ఆస్పత్రి అధికారులకు.. కలెక్టర్‌ క్లాస్ | Collector class serious on hospital authorities | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి అధికారులకు.. కలెక్టర్‌ క్లాస్

Published Fri, May 12 2017 5:39 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

ఆస్పత్రి అధికారులకు.. కలెక్టర్‌ క్లాస్ - Sakshi

ఆస్పత్రి అధికారులకు.. కలెక్టర్‌ క్లాస్

► రోగులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదు
► వైద్యులు సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాల్సిందే
► ఆస్పత్రి ప్రతిష్ట పెంచాలి
► వైద్యాధికారులు, సిబ్బందికి స్పష్టం చేసిన కలెక్టర్‌
► జీజీహెచ్‌లో మూడు గంటలపాటు తనిఖీలు
► శానిటేషన్‌ కాంట్రాక్టర్‌కు రూ.లక్ష జరిమానా


గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి వైద్యాధికారులకు కలెక్టర్‌ కోన శశిధర్‌ క్లాస్‌ తీసుకున్నారు. ఆస్పత్రిలో గురువారం తనిఖీలు నిర్వహించిన ఆయన అక్కడ పరిస్థితులను చూసి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు సేవలు అందించటంలో నిర్లక్ష్యంపై నిలదీశారు. పలు వార్డులను పరిశీలించి వైద్యసేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. నెలకోసారి ఆస్పత్రికి వచ్చి సమస్యలపై చర్చిస్తానని స్పష్టం చేశారు.

సాక్షి, గుంటూరు : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ హెచ్చరించారు. ‘ప్రతిష్టకు పాతర’ శీర్షికతో గురువారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి స్పందించిన కలెక్టర్‌.. ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. తనిఖీల్లో భాగంగా పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోవడం గమనించిన కలెక్టర్‌ కాంట్రాక్టర్‌కు లక్ష రూపాయలు జరిమానా విధించారు. గుంటూరు జీజీహెచ్‌కి, గుంటూరు వైద్య కళాశాలకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, వాటిని మీరు పాడు చేయొద్దంటూ వైద్య సిబ్బంది, అధికారులకు క్లాస్‌ తీసుకున్నారు.

ప్రతి ఒక్కరూ తమ జాబ్‌ చార్టు ప్రకారం పనిచేయాలని, సమస్యలు ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే తన పరిధిలో ఉన్నవి తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఆసుపత్రికి ఉన్న ప్రతిష్ట మొత్తం ఎలుక సంఘటనతో పోయిందని, తిరిగి ప్రతిష్ట తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తుందన్నారు. దేశం మొత్తం ఎలుక సంఘటన పెద్ద చర్చనీయాంశమైందని గుర్తుచేశారు. సామాన్య వ్యక్తులకు జీజీహెచ్‌ పెద్ద దిక్కు అని, రోగులకు వైద్య సేవలు అందించడంలో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.

శానిటేషన్‌ కాంట్రాక్టర్‌కు 96 మార్కులా?
శానిటేషన్‌ కాంట్రాక్టర్‌కు 96 మార్కులు వేయడంపై డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్‌ అనంత శ్రీనివాసులుకు కలెక్టర్‌ క్లాస్‌ తీసుకున్నారు. అన్ని మార్కులు పొందేందుకు కాంట్రాక్టర్‌ అర్హుడేనా అని ప్రశ్నించారు. శానిటేషన్‌ అంతంతమాత్రంగానే ఉందని, డస్ట్‌బిన్‌లో కవర్లు కూడా లేవని, అలాంటప్పుడు నెలకు రూ.40 లక్షలు ఎందుకు చెల్లించాలంటూ డిప్యూటీ ఆర్‌ఎంఓను నిలదీశారు. విభాగాధిపతుల ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని శానిటేషన్‌కు మార్కులు వేయాలన్నారు.

ఆసుపత్రిలో వైద్య పరికరాలు సకాలంలో మరమ్మతులు జరుగుతున్నాయా, లేవా అని ప్రశ్నించారు. పలువురు వైద్య పరికరాల మరమ్మతుల జాప్యంపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళడంతో వైద్య పరికరాల మరమ్మతుల కాంట్రాక్టర్‌ పవన్‌కు క్లాస్‌ తీసుకున్నారు. వారంలో ఒకరోజు తప్పనిసరిగా వైద్య విభాగాధిపతులను సంప్రదించి, వైద్య పరికరాల పనితీరు గురించి అడిగి తెలుసుకోవాలన్నారు.

ఎలుకలనూ నివారించలేకపోతున్నారా?
పెస్ట్‌ కంట్రోల్‌ కాంట్రాక్టర్‌ను కలెక్టర్‌ నిలదీస్తూ.. ఆసుపత్రిలో ఎలుకలు తిరుగుతున్నా ఎందుకు నివారించలేకపోతున్నారని ప్రశ్నించారు. కేవలం రూ.10 వేల మెష్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఎలుకల నివారణ అడ్డుకోవచ్చని, దానిపై ఎందుకు దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో సీసీ కెమెరాలు సైతం చాలా తక్కువగా ఉన్నాయని, తక్షణమే వాటిని పెంచాలని ఆసుపత్రి అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్‌ ప్రవీణ్‌కు సైతం కలెక్టర్‌ క్లాస్‌ తీసుకున్నారు.

వైద్యులు ఎక్కడ ఉన్నా వార్డులో చికిత్స పొందుతున్న రోగుల రిపోర్టులను, రోగులను పర్యవేక్షించే విధంగా వైద్యుల సెల్‌ఫోన్‌లో వారి వివరాలు కనిపించేలా సాఫ్ట్‌వేర్‌ పెట్టాలని,  అదికూడా మూడు రోజుల్లో ఏర్పాటు చేయాలని అడ్మినిస్ట్రేటర్‌కు ఆదేశించారు. ఆసుపత్రిలో తిరుగుతున్న ఇద్దరు మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లను పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించినట్లు కలెక్టర్‌ చెప్పారు.

