అప్రమత్తం
Published Fri, Nov 22 2013 2:42 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM
సాక్షి, గుంటూరు :‘హెలెన్’ తుపాను శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం వుందని తెలియడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో తుపాను అప్రమత్త చర్యల ప్రత్యేకాధికారిగా బి.వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్ తీరప్రాంత మండలాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. తుపాను సహాయక చర్యల నిమిత్తం వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందితో ఏర్పాటు చేసిన మొత్తం 70 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ప్రధానంగా తీర మండలాలైన బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం, నిజాంపట్నం, రేపల్లె, నగరంలో 100 లోత ట్టు గ్రామాల్ని గుర్తించి సహాయక చర్యలకు ఉపక్రమించారు.
లోతట్టు ప్రాంతాల గుర్తింపు
‘హెలెన్’ తుపాను ప్రభావంతో సముద్రం అలలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే సముద్రతీరాన వున్న ఆరు మండలాలు బాపట్ల, కర్లపాలెం, నగరం, రేపల్లె, పిట్టలవానిపాలెం, నిజాంపట్నంలను లోతట్టు ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడి నివాసాలను ఖాళీ చేయించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీని కోసం రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. నిజాంపట్నం ఓడరేవులో పదో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ఇతర జిల్లాల నుంచి గజఈతగాళ్లు, మోటారు బోట్లు, కిరోసిన్, డీజిల్, రక్షణ దుస్తుల్ని తెప్పించేందుకు ఇన్‌చార్జి కలెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నారు.
తుట్టుకునే శక్తి లేదు.. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా రైతులు తీవ్ర పంట నష్టాలను చవిచూశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, కొండవీటి వాగు, నల్లమడ డ్రెయిన్ ముంపు తదితర సమస్యలతో రైతులు ఇప్పటికే చావుదెబ్బ తిన్నారు. తుళ్లూరు, మంగళగిరి, రేపల్లె, నగరం, నిజాంపట్నం ప్రాంతాల్లోని కరకట్టల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. హెలెన్ ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు కురిస్తే తట్టుకునే శక్తి లేదని రైతులువాపోతున్నారు. ప్రకృతి విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజల సహకారం కూడా తప్పనిసరని ఇన్‌చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్ విజ్ఞప్తి చేశారు.తీరంలో భయాందోళన.. నిజాంపట్నం,న్యూస్‌లైన్: హెలెన్ తుపాను ముప్పు పొంచి ఉండటంతో తీర ప్రాంత గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే సముద్రపు అలలు భారీగా ఎగసిపడుతున్నాయి.సముద్రం గురువారం 20 మీటర్ల మేర ముందుకు వచ్చింది. వేటకు వెళ్లిన బోట్లన్నీ తిరిగి ఒడ్డుకు చేరాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉందని పోర్టు అధికారులు తెలిపారు.
10వ నంబర్ ప్రమాద హెచ్చరిక
నిజాంపట్నం ఓడరేవులో గురువారం పదవ నంబర్ ప్రమాద సూచి కను ఎగురవేశారు. విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం సమాచారం మేరకు ప్రమా ద సూచికను ఎగురవేసినట్లు పోర్టు కన్జర్‌వేటర్ మోకా వెంకట రామారావు తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని బోట్లను భద్రపరుచుకుని అధికారుల ఆదేశాలను పాటించాలని ఆయన సూచించారు.
Advertisement