్కడ బరకాలపై పనలను ఆరబెడుతున్నారు. 120నుంచి 130 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు 2,320 ఎకరాల్లో అరటి, 1,388 ఎకరాల్లో కూరగాయ పంటలు కలిపి మొత్తం 3,693 ఎకరాల్లో ఉద్యాన పంటలు పనికిరాకుండా పోయాయి. చేపల చెరువుల గట్లు ఏకమైపోయూయి. ఆక్వా రైతులకు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దాదాపు 400కొబ్బరి చెట్లు ధ్వంసమయ్యూయి. పై-లీన్ నష్టం రూ.250 కోట్లు.. హెలెన్ నష్టం రూ.500 కోట్లు హెలెన్ తుపాను ప్రభావంతో పంటలు, ఆస్తులకు ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.600 కోట్లమేర నష్టం వాటిల్లినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో పంటనష్టాల విలువ రూ.500 కోట్ల మేర ఉంటుందని అం చనా. గత నెలలో పై-లీన్ తుపాను, అల్పపీడనం కారణంగా జిల్లాలో 1.36 లక్షల ఎకరాల్లో వరి నీటిపాలైంది. అప్పట్లో పంటలకు సుమా రు రూ.250 కోట్ల మేర నష్టం వాటిల్లగా, హెలెన్ తుపాను దానికి రెట్టింపు నష్టం మిగి ల్చింది. రెండు ఉపద్రవాల వల్ల మొత్తం రూ.750 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో 6 లక్షల ఎకరాల వరి వేయగా, కేవలం రెండు లక్షల ఎకరాల్లో మాత్రమే పంట మిగి లింది. అదికూడా నీటిలో నానుతోంది. ఇదిలావుండగా, హెలెన్ తుపాను ప్రభావంతో 22 పక్కా ఇళ్లు, 113 పూరి గుడిసెలు నేలమట్టమయ్యూరుు. మొత్తంగా 882 ఇళ్లు దెబ్బతిన్నాయి. వాటిలో నివసించేవారికి నీడ కరువైంది. కొందరు పొరుగు ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు. ఈ నష్టం విలువ ఎంత అనేదానిపై అధికారులు అంచనాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యూరు. ప్రభుత్వ ఆస్తులకూ భారీ నష్టం 116 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు, 110 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్లు ధ్వంసమయ్యాయి. పంచాయతీ రోడ్లకు రూ.5.19 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తీర గ్రామాల్లో అత్యవసరంగా రోడ్లకు మరమ్మతులు చేసేందుకు కలెక్టర్ సిద్ధార్థజైన్ రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో వేములదీవి, బియ్యపుతిప్పలో రెండు కాలనీలు, చినమైనివానిలంక, తూర్పుతాళ్లు నుంచి వేములదీవి రోడ్డును శనివారం యుద్ధప్రాతిపదికన నిర్మించారు. విద్యుత్ శాఖకు నష్టాల షాక్ రూ.35 లక్షల విలువైన 312 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 100 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. వీటి నష్టం రూ.15 లక్షలుగా అంచనా వేస్తున్నారు. మొత్తం మీద విద్యుత్ శాఖకు రూ.50 లక్షల నష్టం వాటిల్లింది. 20 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు తెగిపోయాయి. వాటిని బాగుచేయడానికి 25మంది అధికారులు, 200 మంది సిబ్బంది రెండు పొక్లెయిన్ల సాయంతో శ్రమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించినప్పటికీ, నరసాపురం మండలంలో 12 గ్రామాలు, యలమంచిలి మండలంలో 8 గ్రామాలు, మొగల్తూరు మండలంలో 10 గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి గానీ సరఫరా పునరుద్ధరించలేమని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 4,985 మందిని తరలించారు. వారికి 12,846 ఆహార పొట్లాలు, 26,756 మంచినీటి ప్యాకెట్లు అందించారు. 97 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు వైద్యసేవలు చేస్తున్నారు. మరో తుపాను ముప్పు పొంచి ఉందని తెలియడంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. -
వర్ష బాధితులను ఆదుకుంటాం..
గుంటూరు సిటీ, న్యూస్‌లైన్: గత నెల, రెండు రోజులగానూ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం ఆయన ఇన్చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్, వివిధ శాఖల అధికారులతో బాధితులకు అందించిన సాయంపై సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెలలో వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 3,330 ఇళ్లు దెబ్బతినగా, రూ.91.29 లక్షలు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఒక్కొక్క కుటుంబానికి వంట సామగ్రికి రూ.2,500, దుస్తుల కొనుగోలుకు రూ.2,500 అందించినట్లు చెప్పారు. హెలెన్ కారణంగా జిల్లాలో 10 వేల హెక్టార్లలో వరి దెబ్బతిందని తెలిపారు. నాలుగు మండలాల్లో ఏడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి రెండువేల మందిని తరలించినట్లు చెప్పారు. రాష్ట్ర విభజనపై పునరాలోచించాలి.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కేంద్రం పునరాలోచించాలని మంత్రి కాసు కోరారు. రా్రష్ట విభజన వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో చేసే ఉద్యమం ప్రజల నుంచి వచ్చిందని తెలిపారు. రాష్ర్ట సమైక్యతకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఎం మారతారని ఇటీవల వచ్చిన ప్రచారాల్లో వాస్తవం లేదన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ సింగం బసవపున్నయ్య, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ఉన్నారు. -
హెలెన్ తుఫాను దెబ్బకు కోనసీమ అతలాకుతలం
రాష్ట్ర చరిత్రలో అత్యంత విషాదాంతంగా చెప్పుకునే దివిసీమ ఉప్పెన తరువాత అతి పెద్ద ప్రళయం నవంబరు ఆరు తుపానే. అంతులేని ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమైన ఈ తుపాను వచ్చినే నవంబరు నెలంటనే కోనసీమ వాసులు ఇప్పటికీ అందోళన చెందుతుంటారు. సరిగా 17 ఏళ్ల తరువాత ఇదే నెలలో వచ్చిన హెలెన్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఉప్పాడ కొత్తపల్లి వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. రోడ్డు మొత్తం కోతకు గురైంది. కాకినాడ-ఉప్పాడ మధ్య నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న రాక్ వే మొత్తం ధ్వంసమైంది. అలలు తీవ్రంగా ఎగసిపడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. -
తుఫాను దెబ్బకు తూర్పుగోదావరి అతలాకుతలం
హెలెన్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఉప్పాడ కొత్తపల్లి వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. రోడ్డు మొత్తం కోతకు గురైంది. కాకినాడ-ఉప్పాడ మధ్య నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న రాక్ వే మొత్తం ధ్వంసమైంది. అలలు తీవ్రంగా ఎగసిపడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో రోడ్డు మొత్తం కొట్టుకుపోయి రాళ్లు మాత్రమే మిగిలాయి. పది నుంచి పన్నెండు మీటర్ల ఎత్తు మేర అలలు ఎగసిపడుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో ఆరుగురు మరణించారు. అమలాపురం రూరల్ వన్నెచింతలపూడిలో ఒకరు, ఉప్పలగుప్తం మండలం వాడపర్రులో ఒకరు, కాట్రేనికోన మండలంలో ఇద్దరు, ఐ.పోలవరం మండలం కొత్త మురముళ్లలో ఒకరు, కొత్తపేట మండలం గంటి చినపేటలో ఒకరు చొప్పున మరణించారు. గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు వంద కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. చెట్ల, గుడిసెలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలకు అపార నష్టం వాటిల్లింది. అంతర్వేది వరకు ఉన్న తీరప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. 13 మండలాల పరిధిలో ఉన్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఆగిపోయారు. కాకినాడ హార్బర్ నుంచి ఐదు బోట్లలో వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. దాదాపు 20 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ద్వారా గాలిద్దామనుకున్నా, వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో కోస్ట్‌గార్డ్ బృందాలు మాత్రమే గాలిస్తున్నాయి. లక్షన్నర హెక్టార్లలో వరి కోత దశలో ఉంది. మరికొన్ని చోట్ల చేలు కోతలు కోసి ఆరబెట్టుకున్నారు. ఈ పంటలన్నీ హెలెన్ తుఫాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు సర్వనాశనం అయిపోయాయని రైతులు అంటున్నారు. -
తూర్పుగోదావరిలో హెలెన్ బీభత్సం, ఆరుగురి మృతి
హెలెన్ తుఫాన్ తీరం దాటిన కాసేపటికే కోస్తా జిల్లాలను అతాలకుతలం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో బీభత్సం సృష్టిస్తోంది. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో ఆరుగురు మరణించారు. అమలాపురం రూరల్ వన్నెచింతలపూడిలో ఒకరు, ఉప్పలగుప్తం మండలం వాడపర్రులో ఒకరు, కాట్రేనికోన మండలంలో ఇద్దరు, ఐ.పోలవరం మండలం కొత్త మురముళ్లలో ఒకరు, కొత్తపేట మండలం గంటి చినపేటలో ఒకరు చొప్పున మరణించారు. గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు వంద కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. చెట్ల, గుడిసెలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలకు అపార నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ప్రాంతంలో చెట్టుకూలి ఓమహిళ మరణించింది. కోనసీమ ప్రాంతంలో అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలను అధికారులు ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. ప్రధానంగా సఖినేటిపల్లి, రాజోలు, కాట్రేనికోన, ఐ.పోలవరం, అమలాపురం రూరల్, అల్లవరం, మలికిపురం, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కూర్చున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు తుఫాను గాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. గురువారం రాత్రి నుంచే ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ తుఫాను గతంలో వచ్చిన 1996 నవంబర్ 6 నాటి తుఫాను అంత తీవ్రంగా లేకపోయినా.. అధికారుల వైఫల్యం కారణంగా నష్టాలు మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకినాడ ప్రాంతంలో 32 మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వారిలో 20 మంది ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. 12 మంది మాత్రం ఓఎన్జీసీ నౌక సాయంతో తీరానికి చేరుకోగలిగారు. హెలెన్ తుపాను హెల్ప్‌లైను నంబర్లు కాకినాడ: 0884 - 2365506 ఏలూరు: 08812 - 230050 నరసాపురం: 08814 - 27699 కొవ్వూరు: 08813 - 231488 జంగారెడ్డిగూడెం: 08812 - 223660 మచిలీపట్నం: 08672 - 252572, 1077 విజయవాడ: 0866 - 2576217 విశాఖ: 1800 - 42500002 శ్రీకాకుళం: 08942 - 240557, 9652838191 నెల్లూరు: 0861- 2331477, 2331261 -
తీరం దాటిన హెలెన్ తుఫాన్
-
పట్టపగలే చుక్కలు చూపించిన హెలెన్ తుఫాను
సాధారణంగా తుఫానులంటే సాయంత్రం లేదా రాత్రిపూట మాత్రమే బీభత్సం సృష్టిస్తాయి. కానీ ఈసారి హెలెన్ తుఫాను మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మిట్ట మధ్యాహ్నం పూట తీరం దాటింది. నాలుగు రోజులుగా విశాఖపట్నం నుంచి ఒంగోలు తీరం వరకు దోబూచులాడుతూ వచ్చిన హెలెన్ తుఫాను.. చివరకు కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ తుఫాను తీరాన్ని దాటినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందన్ అధికారికంగా ప్రకటించారు. తుఫాను ప్రభావంతో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. వీటి వేగం గంటకు సుమారు 80 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉంది. ఈ గాలుల ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు కూడా పడిపోతున్నాయి. బోట్లు అల్లకల్లోలంగా మారాయి. కృత్తివెన్ను మండలంలో వెయ్యిమందనిఇ పునరావా సకేంద్రాలకు తరలించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుఫాను ప్రభావం వల్ల సీతనపల్లి హరిజన వాడలో కొబ్బరిచెట్టు పడి కాంతారావు అనే వృద్ధుడు మరణించాడు. ప్రకాశం జిల్లాలోని 11 మండలాల్లోని 28 గ్రామాలపై తుఫాను ప్రభావం పడింది. పంటలు నీట మునిగాయి. మొత్తమ్మీద లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా మీద హెలెన్ తుఫాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ప్రధానంగా నరసాపురం, మొగల్తూరు తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. అంతర్వేదిలో సముద్రం బీభత్సంగా ఉంది. లంకల్లో జీవనం అస్తవ్యస్తంగా ఉంది. భారీగా కొబ్బరి చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయాయి. విద్యుత్ సరఫరా కూడా పలు ప్రాంతాల్లో నిలిచిపోయింది. కాళీపట్నం- భీమవరం, నరసాపురం-పాలకొల్లు మధ్యలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ప్రాంతంలో చెట్టుకూలి ఓమహిళ మరణించింది. కోనసీమ ప్రాంతంలో అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలను అధికారులు ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. ప్రధానంగా సఖినేటిపల్లి, రాజోలు, కాట్రేనికోన, ఐ.పోలవరం, అమలాపురం రూరల్, అల్లవరం, మలికిపురం, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కూర్చున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు తుఫాను గాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. గురువారం రాత్రి నుంచే ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ తుఫాను గతంలో వచ్చిన 1996 నవంబర్ 6 నాటి తుఫాను అంత తీవ్రంగా లేకపోయినా.. అధికారుల వైఫల్యం కారణంగా నష్టాలు మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకినాడ ప్రాంతంలో 32 మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వారిలో 20 మంది ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. 12 మంది మాత్రం ఓఎన్జీసీ నౌక సాయంతో తీరానికి చేరుకోగలిగారు. -
తుఫాను ప్రభావం: పెనుమంట్ర ఎమ్మార్వో మృతి
పశ్చిమగోదావరి జిల్లాలో హెలెన్ తుఫాను ఓ అధికారి ప్రాణాన్ని బలిగొంది. హెలెన్ ప్రభావంతో చెట్లు విరిగిపడ్డాయి. సహాయ కార్యక్రమాలను దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించేందుకు పెనుమంట్ర తహసీల్దార్ దంగేటి సత్యనారాయణ తన కారులో అధికారులతో కలిసి బయల్దేరారు. అయితే, తుఫాను గాలుల వల్ల విరిగిన చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయి ఉన్నాయి. వెనుక నుంచి లారీ వస్తుండటం, దగ్గరలో మలుపు ఉండటంతో కారు ఓ చెట్టును ఢీకొంది. దీంతో తహసీల్దార్ సత్యనారాయణ అక్కడికక్కడే మరణించారు. పేరుపాలెం వద్ద కూడా ఓ చెట్టు పడిపోయి మరో వ్యక్తి మరణించినట్లు తెలిసింది. పేరుపాలెం వద్ద సముద్రం పది అడుగుల మేర ముందుకొచ్చింది. ఈదురుగాలులు వీస్తున్నాయి. 80-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వృక్షాలు నేలకూలుతున్నాయి. కరెంటు స్తంభాలు పడిపోతున్నాయి. పదివేలమందిని ఇక్కడినుంచి తరలించారు. పెదమైనివానిలంక, చినమైనివాని లంక ప్రాంతాల్లో వంతెన కూలిపోయేలా ఉంది. ప్రజలను బలవంతంగా తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కలెక్టర్ సిద్దార్థ జైన్ తెలిపారు. -
ముంచుకొస్తున్న హెలెన్ తుఫాన్
-
ముంచుకొస్తున్న హెలెన్ తుఫాన్
హెలెన్ తుఫాన్ ముంచుకొస్తోంది. తీరానికి మరింత చేరువవుతోంది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 80 కి.మీ. దూరంలో కదులుతోంది. శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం-నర్సాపురం మధ్య... తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. తుఫాను కోస్తా జిల్లాలపై ప్రభావం చూపనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంబడి సముద్రంలో అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. మచిలీపట్నం, బంటుమిల్లి, బందర్, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండడంతో తీరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కాకినాడలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పాడ - కాకినాడ బీచ్ లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుపాను దృష్ట్యా ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, విశాఖ, గంగవరం, భీమిలి, కళింగపట్నం ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు ఎగురవేశారు. ఇక తీరప్రాంతంలో ఉన్న పాఠశాలలకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ సెలవు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.... సెలవులో ఉన్న సిబ్బంది తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జిల్లా అధికారులతో కలెక్టర్ సిద్దార్ధ జైన్ సమావేశమై పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఎనిమిది మండలాల పరిధిలో 37 గ్రామాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఇక గుంటూరు జిల్లా పైన కూడా తుపాన్ ప్రభావం నెలకొంది. 39 గ్రామాలకు తుపాన్ ప్రభావం ఉంది. అలాగే నెల్లూరు జిల్లాపై కూడా హెలెన్ తుపాను ప్రభావం చూపుతోంది. హెలెన్ తుపాను హెల్ప్‌లైను నంబర్లు కాకినాడ: 0884 - 2365506 ఏలూరు: 08812 - 230050 నరసాపురం: 08814 - 27699 కొవ్వూరు: 08813 - 231488 జంగారెడ్డిగూడెం: 08812 - 223660 మచిలీపట్నం: 08672 - 252572, 1077 విజయవాడ: 0866 - 2576217 విశాఖ: 1800 - 42500002 శ్రీకాకుళం: 08942 - 240557, 9652838191 నెల్లూరు: 0861- 2331477, 2331261 -
తూ.గో.జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులు
-
ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసిన ద.మ.రైల్వే
సికింద్రాబాద్ : హెలెన్ తుపాను ప్రభావం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రత్యేక ఇంజనీర్ల బృందంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే ..... ఈరోజు ఉదయం విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఈలాగే సికింద్రాబాద్ రైల్ నిలయంలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం అందిస్తోంది. తుపాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ .... అధికారులను ఆదేశించారు. -
భయపెడుతున్న హెల్న్!
విజయనగరం వ్యవసాయం/ కలెక్టరేట్, న్యూస్‌లైన్: హెలెన్ తుఫాన్ జిల్లాలో రైతులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. వారిని తీవ్రంగా భయపెడుతోంది. వరుసగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. మొదట వర్షాభావం.. మొన్న పై-లీన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆ తరువాత కురిసిన భారీ వర్షాలు పూర్తిగా ముంచేశాయి. వాటి నుంచి తేరుకుని మిగిలి న పంటను కోసి ఇంటికి తరలించే సమయంలో ఏర్పడిన మరో తుఫాన్ ముంచుకొస్తుండడంతో రైతులు తీవ్రంగా భీతిల్లుతున్నారు. పండిన కొద్దిపాటి గింజలు కూడా దక్కకపోతే తాము ఎలా బతకాలని వారు ఆందోళన చెందుతున్నారు. తమను కాపాడాలంటూ భవంతుడిని వేడుకుంటున్నారు. ఈ తుఫాన్ ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 200 కిలో మీటర్లదూరంలో ఉంది. దీని ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. మరో 24 గంటల వరకూ దీని ప్రభావం ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 35 హెక్టార్లలో వరికోతలు పూర్తయ్యాయి. పొలాల్లో ఉంచిన వరిపైరును సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఉరుకులు పరుగులు పెడతున్నారు. ఎస్.కోట, తెర్లాం, బలిజిపేట, నెల్లిమర్ల, పార్వతీపురం డివిజన్లో పలు చోట్ల గురువారం జల్లులు కురిసి, పొలాల్లోకి నీరి చేరింది. పంట మరో నాలుగైదు రోజుల్లో చేతికి వస్తుందనుకుంటున్న సమయంలో హెలెన్ తుఫాన్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. మరి కొంతమంది నాలుగు, ఐదు రోజుల్లో కోతలు ప్రారంభించాలని భావించినా తుఫాన్ కారణంగా వాయిదా వేసుకున్నారు. మరో ఒకటి రెండు రోజులు వర్షం కురిస్తే వేలాది ఎకరాల్లో పంట నీటిపాలయ్యే ప్రమాదం ఉంది. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టుడుతున్నారు. ఆది నుంచి కష్టాలే: ఈ ఏడాది రైతులకు ఆది నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి. నాట్లు వేయడం దగ్గర నుంచి పంట చేతికి వచ్చేవరకు అన్నీ కష్టాలే. వర్షాభా వ పరిస్థితుల కారణంగా నాట్లు వేయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. జూలై, ఆగస్టు నెలల్లో వరుణుడు కరుణించని కారణంగా సెప్టెంబర్ నెలాఖరు వరకు నాట్లు వేయని పరి స్థితి ఏర్పడింది. కనీసం తిండి గింజలయినా దొరుకుతాయన్న ఆశతో రైతులు నాట్లు వేశారు. వర్షాలు ఆలస్యంగా పడడం వల్ల పూర్తి స్థాయి లో నాట్లు వేయలేదు. లక్షా 24 వేల హెక్టార్లలో ఖరీఫ్ సీజన్లో నాట్లు వేయవలసి ఉండగా 96 వేలు హెక్టార్లలో మాత్రమే వేశారు. 