జనరిక్‌ మందులనే రాయాలి...
ఆసుపత్రిలో మందులు లేని సమయంలో జనరిక్‌ మందులనే వైద్యులు రాయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అనైతిక ప్రాక్టీస్‌ చేసే వైద్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేకుండా మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు ఆసుపత్రిలో వైద్యులను కలిస్తే సదరు వైద్యులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్యాన్లు పలు వార్డుల్లో పనిచేయడం లేదన్న ఫిర్యాదుపై ఇంజినీరింగ్‌ అధికారులు, ఎలక్ట్రికల్‌ అధికారులకు కలెక్టర్‌ క్లాస్‌ తీసుకున్నారు.

ఏడేళ్ళు దాటిన ఫ్యాన్‌లకు మరమ్మతులు చేయకుండా పక్కన పెట్టేసి కొత్త ఫ్యాన్లు బిగించాలని, అదనంగా కొత్త ఫ్యాన్లు స్టాక్‌ పెట్టుకోవాలని ఇంజినీరింగ్‌ అధికారులకు ఆదేశించారు. పలు వార్డుల్లో ఏసీలు పనిచేయడం లేదన్న విషయాన్ని వైద్యులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళడంతో వాటికి తక్షణమే మరమ్మతులు చేయాలని సూచించారు. ఆసుపత్రిలో నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఆసుపత్రిలో ఏయే వార్డులకు ఎటు వెళ్ళాలో చూపించే విధంగా సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయించాలన్నారు.

ప్రతినెలా మొదటి గురువారం విభాగాధిపతులందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించాలన్నారు. వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీస్‌ చేసే అనుమతి ఉంటే ఒకే అని, లేని పక్షంలో అనుమతులు లేకుండా ప్రాక్టీస్‌ చేస్తున్న వైద్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

కలెక్టర్‌ ముందే చెప్పినా...
గుంటూరు మెడికల్‌ : ‘నేను ఆస్పత్రికి వస్తున్నానని ముందే చెప్పినా... వచ్చిన తర్వాత కూడా గదిలో నుంచి బయటకు రారా? నేనెవరో తెలుసా? మీ మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి.. వాటీజ్‌ దిస్‌ రాజునాయుడు..’ అంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేవనబోయిన శౌరిరాజునాయుడును జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ నిలదీశారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జీజీహెచ్‌కి వచ్చిన ఆయన ముందే ఆస్పత్రి అధికారులకు సమాచారమిచ్చారు.

అయినా ఆస్పత్రికి వచ్చిన కొద్దిసేపటి వరకు ఎవరూ ఆయన వద్దకు రాలేదు. ఆ తరువాత వైద్య సిబ్బంది, వైద్యులు, సూపరింటెండెంట్‌ ఆయన వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో తొలుత రాజునాయుడికి, అనంతరం వచ్చిన డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్‌ అనంత శ్రీనివాసులుకు కలెక్టర్‌ క్లాస్‌ తీసుకున్నారు. ‘నేను ఎవరో మీకు తెలుసా?’ అంటూ ప్రశ్నించి ‘సస్పెండ్‌ చేయమంటారా?’ అనటంతో వారి ముఖాలు ఒక్కసారిగా మాడిపోయాయి. అనంతరం సూపరింటెండెంట్‌ చాంబర్‌లో వారిద్దరితో మాట్లాడిన కలెక్టర్‌ అనంతరం ఓపీ విభాగంలో తనిఖీలు చేశారు.

ఇన్‌పేషెంట్‌ విభాగం ద్వారం వద్ద పైపులైన్‌ లీకులు గమనించి ఇంజినీరింగ్‌ అధికారులను నిలదీశారు. అనంతరం ఓపీ విభాగం ద్వారం వద్ద ఆర్థోపెడిక్‌ విభాగంలో కాలికి కట్టు కట్టించుకుని కుంటు కుంటూ బయటకు వస్తున్న చింతల శ్రీను అనే రోగిని గమనించి, అతడికి వీల్‌చైర్‌ ఎందుకు ఇవ్వలేదని వైద్యాధికారులను, సిబ్బందిని  ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి దృశ్యాలు కనిపిస్తే ఉద్యోగాలు ఊడతాయంటూ తీవ్రంగా హెచ్చరించారు. రోగికి తొలుత కుర్చీ తెప్పించి, అనంతరం అతనికి వీల్‌చైర్‌ తెప్పించి, వైద్యసేవల కోసం పంపించారు. తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తే ఊరుకోనని, ఆర్థిక దుబారా, స్కామ్‌లు చేస్తే వారిపై వేటు పడుతుందని హెచ్చరించారు.

తనకు ఆస్పత్రికి వచ్చే కామన్‌ మ్యాన్‌ ముఖ్యమని, రోగులకు సేవల్లో జాప్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వైద్యులు తప్పనిసరిగా సాయంత్రం 4 గంటల వరకు ఉండాలని, నెలకు ఒకసారి ఆస్పత్రికి వచ్చి సమస్యలపై చర్చించి పరిష్కరిస్తానని కలెక్టర్‌ చెప్పారు. వైద్య సిబ్బంది అంతా యాప్రాన్‌లు ధరించాలని, ఐడీ కార్డ్‌ పెట్టుకోవాలని స్పష్టం చేశారు. వార్డులను తనఖీ చేసిన అనంతరం ఆయన వైద్యులు, వైద్య విభాగాధిపతులు, ఆస్పత్రి అధికారులతో శుశ్రుతా హాలులో సమీక్ష నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement