కలెక్టర్ ఎదుట కన్నీరు పెట్టుకుని తమ తమసమస్యలు వివరిస్తున్న ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల కాంట్రాక్టు ఉద్యోగులు
గుంటూరు వెస్ట్, గుంటూరు: ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని, అక్కడిక్కడే పరిష్కరించే అవకాశమున్న ‘గ్రీవెన్స్’ కార్యక్రమమంటే తనకెంతో ఇష్టమని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. సోమవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ ఒక్కరూ అసంతృప్తిగా వెనుతిరిగినా అధికారాలకు అర్థమే లేదన్నారు. గ్రీవెన్స్‌ను మరింత మెరుగుపరిచేలా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం ప్రత్తిపాడు మండలం కోండ్రుపాడు గ్రామానికి చెందిన వికలాంగురాలైన ఇవాంజిలికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక చేయూనందించారు. క్యాన్సర్ బాధితునికి ఇంటి స్థలం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 350 మంది ఫిర్యాదుదారులను స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ ఏఎండీ ఇంతియాజ్, డీఆర్వో నాగబాబు, జెడ్పీ సీఈవో జే అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఇంకెన్నాళ్లు..
మండల కేంద్రంలో ఎన్ని సార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ప్రజలు జిల్లా కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రతి వారం జిల్లా గ్రీవెన్స్‌కు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సోమవారం కూడా జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు భారీ సంఖ్యలో అభాగ్యులు తరలివచ్చారు. తమ సమస్యలను కలెక్టర్ కోన శశిధర్ వద్ద మొర పెట్టుకున్నారు.
రూ. వందలు ఖర్చు పెట్టుకుని..
మండల కేంద్రంలో పలుమార్లు అర్జీలు పెట్టుకున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ జిల్లా కేంద్రానికి వస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అ«ధికారులు పట్టించుకోక పోవడంతో కలెక్టర్‌కు విన్నవించుకుంటే అయినా సమస్యలు తీరుతాయనే రూ. వందలు ఖర్చు పెట్టుకుని వృద్ధులు, దివ్యాంగులు, రైతులు జిల్లా కేంద్రానికి వస్తున్నారు.
ఉద్యోగ భద్రత లేదు
మేమంతా దాదాపు 20 మంది సీఎం ఆరోగ్య కేంద్రాల కాంట్రాక్టు ఉద్యోగులం. ఎంతో కాలంగా గ్రామాల్లో తిరిగి పని చేసుకుంటున్నాం. నెలకు రూ.17 వేలు రావాల్సి ఉండగా రూ.6 వేలు ఇస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు అందడం లేదు. ఇందులో తొమ్మిది మందే ఉండాలి. మిగతా వారు మానేయాలని చెబుతున్నారు. అలా జరిగితే రోడ్డున పడతాం. కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకురావడంతో మాకు భరోసా ఇచ్చారు. – ఎం.శైలజ తదితరులు
ఇళ్ల మధ్యలో సెల్ టవర్
మేమంతా ఏటీ ఆగ్రహారంలో నివసిస్తున్నాం. ఈ ప్రాంతంలో వహీదుల్లా అనే ప్రభుత్వ ఉద్యోగి తన ఇంటిపై సెల్ టవర్ నిర్మిస్తున్నాడు. ఎంత మంది చెబుతున్నా వినడంలేదు. అనుమతులు కూడా లేవు. రేడియేషన్ వల్ల అనారోగ్యం పాలవుతారని వైద్యులంటున్నారు. వెంటనే నిర్మాణాన్ని ఆపించాలి.– శ్రీనివాసరావు, తదితరులు
Comments
Please login to add a commentAdd a comment