28 వేల హెక్టార్లు వరకు సాగవలేదు. నాట్లు వేసిన తరువాత కూడా వరుణుడు ముఖం చాటేయడంతో చాలా వరకు ఎండిపోయాయి. ఈ పరిస్థితుల నుంచి తేరుకోకముందే గత నెలలో భారీ వర్షా ల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిం ది. ఈ నష్టాన్ని అధికారులు ఇంకా పూర్తి స్థాయి లో అంచనా వేయనేలేదు. జిల్లా వ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, చెరుకు, పెసర, మినుము, చోడి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం నుంచి తేరుకోకముందే మళ్లీ హెలెన్ రూపంలో తుఫాన్ భయపెడుతోంది. హెలెన్ తుఫాన్ కొనసాగితే తీవ్ర స్థాయిలో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తగ్గిన ఉష్ణోగ్రతలు.... తుఫాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీనికి తోడు చల్లగాలులు వేగంగా వీస్తుండడంతో ప్రజలంతా చలికి వణికిపోతున్నారు. గాలులు కొనసాగితే వృద్ధులు, చంటిపిల్లలు అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రోడ్లపై రాకపోకలు సైతం తగ్గిపోయాయి. అప్రమత్తంగా ఉండాలి హెలెన్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కోతలు కోయరాదని వ్యవసాయశాఖ జాయింట్ డైరక్టర్ లీలావతి రైతులకు సూచించారు. తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. -
‘హెలెన్’ టెన్షన్
సాక్షి, కాకినాడ :పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ‘హెలెన్’ తుపానుగా మారిన జిల్లావాసులను గడగడలాడిస్తోంది. ఇది మచిలీపట్నం-నరసాపురం మధ్య శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటవచ్చని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించడంతో ఉభయ గోదావరి జిల్లాలను హై ఎలర్ట్ జోన్‌గా ప్రకటించారు. తీరం దాటే సమయంలో వంద నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు తీరప్రాంత వాసులను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే తీరంలో 60-80 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. తీర గ్రామాల్లో గురువారం ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, మిగిలిన ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో సముద్రతీరం ఈదురుగాలులతో, ఎగసిపడే అలలతో అల్లకల్లోలంగా ఉంది. ఉప్పాడ, ఓడలరేవు, అంతర్వేది పల్లిపాలెం వద్ద సముద్ర జలాలు తీరం మీదకు చొచ్చుకొస్తున్నాయి. ఉప్పాడ వద్ద అలలు ఆరడుగుల మేర ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ శివారు సుబ్బంపేట నుంచి ఉప్పుటేరు పెదవంతెన వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు పలుచోట్ల భారీగా కోతకు గురైంది. ఉప్పాడ-కోనపాపపేట రహదారి చాలాచోట్ల ఛిద్రమైంది. అలల ఉధృతికి రక్షణగోడ ఎక్కడికక్కడ కోతకు గురై, రహదారిపైకి రాళ్లు ఎగసిపడడంతో కనీసం నడిచి వెళ్లేందుకుకూడా వీల్లేకుండా తయారైంది. అలలు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 1.5 మీటర్ల ఎత్తున ఎగసిపడవచ్చని, అలలు తీరం మీదకు మరింతగా చొచ్చుకు రావచ్చన్న అంచనాతో తీర, పల్లపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పునరావాస కేంద్రాలకు ఏర్పాట్లు రానున్న 48 గంటల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖాధికారులు హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. స్థానికంగానే మకాం వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ మండల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో 1077, 0884- 2365506 టోల్‌ఫ్రీ నంబర్లతో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయంతో పాటు తీర ప్రాంత తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తీర, ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ పోర్టులో 9వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గ్రామాల్లో టాంటాలు వేసి మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లను గుర్తించి వాటిలో ఉన్న మత్స్యకారులను త్వరితగతిన తీరానికి చేరుకోవాలని వైరలెస్ సెట్ల ద్వారా హెచ్చరించారు.కాగా తొండంగి మండలం పెరుమాళ్లపురం నుంచి మూడు బోట్లలో 21 మంది, యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేట, కాకినాడ సూర్యారావుపేటల నుంచి రెండుబోట్లలో మరో 14 మంది వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోగా, ఓడలరేవు వద్ద ఏడుగురితో ఒక బోటును, పెరుమాళ్ల పురం వద్ద మరో ఏడుగురితో మరో బోటును మెరైన్ పోలీసులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. పెరుమాళ్లపురం నుంచి 14 మందితో వెళ్లిన రెండు బోట్లు, సూర్యారావు పేట నుంచి ఏడుగురితో వెళ్లిన ఒక బోటు భైరవపాలెం సమీపంలోని రిలయన్స్రిగ్ల వద్ద చిక్కుకున్నట్టు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. రంగంలోకి దిగిన మెరైన్, కోస్ట్‌గార్డు బృందాలు వారిని తీరానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధం : కలెక్టర్ ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ నీతూ ప్రసాద్ చెప్పారు. తుపాను నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను గురువారం రాత్రి కాకినాడలో ఆమె విలేకరులకు తెలిపారు. మలికిపురం నుంచి తొండంగి వరకు తీర ప్రాంత మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించామన్నారు. జాతీయ విపత్తు నివారణా సంస్థ నుంచి రెండు రెస్క్యూటీమ్‌ల కోసం ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిపారు. ఈ టీమ్‌లు వస్తే పునరావాస చర్యలను పర్యవేక్షించేందుకు రాజోలు, అమలాపురానికి పంపిస్తామన్నారు. జిల్లా నుంచి వేటకు వెళ్లిన ఐదు బోట్లలో 14 మందితో రెండు బోట్లు ఇప్పటికే తీరానికి చేరుకున్నాయని, 21 మందితో ఉన్న మిగిలిన మూడు బోట్లు ఇంకా ఒడ్డుకు చేరుకోవాల్సి ఉందన్నారు. ఈ బోట్లలోని మత్స్యకారులు కూడా సురక్షితంగానే ఉన్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. వారిని కూడా తీరానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు తీరప్రాంతంలోని ప్రతి మండలానికీ రూ.లక్ష చొప్పున విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఏలేరు రిజర్వాయర్‌లో సామర్థ్యానికి(86.5 మీటర్ల) తగ్గ నీరు ఉందని, తుపాను కారణంగా కురిసే భారీ వర్షాల వల్ల ఇన్‌ఫ్లో మరింత పెరిగితే మిగులు జలాలను సముద్రంలోకి మళ్లీ వదిలే అవకాశాలున్నాయని చెప్పారు. ఏలేరు పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు. వారితోపాటు తీర, పల్లపు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. -
నడిసంద్రంలో..
సూర్యారావుపేట (కాకినాడ రూరల్), న్యూస్‌లైన్ :కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట నుంచి వేటకు వెళ్లిన బోటు సముద్రంలో చిక్కుకోవడంతో మత్స్యకార కుటుంబాలు ఆందోళనలో కొట్టుమిట్టాడాయి. సోమవారం ఉదయం సూర్యారావుపేట నుంచి ఏడుగురి సభ్యులతో వేటకు బయలుదేరిన బోటు హెలెన్ తుపానులో చిక్కుకుంది. మెత్తని వల వేట కావడంతో మూడురోజుల్లో అంటే బుధవారం సాయంత్రానికే తిరిగి రావాలి, అయితే బుధవారం నాటికే తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. వేటకు వెళ్లిన మిగతావారందరూ తిరిగి వచ్చినా, ఒక బోటుతో సహా ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. రాత్రి 12 గంటల వరకు పనిచేసిన ఫోన్లు ఆ తరువాత ఆగిపోవడంతో తమవారి సమాచారం తెలియడంలేదని ఆయా కుటుంబాల వారు ఆందోళన చెందారు. బాధితులు మెరైన్, సీ పోర్టు అధికారులకు సమాచారం తెలిపారు. అమలాపురంలో ఫిర్యాదు చేయాలని సీపోర్ట్ అధికారులు చెప్పారని, చిన్న బోటు మాత్రమే ఉండడంతో తుపానులో సముద్రంలోకి వెళ్లడం కుదరదని మెరైన్ అధికారులు చెప్పారని మత్స్యకారులు వాపోయారు. కాగా సర్పంచ్ యజ్జల బాబ్జీ, గ్రామ కార్యదర్శి ఎస్వీవీ శ్రీనివాసరావు జిల్లా అధికారులతో చర్చిం చారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు ఓడలరేవు సమీపంలోని రిలయన్స్ రిగ్ వద్ద మత్స్యకారులతో కనిపించిన ఒక బోట్‌ను తొలుత సూర్యారావుపేట బోట్‌గా మెరైన్ సిబ్బంది భావించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే వీరు అద్దరిపేట మత్స్యకారులని తేలింది. ఏడుగురు ఇంకా ప్రమాదంలోనే... ఓడలరేవు(అల్లవరం) : సూర్యారావు పేటకు చెందిన ఏడుగురు మత్సకారులు బోటు ఇంజన్ చెడిపోవటంతో తీరానికి చేరుకోలేక, రక్షించేవారు లేక అగచాట్లు పడుతున్నా రు. రెండు రోజులుగా వీరు తమవారికి ఫోన్లో వారు సమాచారం అందిస్తూ వచ్చారు. దూడా తాతారావుకు చెందిన ఫైబర్ బోట్లో తిక్కాడ అప్పారావు, కొండబాబు, సత్తిబాబు,దూడా జగన్నాథం, అప్పన్న, ఎరుపల్లి సామేలు, కర్రి చిన్నలు 18న సముద్రంలో వేటకు వెళ్లారు. తుపాను పట్టిందని బోటు ఓనర్ తాతారావు సమాచారం ఇవ్వటంతో తీరానికి బుధవారం బయలుదేరారు. భైరవపాలెం రిలయన్స్ రిగ్గుల వద్దకు వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంటకు బోటు ఇంజన్ చెడిపోయి వారు సముద్రంలో చిక్కుకున్నారు. లంగరు వేసి బోట్‌ను నిలిపి తాతారావుకు సమాచారం ఇచ్చారు. ఈదురు గాలులు, సముద్రపు ఉధృతికి బోట్ కొట్టుకు పోతున్నదంటూ సెల్ ఫోన్ ద్వారా సందేశాలు పంపుతూనే ఉన్నారు. బోటును కదలకుండా ఆపేందుకు రూ. 50 వేల వలను సముద్రంలో వేసినప్పటికీ ఫలించలేదు. వల తెగిపోయి, లంగరు ఇనుప రాడ్లు విరిగిపోవటంతో బోటు ఓడలరేవు వైపు కదులుతూ ఉందని తీరానికి సమాచారం అందించారు. బోటు బోల్తాపడుతుందని, తమను రక్షించాలని వారు వేడుకున్నారు. బోటు ఓనర్ తాతారావు కోస్టల్ సెక్యూరిటీ, కోస్టుగార్డు, కలెక్టర్, మత్స్యశాఖ అధికారులకు ఈవిషయం బుధవారమే తెలిపారు. తగిన బోట్లు లేవని అధికారులు చెప్పడం తగ దని దీనిపై తాతారావు ఆవేదన వ్యక్తం చేశారు. కోస్టల్ సెక్యూరిటీ, కోస్టుగార్డు, నావీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాగా గురువారం సాయంత్రం నుంచి రెండు రెస్క్యూ టీమ్‌లు ఈ మత్స్యకారుల కోసం గాలిస్తున్నా యి. ఇదిలా ఉండగా ఓడలరేవు సమీపంలో సముద్రంలో చుక్కాని విరిగిపోయి నిలిచిన మరో బోటులోని ఆరుగురిని కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు రక్షించారు. గురువారం మరో బోటు పంపి వీరిని రప్పించారు. ఉప్పాడ కొత్తపల్లి మైనాబాద్కు చెందిన దూల జోతిబాబు, సొది పులుసు, జెల్లా యాదవయ్య, చెక్కా కాశియ్య, నక్కా రాజు, కుచ్చి సూరిబాబు సురక్షితంగా ఓడలరేవు తీరానికి చేరిన వారిలో ఉన్నారు. -
అప్రమత్తం
సాక్షి, గుంటూరు :‘హెలెన్’ తుపాను శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం వుందని తెలియడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో తుపాను అప్రమత్త చర్యల ప్రత్యేకాధికారిగా బి.వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్ తీరప్రాంత మండలాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. తుపాను సహాయక చర్యల నిమిత్తం వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందితో ఏర్పాటు చేసిన మొత్తం 70 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ప్రధానంగా తీర మండలాలైన బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం, నిజాంపట్నం, రేపల్లె, నగరంలో 100 లోత ట్టు గ్రామాల్ని గుర్తించి సహాయక చర్యలకు ఉపక్రమించారు. లోతట్టు ప్రాంతాల గుర్తింపు ‘హెలెన్’ తుపాను ప్రభావంతో సముద్రం అలలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే సముద్రతీరాన వున్న ఆరు మండలాలు బాపట్ల, కర్లపాలెం, నగరం, రేపల్లె, పిట్టలవానిపాలెం, నిజాంపట్నంలను లోతట్టు ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడి నివాసాలను ఖాళీ చేయించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీని కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. నిజాంపట్నం ఓడరేవులో పదో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ఇతర జిల్లాల నుంచి గజఈతగాళ్లు, మోటారు బోట్లు, కిరోసిన్, డీజిల్, రక్షణ దుస్తుల్ని తెప్పించేందుకు ఇన్చార్జి కలెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నారు. తుట్టుకునే శక్తి లేదు.. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా రైతులు తీవ్ర పంట నష్టాలను చవిచూశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, కొండవీటి వాగు, నల్లమడ డ్రెయిన్ ముంపు తదితర సమస్యలతో రైతులు ఇప్పటికే చావుదెబ్బ తిన్నారు. తుళ్లూరు, మంగళగిరి, రేపల్లె, నగరం, నిజాంపట్నం ప్రాంతాల్లోని కరకట్టల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. హెలెన్ ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు కురిస్తే తట్టుకునే శక్తి లేదని రైతులువాపోతున్నారు. ప్రకృతి విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజల సహకారం కూడా తప్పనిసరని ఇన్చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్ విజ్ఞప్తి చేశారు.తీరంలో భయాందోళన.. నిజాంపట్నం,న్యూస్‌లైన్: హెలెన్ తుపాను ముప్పు పొంచి ఉండటంతో తీర ప్రాంత గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే సముద్రపు అలలు భారీగా ఎగసిపడుతున్నాయి.సముద్రం గురువారం 20 మీటర్ల మేర ముందుకు వచ్చింది. వేటకు వెళ్లిన బోట్లన్నీ తిరిగి ఒడ్డుకు చేరాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉందని పోర్టు అధికారులు తెలిపారు. 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక నిజాంపట్నం ఓడరేవులో గురువారం పదవ నంబర్ ప్రమాద సూచి కను ఎగురవేశారు. విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం సమాచారం మేరకు ప్రమా ద సూచికను ఎగురవేసినట్లు పోర్టు కన్జర్వేటర్ మోకా వెంకట రామారావు తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని బోట్లను భద్రపరుచుకుని అధికారుల ఆదేశాలను పాటించాలని ఆయన సూచించారు. -
