రెండంకెల వృద్ధే లక్ష్యం | vizag collector praveen kumar speaks over industrial development | Sakshi
Sakshi News home page

రెండంకెల వృద్ధే లక్ష్యం

Published Thu, Sep 22 2016 11:12 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM

vizag collector praveen kumar speaks over industrial development

► కీలకమైన ప్రాథమిక రంగంలో నెం.1 కావాలి  ∙
► డీడీజీపై వర్క్‌షాప్‌లో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ 
 
విశాఖపట్నం : రెండెంకెల వృద్ధి సాధనలో ప్రాథమిక రంగానిదే కీలకమని.. ఇండస్ట్రియల్, సేవా రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న జిల్లాను ఈ రంగంలో కూడా అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కోరారు. కలెక్టరేట్‌లో రెండెంకల వృద్ధిపై బుధవారం ఒకరోజు వర్కుషాపు నిర్వహించారు. దీనిలో ప్రాథమిక రంగాలైన వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్థక శాఖలకు చెందిన అధికారులు, జిల్లాలో రెండంకల వృద్ధి సాధనకు చేపడుతున్న కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో వివరించారు. 
 
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పారిశ్రామిక, సేవా రంగాల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉన్నప్పటికీ, ప్రైమరీ సెక్టార్‌లో పదో స్థానంలో ఉన్నామన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అవగతం చేసుకొని నిర్ధేశించిన లక్ష్యాల దిశగా ముందుకు సాగాలన్నారు. వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచాలన్నారు. మెరైన్‌ నెట్‌ టెక్నాలజీ ద్వారా ఫిషింగ్‌ను అభివృద్ధి చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనా సంస్థ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డా. ఉపేంద్ర మాట్లాడుతూ చిన్న చిన్న కమతాల వల్ల, నీటి వనరులు లభ్యత తక్కువగా ఉండడం వల్ల విశాఖ జిల్లాలో వరి దిగుబడి క్రమేపి తగ్గిపోతుందన్నారు.

పంటల మార్పిడి విధానం అమలు చేస్తూ, ఉత్తమ నీటి యాజమాన్య పద్ధతులను అవలంభిస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. పచ్చిరొట్ట ఎరువులను వాడుతూ అధిక దిగుబడి నిచ్చే వంగడాలను వినియోగించాలని సూచించారు. అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌.వేణుగోపాలరావు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో చెరకు పంట దిగుబడి తగ్గడానికి వ్యవసాయ యాంత్రీకరణ లేకపోవడం, కూలీ రేట్లు విపరీతంగా పెరగడం కారణాలన్నారు. ఆదాయం కోసం చెరకు పండించే రైతులు ఇతర పంటల వైపు మళ్లుతున్నారని వారికి క్షేత్రస్థాయిలో సరైన శిక్షణ, మంచి వంగడాలు అందజేస్తే తిరిగి పునరై్వభవం సాధించవచ్చునన్నారు. కొబ్బరి, జీడిమామిడి, మామిడి, కాఫీ,మత్స్య అభివృద్ధి,అరటి, కూరగాయల పెంపకాలపై ఆయా శాస్త్రవేత్తలు వారి పరిశోధనలను వివరించారు. సమావేశంలో జేసీ–2  డీవీ రెడ్డి, సీపీఓ రామశాస్త్రి, ఏడీ శేషశ్రీ, పశుసంవర్థక శాఖ ఏడీ వి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement