‘హెలెన్’ టెన్షన్
Published Fri, Nov 22 2013 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
సాక్షి, కాకినాడ :పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ‘హెలెన్’ తుపానుగా మారిన జిల్లావాసులను గడగడలాడిస్తోంది. ఇది మచిలీపట్నం-నరసాపురం మధ్య శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటవచ్చని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించడంతో ఉభయ గోదావరి జిల్లాలను హై ఎలర్ట్ జోన్‌గా ప్రకటించారు. తీరం దాటే సమయంలో వంద నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు తీరప్రాంత వాసులను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే తీరంలో 60-80 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. తీర గ్రామాల్లో గురువారం ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, మిగిలిన ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు
కురుస్తున్నాయి. జిల్లాలో సముద్రతీరం ఈదురుగాలులతో, ఎగసిపడే అలలతో అల్లకల్లోలంగా ఉంది.
ఉప్పాడ, ఓడలరేవు, అంతర్వేది పల్లిపాలెం వద్ద సముద్ర జలాలు తీరం మీదకు చొచ్చుకొస్తున్నాయి. ఉప్పాడ వద్ద అలలు ఆరడుగుల మేర ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ శివారు సుబ్బంపేట నుంచి ఉప్పుటేరు పెదవంతెన వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు పలుచోట్ల భారీగా కోతకు గురైంది. ఉప్పాడ-కోనపాపపేట రహదారి చాలాచోట్ల ఛిద్రమైంది. అలల ఉధృతికి రక్షణగోడ ఎక్కడికక్కడ కోతకు గురై, రహదారిపైకి రాళ్లు ఎగసిపడడంతో కనీసం నడిచి వెళ్లేందుకుకూడా వీల్లేకుండా తయారైంది. అలలు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 1.5 మీటర్ల ఎత్తున ఎగసిపడవచ్చని, అలలు తీరం మీదకు మరింతగా చొచ్చుకు రావచ్చన్న అంచనాతో తీర, పల్లపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
పునరావాస కేంద్రాలకు ఏర్పాట్లు
రానున్న 48 గంటల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖాధికారులు హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. స్థానికంగానే మకాం వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ మండల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో 1077, 0884- 2365506 టోల్‌ఫ్రీ నంబర్లతో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయంతో పాటు తీర ప్రాంత తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తీర, ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ పోర్టులో 9వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గ్రామాల్లో టాంటాలు వేసి మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేశారు.
సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లను గుర్తించి వాటిలో ఉన్న మత్స్యకారులను త్వరితగతిన తీరానికి చేరుకోవాలని వైరలెస్ సెట్‌ల ద్వారా హెచ్చరించారు.కాగా తొండంగి మండలం పెరుమాళ్లపురం నుంచి మూడు బోట్లలో 21 మంది, యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేట, కాకినాడ సూర్యారావుపేటల నుంచి రెండుబోట్లలో మరో 14 మంది వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోగా, ఓడలరేవు వద్ద ఏడుగురితో ఒక బోటును, పెరుమాళ్ల పురం వద్ద మరో ఏడుగురితో మరో బోటును మెరైన్ పోలీసులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. పెరుమాళ్లపురం నుంచి 14 మందితో వెళ్లిన రెండు బోట్లు, సూర్యారావు పేట నుంచి ఏడుగురితో వెళ్లిన ఒక బోటు భైరవపాలెం సమీపంలోని రిలయన్స్‌రిగ్‌ల వద్ద చిక్కుకున్నట్టు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. రంగంలోకి దిగిన మెరైన్, కోస్ట్‌గార్డు బృందాలు వారిని తీరానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధం : కలెక్టర్
ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ నీతూ ప్రసాద్ చెప్పారు. తుపాను నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను గురువారం రాత్రి కాకినాడలో ఆమె విలేకరులకు తెలిపారు. మలికిపురం నుంచి తొండంగి వరకు తీర ప్రాంత మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించామన్నారు. జాతీయ విపత్తు నివారణా సంస్థ నుంచి రెండు రెస్క్యూటీమ్‌ల కోసం ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిపారు. ఈ టీమ్‌లు వస్తే పునరావాస చర్యలను పర్యవేక్షించేందుకు రాజోలు, అమలాపురానికి పంపిస్తామన్నారు. జిల్లా నుంచి వేటకు వెళ్లిన ఐదు బోట్లలో 14 మందితో రెండు బోట్లు ఇప్పటికే తీరానికి చేరుకున్నాయని, 21 మందితో ఉన్న మిగిలిన మూడు బోట్లు ఇంకా ఒడ్డుకు చేరుకోవాల్సి ఉందన్నారు.
ఈ బోట్లలోని మత్స్యకారులు కూడా సురక్షితంగానే ఉన్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. వారిని కూడా తీరానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు తీరప్రాంతంలోని ప్రతి మండలానికీ రూ.లక్ష చొప్పున విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఏలేరు రిజర్వాయర్‌లో సామర్థ్యానికి(86.5 మీటర్ల) తగ్గ నీరు ఉందని, తుపాను కారణంగా కురిసే భారీ వర్షాల వల్ల ఇన్‌ఫ్లో మరింత పెరిగితే మిగులు జలాలను సముద్రంలోకి మళ్లీ వదిలే అవకాశాలున్నాయని చెప్పారు. ఏలేరు పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు. వారితోపాటు తీర, పల్లపు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement