Mee kosam
-
ఒక్కరే ఉండాలి...అది ఉన్నతాధికారే..
సాక్షి, ఏలూరు (మెట్రో): బాధ్యతలు స్వీకరించి వారం రోజులు కాకముందే వినూత్న పద్ధతులను అమలు చేస్తున్నారు కలెక్టర్ రేవు ముత్యాలరాజు. జిల్లాలో ఇప్పటికే ఉన్నతాధికారులందరితోనూ సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్ ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమంలోనూ మూస పద్ధతికి స్వస్తి పలికారు. సమూల మార్పులకు చర్యలు చేపట్టారు. సోమవారం వచ్చిందంటే జిల్లా అధికారులంతా మూకుమ్మడిగా కలెక్టరేట్లో మీ కోసం కార్యక్రమానికి వస్తారు. మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటే ఆ ఫిర్యాదులను కలెక్టర్ సంబంధిత శాఖాధికారులకు అప్పగించి వాటి పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఇది ఇప్పటి వరకూ కొనసాగింది. అయితే కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఈ పద్ధతిని మానేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం ప్రాధాన్యం కలిగిన అధికారులు మాత్రమే మీ కోసం కార్యక్రమానికి హాజరు కావాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఫిర్యాదులు రానీ, వచ్చినా అరకొరా వచ్చే శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఉన్న శాఖల అధికారులు మాత్రమే రావాలనీ, వచ్చిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కరే ఉండాలి... అదీ ఉన్నతాధికారే.. ఇప్పటివరకూ ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమానికి ఒక్కో శాఖ నుంచి ఇద్దరేసి అధికారులు హాజరవుతుండేవారు. వచ్చే సోమవారం నుంచి ప్రతి శాఖ నుంచి ఒక్కరు మాత్రమే మీ కోసం కార్యక్రమానికి హాజరు కావాలంటూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. వచ్చే అధికారి కూడా ఆ శాఖ ఉన్నతాధికారి అయి ఉండాలని స్పష్టం చేశారు. కిందిస్థాయి సిబ్బందిని పంపిస్తే వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అధికారులు ఎవరైనా జిల్లా దాటివెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా తన అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. తిప్పిపంపిన కలెక్టర్ ఫిర్యాదులు రాని శాఖలైన అగ్నిమాపక, రవాణా, చేనేత, ఆర్టీసీ, నెడ్‌క్యాప్, ఎల్డీఎం, జిల్లా మలేరియా, ఆడిట్, మహిళా కౌన్సిలర్ విభాగం, కమర్షియల్ టాక్స్ వంటి శాఖల అధికారులను కలెక్టర్ సోమవారం మీ కోసం కార్యక్రమం నుంచి తిప్పి పంపించేశారు. ఈ సమయాన్ని ఇతర పనులకు కేటాయించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అదించాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదుదారులకు ఫోన్ ప్రతి సోమవారం వచ్చిన ఫిర్యాదులు పరిష్కారమయ్యాయా, కాలేదా, ఎందుకు కాలేదు వంటి వాటిపై ఇక నుంచి కలెక్టర్ ప్రత్యేకించి ప్రతి శుక్రవారం పరిశీలించనున్నారు. పరిష్కారమయ్యాయని అధికారులు చెప్పే అర్జీలను పునఃపరిశీలించనున్నారు. కలెక్టర్ అప్పటికప్పుడు ఏదో ఒక ఫిర్యాదుదారునికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కలెక్టర్ ముత్యాలరాజు కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. ఉద్యోగుల కోసమూ ‘మీ కోసం’ ఉద్యోగుల సమస్యలనూ పరిష్కరించేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులతో మీ కోసం కార్యక్రమాన్ని ప్రతినెలా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ ముత్యాలరాజు చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తేనే ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలను ప్రతి ఉద్యోగి అందించగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. వీలైతే ఈనెల 21న ఉద్యోగుల మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కలెక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. -
సారూ..దయచూపండి!
