జిల్లాకు గుర్తింపు తెచ్చేలా పనిచేద్దాం
చిలకలపూడి(మచిలీపట్నం) : భారతదేశంలో జిల్లాకు గుర్తింపు వచ్చేలా పనిచేయాలని కలెక్టర్ బాబు.ఎ కోరారు. కలెక్టరేట్‌లో మీ కోసం సోమవారం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మార్చి నెలాఖరు నాటికి జిల్లాకు మంజూరైన 16 వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో ఆయా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి 302 గ్రామాలను ఆత్మగౌరవ గ్రామాలుగా ప్రకటించినట్లు వివరించారు. గ్రామానికి 25 చొప్పున మరుగుదొడ్లు నిర్మిస్తే మరో 300 గ్రామాలు ఆత్మగౌరవ గ్రామాలుగా ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జన్మభూమి- మాఊరులో 90,181 అర్జీలు వచ్చాయని చెప్పారు. వీటిలో ముఖ్యంగా గృహనిర్మాణం, రేషన్‌కార్డులు, ఇళ్లపట్టాలపై అర్జీలు వచ్చాయన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీలో 75 శాతం నగదు రహిత లావాదేవీలు నిర్వహించగా ఐదువేల మందికి ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం అందజేసిందన్నారు. జిల్లాలో సోలార్ పంపుసెట్ల పంపిణీలో దేశంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీన అవార్డు అందుకోనున్నట్లు తెలిపారు.
అర్జీలు ఇవే..
– పామర్రు మండలం పెరిసేపల్లి గ్రామానికి చెందిన అక్కినేని లక్ష్మి తనకు చెందిన భూమిని బంధువులు స్వాధీనం చేసుకుని దక్కకుండా చేస్తున్నారని, ఇటీవల పండిన పంట కూడా తమదేనంటూ లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, బంధువుల నుంచి తనకు సంబంధించిన పంటను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.
– మచిలీపట్నం పట్టాభి రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రూ. 14 లక్షల విలువైన కాంపోనెంట్స్ యంత్రం గత తొమ్మిది నెలలుగా నిరుపయోగంగా ఉందని ఈ యంత్రం ద్వారా రక్తంలోని ప్లేట్‌లెట్స్, తెల్లరక్త కణాలు, ఎర్ర రక్త కణాల నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయాయన్నారు. యంత్రాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు.