
పట్టపగలే చుక్కలు చూపించిన హెలెన్ తుఫాను
సాధారణంగా తుఫానులంటే సాయంత్రం లేదా రాత్రిపూట మాత్రమే బీభత్సం సృష్టిస్తాయి. కానీ ఈసారి హెలెన్ తుఫాను మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మిట్ట మధ్యాహ్నం పూట తీరం దాటింది. నాలుగు రోజులుగా విశాఖపట్నం నుంచి ఒంగోలు తీరం వరకు దోబూచులాడుతూ వచ్చిన హెలెన్ తుఫాను.. చివరకు కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ తుఫాను తీరాన్ని దాటినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందన్ అధికారికంగా ప్రకటించారు.
తుఫాను ప్రభావంతో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. వీటి వేగం గంటకు సుమారు 80 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉంది. ఈ గాలుల ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు కూడా పడిపోతున్నాయి. బోట్లు అల్లకల్లోలంగా మారాయి. కృత్తివెన్ను మండలంలో వెయ్యిమందనిఇ పునరావా సకేంద్రాలకు తరలించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుఫాను ప్రభావం వల్ల సీతనపల్లి హరిజన వాడలో కొబ్బరిచెట్టు పడి కాంతారావు అనే వృద్ధుడు మరణించాడు. ప్రకాశం జిల్లాలోని 11 మండలాల్లోని 28 గ్రామాలపై తుఫాను ప్రభావం పడింది. పంటలు నీట మునిగాయి. మొత్తమ్మీద లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు తెలుస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లా మీద హెలెన్ తుఫాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ప్రధానంగా నరసాపురం, మొగల్తూరు తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. అంతర్వేదిలో సముద్రం బీభత్సంగా ఉంది. లంకల్లో జీవనం అస్తవ్యస్తంగా ఉంది. భారీగా కొబ్బరి చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయాయి. విద్యుత్ సరఫరా కూడా పలు ప్రాంతాల్లో నిలిచిపోయింది. కాళీపట్నం- భీమవరం, నరసాపురం-పాలకొల్లు మధ్యలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ప్రాంతంలో చెట్టుకూలి ఓమహిళ మరణించింది. కోనసీమ ప్రాంతంలో అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలను అధికారులు ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. ప్రధానంగా సఖినేటిపల్లి, రాజోలు, కాట్రేనికోన, ఐ.పోలవరం, అమలాపురం రూరల్, అల్లవరం, మలికిపురం, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కూర్చున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు తుఫాను గాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. గురువారం రాత్రి నుంచే ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ తుఫాను గతంలో వచ్చిన 1996 నవంబర్ 6 నాటి తుఫాను అంత తీవ్రంగా లేకపోయినా.. అధికారుల వైఫల్యం కారణంగా నష్టాలు మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకినాడ ప్రాంతంలో 32 మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వారిలో 20 మంది ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. 12 మంది మాత్రం ఓఎన్జీసీ నౌక సాయంతో తీరానికి చేరుకోగలిగారు.