ఆంధ్రాకు తరలిన హెలెన్ తుపాను
టీ.నగర్, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుపాను ఆంధ్ర తీరం వైపు పయనిస్తోంది. గురువారం ఉదయం నాటికి ఇది బంగాళాఖాతంలో తూర్పు నుంచి ఈశాన్యం వైపుగా ప్రయాణించి ఆంధ్రరాష్ర కావలి నుంచి 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ప్రభావంతో తమిళనాడుకు పెద్దగా నష్టం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. అయితే ఆంధ్రాలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఈ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. ఈ జిల్లాలలో గురువారం రాత్రి నుంచి భీకర గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ హెచ్చరించింది. చెన్నై వాతావరణ పరిశోధన శాఖ డెరైక్టర్ రమణన్ మాట్లాడుతూ హెలెన్ తుపాన్ శుక్రవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం మచిలీపట్టణం సమీపాన తీరాన్ని దాటవచ్చని తెలిపారు. దీంతో ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని రానున్న 24 గంటల్లో దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందన్నారు. గత 24 గంటల్లో గరిష్టంగా ముళచ్చల్ ప్రాంతంలో 12 సెంటీమీటర్లు, తక్కలైలో 9 సెంటీమీటర్లు, అంబాసముద్రంలో 6 సెంటీమీటర్లు, తెన్‌కాశిలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు తెలిపారు. -
ముంచుకొస్తున్న హెలెన్ ముప్పు
-
తుఫాన్ ప్రభావంతో సముద్రంలో చిక్కుకున్న 18 మంది మత్స్యకారులు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ హెలెన్ తుఫాన్ తీర ప్రజల్ని వణికిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 18 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. రెండు బోట్లలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు అలల ఉధృతికి తీరానికి చేరుకోలేకపోయారు. వీరిని రక్షించేందుకు కోస్ట్ గార్డ్, మెరైన్ సిబ్బంది రంగంలోకి దిగారు. హెలెన్ తుఫాన్ మచిలీపట్నానికి 250 కిలో మీటర్ల దూరంలో కదులుతోంది. దిశ మార్చుకుంటూ కదులుతోంది. రేపు సాయంత్రం తీరం దాటే అవకాశముంది. తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. నెల్లూరు జిల్లాలో సముద్రం 30 అడుగులు ముందుకుచొచ్చుకుని వచ్చింది. అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఈ తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పూరిళ్లు, గుడిసెలు ఎక్కువగా ధ్వంసం అవుతాయని తెలిపింది. చెట్లు విరిగి పడటం వల్ల విద్యుత్తు, కమ్యూనికేషన్ లైన్లకు కూడా నష్టం కలుగుతుందని హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
హెలెన్ తీవ్రత.. 18 మంది మత్స్యకారుల గల్లంతు
హెలెన్ తుఫాను దిశ మార్చుకుంది. మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో అది కేంద్రీకృతమై ఉంది. ఒంగోలుకు తూర్పు ఈశాన్యంగా 200 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నానికి 200 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంలోను ఇది స్థిరపడింది. శుక్రవారం సాయంత్రం తర్వాత పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం - కృష్ణా జిల్లా మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావం గురువారం రాత్రి నుంచే కనిపిస్తుంది. గోదావరి జిల్లాల నుంచి ప్రకాశం, నెల్లూరు జిల్లాల వరకు గల తీరప్రాంతం అంతా భారీ నుంచి అతి భారీ వర్షాలు (25 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ) కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రస్తుతానికి తుఫాను ఈశాన్య దిశగా కదులుతోంది. ఈ తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పూరిళ్లు, గుడిసెలు ఎక్కువగా ధ్వంసం అవుతాయని తెలిపింది. చెట్లు విరిగి పడటం వల్ల విద్యుత్తు, కమ్యూనికేషన్ లైన్లకు కూడా నష్టం కలుగుతుందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి ప్రస్తుతానికి 'ఆరంజ్' హెచ్చరికను జారీచేసింది. అంటే పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని అర్థం. మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని, తీరప్రాంతాల్లో ఉంటున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. నెల్లూరు జిల్లాలో సముద్రం 30 అడుగులు ముందుకుచొచ్చుకుని వచ్చింది. అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. తుఫాను తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా కృష్ణా జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో 110 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. ముఖ్యంగా దివిసీమ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించామని తుఫాను ప్రత్యేక అధికారి నవీన్ మిట్టల్ తెలిపారు. -
దక్షిణ కోస్తాపై ‘హెలెన్’ పడగ
-
ముంచుకొస్తున్న ‘హెలెన్’
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తుపానుగా మారి మరింత బలపడనుంది. ఈ తుపానుకు హెలెన్‌గా నామకరణం చేశారు. హెలెన్ ప్రభావంతో 21, 22, 23 తేదీల్లో జిల్లాలోని కోస్తా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే 25 సెంటీమీటర్లకు పైగా కుండపోత వర్షం పడే అవకాశం ఉన్నట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రకాశం, విశాఖ జిల్లాల మధ్య తుపాను తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అదే విధంగా బుధవారం అర్ధరాత్రి నుంచి గంటకు 55-75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. అదే విధంగా సముద్రంలో అలలు 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తుతో ఎగిసిపడొచ్చు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈ మూడు రోజులూ జాలర్లు సముద్రంపై వేటకు వెళ్లడాన్ని అధికార యంత్రాంగం పూర్తిగా నిషేధించింది. తుపాను సహాయక చర్యలకు టోల్ ఫ్రీ 1077 నంబరును ఏర్పాటు చేశారు. స్పెషలాఫీసర్లతో కలెక్టర్ సమావేశం.. తుపాను ప్రభావం జిల్లాలోని కోస్తా తీర ప్రాంతాలపై అధికంగా ఉండనుండటంతో 11 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ మండలాల పరిధిలోని 28 గ్రామాల ప్రజలను 21వ తేదీ మధ్యాహ్నం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్సు హాలులో బుధవారం సాయంత్రం తీర ప్రాంత ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం నుంచే తీరప్రాంత ప్రజలను, అదే విధంగా ముంపునకు గురయ్యే అవకాశాలున్న కాలనీలను ఖాళీ చేసి తక్షణమే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. వీటితో పాటు పునరావాస కేంద్రాలను వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ ప్రజల అవసరాాల మేరకు ఆహారాన్ని, మంచినీటిని, కొన్ని మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల్లో మంచినీరు, ఆహారాన్ని ప్రభుత్వ వైద్యాధికారులు పరీక్షించిన తర్వాత మాత్రమే ప్రజలకు పంపిణీ చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాను సమీక్షించాలని ట్రాన్స్‌కో ఎస్ఈని ఆదేశించారు. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తే విద్యుత్ సరఫరా నిలిపి వేయాలన్నారు. ఒక వేళ విద్యుత్ లైన్లు దెబ్బతిన్న చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. రంగంలోకి జాతీయ విపత్తుల నివారణ సంస్థ.. జాతీయ విపత్తుల నివారణ సంస్థ అసిస్టెంట్ కమాండెంట్ కిషన్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం కోస్తా తీర ప్రాంతంలో ప్రజలు, అధికారులకు అందుబాటులో ఉంటారు. ఇతర సమాచారం కోసం సెల్ నం: 94409 98620లో సంప్రదించవచ్చు. ప్రత్యేకాధికారిగా కృష్ణబాబు తుపానుకు సంబంధించిన జిల్లా ప్రత్యేకాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంటీ కృష్ణబాబును ప్రభుత్వం నియమించింది. ఆయన గురువారం మధ్యాహ్నంకల్లా ఒంగోలు నగరానికి రానున్నారు. -
‘హెలెన్’ హడల్
అమలాపురం, న్యూస్‌లైన్ :బంగాళాఖాతం అన్నదాతల పాలిట ఆగర్భ శత్రువులా మారుతోంది. వ్యవసాయం ప్రకృతితో పాచికలాటలా తయారైంది. కష్టఫలితం చేతికి వచ్చే తరుణంలో వాతావ‘రణభేరి’ మోగుతోంది. నోటికాడికొచ్చిన కూడు లాక్కున్నట్టు... స్వేదం చిందించి పండించిన పంట కోతకు వచ్చిన వేళ గాలీవాన రూపంలో దాడి చేసి రైతుల ఆశలను నేలమట్టం చేస్తోంది. వారికి నష్టాలనే మిగుల్చుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బ తినగా మిగిలిన కొద్దిపాటి పంటను దక్కించుకుంటున్న సమయంలో ‘హెలెన్’గా పేరు పెట్టిన తుపాను పొంచి ఉండడం జిల్లా రైతులను కలవరానికి గురిచేస్తోంది. జిల్లాలో ఖరీఫ్ కోతలు జోరుగా సాగుతున్నాయి. గత నెల 21 నుంచి 28 వరకు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షాల వల్ల ఆలస్యమైన కోతలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. తూర్పు డెల్టాలో ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట సబ్ డివిజన్ల పరిధిలో 60 శాతం, అనపర్తి, పి.గన్నవరం సబ్డివిజన్ల పరిధిలో 35 శాతం, మధ్య డెల్టాలోని అమలాపురం, ముమ్మిడివరం, మెట్టలోని తుని, జగ్గంపేట, పిఠాపురం సబ్డివిజన్ల పరిధిలో 20 శాతం కోతలు పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కోతలు జోరందుకుంటున్నాయి. ధర ఆశించినంతగా లేకపోవడంతో రైతులు ధాన్యం అమ్మకాలు పెద్దగా చేపట్టడంలేదు. కోతలు పూర్తయిన చోట పంట ధాన్యంగా కళ్లాల్లో, పనలుగా పొలాల్లోనే ఉంది. ఈ సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం హెలెన్ తుపానుగా మారిందన్న వాతావరణ శాఖ ప్రకటన రైతుల ను భీతావహులను చేస్తోంది. తుపాను ఒంగోలు, కావలి మధ్య తీరం దాటుతుందని, దీని ప్రభావం వల్ల కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. గత నెలలో సంభవించిన పై-లీన్ తుపాను జిల్లా రైతులనూ కలవర పరిచినా.. దాని ప్రభావం శ్రీకాకుళం జిల్లాకు పరిమితమవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అంతలోనే మళ్లీ వాయుగుండం, -
దక్షిణ కోస్తాపై ‘హెలెన్’ పడగ
రేపు ఉదయం ఒంగోలు వద్ద తుపాను తీరం దాటే అవకాశం నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ముప్పు అప్రమత్తమైన ప్రభుత్వం.. రంగంలోకి సహాయక దళాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్/ఢిల్లీ: పై-లీన్ తుపాను, భారీవర్షాల దెబ్బ నుంచి కోలుకుంటున్న రాష్ట్రంపైకి మరో పెనుతుపాను ముంచుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారానికి తుపానుగా మారిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలి పింది. దీన్ని ‘హెలెన్’ తుపానుగా పిలుస్తున్నారు. పశ్చిమంగా పయనిస్తూ మచిలీపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 310 కి.మీ. దూరంలో, కావలికి తూర్పున 420 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. తీవ్ర తుపానుగా మారి నెల్లూరు-మచిలీపట్నం మధ్య ఒంగోలు వద్ద శుక్రవారం ఉదయానికి తీరం దాటే అవకాశాలున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల బుధవారం రాత్రి నుంచే కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. హెలెన్ పెను తుపాను ప్రభావం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్త ఒ.ఎస్.ఆర్.యు.భానుకుమార్ ‘సాక్షి’తో చెప్పారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెట్లు నేలకొరగడం, విద్యుత్ వైర్లు తెగిపడటం, ఇళ్ల పైకప్పులు లేచిపోవడం వంటి సంఘటనలు జరగవచ్చని తెలిపింది. దాదాపు 2 మీటర్ల మేర అలలు ఎగిసి పడనున్నాయి. ఉభయగోదావరి జిల్లాలతోపాటు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో హెలెన్ తుపాను ప్రభావం వల్ల ఈదురుగాలులు, చెదురుమదురు వర్షాలు మినహా పెద్ద ప్రమాదం ఉండబోదని చెబుతున్నారు. తీరం దాటాక 48 గంటలపాటు దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలపై ఉంటుందన్నారు. దక్షిణ కోస్తాంధ్రలో బుధవారం రాత్రి నుంచే గాలులు గంటకు 55-65 కి.మీ. వేగంతో వీచే అవకాశాలున్నట్టు అధికారులు తెలిపారు. కృష్ణపట్నంలో 5వ, వాడ్రేవులో 7వ, నిజాంపట్నం, మచిలీపట్నంలో 6వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొదని, సముద్రంలో ఉన్నవారు తక్షణమే తీరానికి చేరుకోవాలని హెచ్చరించారు. అధికార యంత్రాంగం అప్రమత్తం: ‘హెలెన్’ తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి 4 జిల్లాల కలెక్టర్లను ఆదేశిం చారు. బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. చిత్తూరు పర్యటనలో ఉ న్న సీఎం కిరణ్ కూడా హెలెన్ తుపాన్‌పై ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. జాతీయ బృందాలతోపా టు, కోస్తా ప్రాంత రక్షణ విభాగం, మెరైన్ పోలీసు సిబ్బంది ప్రజలకు సాయం అందించడానికి రంగంలోకి దిం చినట్లు తెలిపారు. సచివాలయంలో 23456005, 23451043 నం బర్లతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా, డివిజన్, మండలస్థాయిల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటయ్యాయి. 