జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి
జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి
Published Wed, Sep 21 2016 8:41 PM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే
గుంటూరు వెస్ట్ : వ్యవసాయ ఆధారిత జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కోరారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ‘క్రెడిట్ ఫెసిలిటేషన్’పై రెండు రోజుల పాటు నిర్వహించే వర్క్‌షాపు నగరంలోని ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ విండో విధానం అమలు చేసి రుణాలు మంజూరు చేస్తున్నా, అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు వస్తూనే ఉన్నాయన్నారు. వివిధ విభాగాల అధికారులు, బ్యాంకర్లు సమన్వయంగా వ్యవహరించి లబ్ధిదారుల రుణాలను ఎప్పటికప్పుడు అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎస్‌ఎంఈ పథకం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రుణాలు పొంది జిల్లాను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దేందుకు తగిన కృషి చేయాలని ఆయన సూచించారు. బ్యాంకులు సకాలంలో రుణాలు అందజేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆదేశించారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతోపాటు సర్వీసు రంగాన్ని జిల్లాలో విస్తరించాలని కలెక్టర్ కాంతిలాల్ సూచించారు.
రుణాలు పొందడంలో..
పరిశ్రమల కేంద్రం రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ కె.ప్రసాదరావు మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రుణాలు పొందే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తాము ఎటువంటి పరిశ్రమలు నెలకొల్పుతారో వాటికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టులను అందజేసే విషయంలో స్పష్టమైన సమాచారాన్ని పొందుపరచాలని సూచించారు. ఇండస్ట్రీ పాలసీ 2020 వరకు అమలులో ఉంటుందని, దీనిని సద్వినియోగించుకుని అభివృద్ధి సాధించాలని ఆయన కోరారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమకు తామే రుణాలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఏపీ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్ రమణరావు మాట్లాడుతూ తమ కార్పొరేషన్ ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎ.సుధాకరరావు, లీడ్‌బ్యాంక్ మేనేజర్ మానం సుదర్శనరావు, వివిధ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు శ్రీనివాస్(ఆంధ్రాబ్యాంకు), సాయిబాబు(ఎస్‌బీహెచ్), ప్రభాకరరెడ్డి(సీజీజీ), మౌలాలి, జాన్‌పీటర్ దేవదాస్ (కెనరాబ్యాంక్), నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రతినిధి విఠల్, లబ్ధిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement