పేదల కడుపు కొడితే చూస్తూ ఊరుకోం
-
పట్టా భూములు లాక్కుని, నివాసాలు కూలగొట్టి అపార్టుమెంటులా?
-
వైఎస్సార్ సీపీ నేతలు లేళ్ళ అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున ఆగ్రహం
-
జడ్పీకార్యాలయం వద్ద బైఠాయింపు
-
ఆందోళనలో పాల్గొన్న సీపీఐ, సీపీఎం నాయకులు, స్థానికులు
పట్నంబజారు (గుంటూరు) : అధికారంలో ఉన్నాం...ఏం చేసినా చెల్లుతుందనే అహంకారంతో పేదల కడుపులు కొట్టి, స్థలాలు లాక్కుని, నివాసాలు కూల్చేస్తామంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూర్చోదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి హెచ్చరించారు. అధికారులు కూడా టీడీపీ అండ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తెరిగి వ్యవహరించాలని స్పష్టం చేశారు. నివాసాలు కూలగొట్టి అపార్ట్‌మెంట్‌లు కట్టాలని కార్పొరేషన్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కోబాల్టుపేట వాసులతో కలిసి జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. ముందుగా కోబాల్టుపేటలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, సీపీఎం నగర కార్యదర్శి ఎన్ . భావన్నారాయణతో పాటు మరికొంత నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ నుంచి స్థానికులతో కలిసి భారీ ప్రదర్శనగా బయలుదేరి పట్టాభిపురం రైతుమార్కెట్, ఫ్లైఓవర్, జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదుగా జడ్పీకి చేరుకున్నారు. జడ్పీ కార్యాలయంలో బైఠాయించి ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లాని కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే ఈ ప్రాంతంలో గుడిసెలు అధికంగా ఉన్నాయా అని జేసీ కృతికాశుక్లా నేతలను అడిగారు. ఒక్కసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నేతలు కోరటంతో సానూకూలంగా స్పందించిన ఆమె.. పరిశీలించటంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకుని వెళ్తామని చెప్పారు.
ఒక్క ఇటుక పెకలించినా ప్రజా ఉద్యమం
అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వ పెద్దలకు లబ్ధి చేకూర్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం పది గుడిసెలు కూడా లేని ప్రాంతంలో..ఆ ప్రాంతమంతా గుడిసెలు ఉన్నాయని అధికారులు నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోందన్నారు. ఒక్క ఇటుక పెకలించినా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. అధికారుల అనాలోచిత నిర్ణయాన్ని అడ్డుకుని పేదలకు బాసటగా నిలుస్తామని హామీనిచ్చారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ దళిత వర్గాలను దోచుకుతినేలా ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు నగరం నడిబొడ్డున ఉన్న కోబాల్టుపేటలో స్థానికుల నుంచి ఎటువంటి అనుమతి లేకుండా పట్టాలు ఉన్న భూములను లాక్కునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పేదల పక్షాన పోరాడేందుకు ప్రతి ఒక్కరం సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు జగన్‌కోటి, మద్దుల రాజాయాదవ్, మెట్టు వెంకటప్పారెడ్డి, షేక్ జానీ, సుంకర రామాంజనేయులు, పానుగంటి చైతన్య, షేక్ రబ్బాని, ఎన్.అర్జున్, సైదా, కోటా మాల్యాద్రి, నందిగం సురేష్, దేవానంద్, సులోచనరావు, రంజుల శ్రీను, చినదుర్గ, ఏసుపాదం, నాగరాజు, మాచర్ల శ్రీను, నారాయణమ్మ, లక్ష్మి, వెంకాయమ్మ, చవల బాలా, కోటమ్మ, బాలాజీ, జాన్, సీపీఐ, సీపీఎం నేతలు, స్థానికులు పాల్గొన్నారు.