25 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం: పార్థసారథి హెలెన్ తుపాను ప్రభావం వల్ల నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 25 సెంటీమీటర్ల వరకూ భారీ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ సి పార్థసారథి వెల్లడించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు రెండేసి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఒక్కొక్క జాతీయ విపత్తు నివారణ దళ బృందాలను పంపినట్లు తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మర్రి శశిధర్‌రెడ్డి సమీక్ష: తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఎ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి బుధవారం సమీక్షించారు. తదనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 6 జాతీయ విపత్తు నివారణ దళం బృందాలను ముందుగానే పంపామన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 33 మండలాలపై తీవ్ర ప్రభావం నెల్లూరు జిల్లాలో 12 మండలాల పరిధిలోని తీరంలోని గ్రామా ల నుంచి 25 వేలమందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. మంగళగిరి నుంచి 90 మందితో కూడిన నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ బృందాలు రెండు కావలి, నెల్లూరు చేరుకున్నాయి. ప్రకాశం జిల్లాలో తీరం వెంబడి ఉన్న 11 మండలాల్లోని 28 గ్రామాలపై తుపాను ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుంటూరు జిల్లాలో 6 మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. మంగళవారం వేటకు వెళ్లిన కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సొర్లగొందికి చెందిన నలుగురు జాలర్లు బుధవారం సురక్షితంగా ఇంటికి చేరారు. లైలా అంతటి తీవ్రత.. న్యూఢిల్లీ: హెలెన్ తుపాను తీవ్రత ఫై-లిన్ తుపాను అంత ఉండదని, అయితే 2010లో ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడిన లైలా తుపాను అంతటి విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్త ఎం మహాపాత్ర బుధవారం న్యూఢిల్లీలో విలేకరులతో చెప్పారు. మచిలీపట్నం- నెల్లూరు మధ్య ఒంగోలు సమీపంలో 22వ తేదీ ఉదయం హెలెన్ తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. -
ముంచుకొస్తున్న ‘హెలన్’
తుపాను తాకిడి నుంచి రాష్ర్టం తప్పించుకుందని సంతోష పడుతుండగానే మరోవైపు నుంచి ‘హెలన్’ భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను గురువారం సాయంత్రం చెన్నై- ఒంగోలు (ఆంధ్రప్రదేశ్) మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైన నెల న్నర రోజుల్లో భయపెడుతున్న రెండో తుపాను ఇది. నైరుతీ రుతపవానాల సమయం(ఆగస్టు, సెప్టెంబరు)లో పైలీన్ తుపాను ప్రజలను కల్లోలపరిచింది. ఆ తరువాత అక్టోబరులో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యూయి. అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. వారం రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి భారీవర్షాలు కురిసినా పెద్దగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. దాదాపు ప్రశాంతంగానే నాగపట్నం వద్ద ఈనెల 15వ తేదీన తీరం దాటేసింది. తుపాను సహాయక చర్యలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న రాష్ట్ర యంత్రాంగం హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకుంది. ఇంతలోనే ‘హెలన్’ బంగాళాఖాతంలో ఈనెల 18వ తేదీన ఏర్పడిన అల్పపీడనం 19వ తేదీ ఉదయూనికి బలమైన ద్రోణిగా రూపాంతరం చెంది సాయంత్రానికి తుపానుగా మారింది. తుపాను తీవ్రతను బట్టి వారంరోజుల క్రితం నాటి తుపానుకు పెట్టదలుచుకున్న హెలన్ పేరును తాజా తుపానుకు పెట్టారు. బుధవారం నాటి సమాచారం ప్రకారం చెన్నైకి ఈశాన్యంలో 400 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను గురువారం రాత్రి కి చెన్నై- ఒంగోలు మధ్య తీరం దాటవచ్చని భావిస్తున్నారు. దీని ప్రభావంతో చెన్నై, తిరువళ్లూరు, తిరునెల్వేలీ, తూత్తుకూడి, కన్యాకుమారి, దిండిగల్లు, మధురై, తేనీ, శివగంగై, విరుదునగర్ కాంచీపురంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్నూరు, చెన్నై హార్బర్లలో తుపాను హెచ్చరిక సూచిక నెంబర్1 ను ఎగురవేశారు. రాష్ట్రంలోని జాలర్లను చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని ఆదేశించారు. కారైక్కాల్, పుదుచ్చేరి, పాంబన్, తూత్తుకూడి, నాగపట్నంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేశారు. ఈ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంచనాకు తగినట్లుగా అదే తీవ్రతతో తుపాను తీరం దాటినట్లైతే గురువారం ఒక్కరోజే 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర యంత్రాంగం యథావిధిగా తుపాను ప్రభావిత జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. -
'హెలెన్' తుఫానుగా మారిన వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. దీనికి 'హెలెన్' అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. బుధవారం సాయంత్రానికి ఇది తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావం వల్ల బుధవారం రాత్రి నుంచి వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, గురువారం సాయంత్రానికి ఇది కావలి - ఒంగోలు మధ్య ఏదైనా ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను రాగల 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది వాయవ్య దిశగా పయనించి, తర్వాత నైరుతి దిశకు మళ్లుతుందని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పరిసరాల్లో కావలి సమీపంలో గురువారం రాత్రి తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడుతుందని, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అవి 75 కిలోమీటర్ల వరకు కూడా వెళ్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి తీరప్రాంతాల్లో కనిపిస్తుంది. తీరాన్ని దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని తెలిపింది.