అనంతపురం అర్బన్ : ‘అయ్యా.. ఎప్పటి నుంచో తిరుగుతున్నాం.. అయినా సమస్యలు పరిష్కరించేవారులేరు.. మీరైనా దయచూపండి ’ అంటూ అధికారులకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ‘మీకోసం’లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ ఏడీ జి.విద్యావతి వినతి పత్రాలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 343 అర్జీలు అందాయని అధికారులు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు ఇలా.. మడకశిర, కళ్యాణదుర్గం డివిజన్లలో శ్రీరామరెడ్డి నీటి పథకంలో పని చేస్తున్న 255 మంది కార్మికులకు 49 నెలల పీఎఫ్ నిధులు చెల్లించలేదని శ్రీరామిరెడ్డి వాటర్ స్కీం కార్మిక సంఘం గౌరవ సలహాదారు జి.ఓబుళు, గౌరవాధ్యక్షుడు నాగరాజు, అధ్యక్ష, కార్యదర్శులు రామాంజి, బాషా విన్నించారు. ♦ హిందూపురం మండలం కగ్గళ్లు గ్రామానికి చెందిన శ్రీరాములు అనే దివ్యాంగుడికి కిడ్నీలు పాడై కుడికాలు పూర్తిగా దెబ్బతినింది. వైకల్య ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో పింఛన్ మంజూరు చేయలేదని జేసీతో తన గోడు వెల్లబోసుకున్నాడు. సదరం క్యాంపులో ధ్రువపత్రం ఇప్పించి, పింఛన్ మంజూరు చేయాలని కోరాడు. ♦ కుందుర్పి గ్రామంలోని న్యూ విన్సెంట్ ఫెర్రర్ కాలనీలో 112 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, సబ్‌ప్లాన్ నిధులతో విద్యుత్ సరఫరా, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఏడాదిగా విన్నవిస్తున్నా పట్టించుకోలేదని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కుందుర్పి ఓబయ్య, గ్రామస్తులు విన్నవించారు. ♦ తమ భూమిని ఆన్లైన్లో ఎక్కించడం లేదని బుక్కరాయసముద్రం కొత్తపల్లికి చెందిన కె.ఆర్.రెడ్డి ఫిర్యాదు చేశాడు. గోవిందంపల్లి గ్రామ పొలం సర్వే నంబరు 83–4బిలో తమకున్న ఐదు ఎకరాల భూమిని ఆన్లైన్లో చూపించలేదని తెలిపాడు. ♦ ఏళ్లగా సాగు చేసుకుంటున్న భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని పరిగి మండలం పరిగికి చెందిన అంజినప్ప విన్నవించాడు. సర్వే నంబరు 365–4లో 2.75 ఎకరాల భూమిని 60 ఏళ్లగా సాగు చేసుకుంటున్నామని, సాగుపట్టా ఇవ్వాలని కోరాడు. ♦ తన భర్త బాలగుర్రప్ప ఆనారోగ్యంతో మరణించాడని, కుటుంబ పోషణ భారంగా మారిందని తాడిపత్రి మండలం గన్నెవారిపల్లికి చెందిన బి.పెద్దక్క విన్నవించింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇప్పించాలని కోరింది. ♦ మా పేరున ఉన్న భూమిని వేరొకరి పేరున ఆన్లైన్లో నమోదు చేశారని తనకల్లు మండలం వంకపల్లికి చెందిన బుగిడే రామచంద్ర విన్నవించారు. తన పేరున సర్వే నంబరు 1073–10లో 21.5 ఎకరాల భూమి ఉందని చెప్పాడు. ఈ భూమిని వేరొకరి పేరున నమోదు చేశారని, దాన్ని రద్దు చేసి, తన పేరున మార్పు చేయాలని కోరాడు. ♦ తన కుమార్తె సుదేషిని కిడ్నీ వ్యాధితో బాధపడుతోందని, ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా వైద్యం అందించాలని నార్పల మండలం నడిమిపల్లికి చెందిన ఎం.వెంకటస్వామి విన్నవించాడు. -
సమస్యలపై నిర్లక్ష్యమేల..?
అనంతపురం అర్బన్ : సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో అధికారులకు ప్రజలు విన్నవించుకున్నారు. ప్రజల నుంచి డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, డీఎస్ఓ శివశంకర్‌రెడ్డి, తహసీల్దారు అనుపమ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 345 అర్జీలు అందాయి. కొన్ని సమస్యలు ఇలా... ♦ కొత్తచెరువు మండలంలో హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ రవీంద్రనాయక్‌పై దాడి చేసిన దామోదరనాయుడు, హరినాథ్‌రెడ్డి, ఉమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.మధు, నాయకులు రామకృష్ణ, పెద్దన, రమణ, మద్దిలేటీ, హుసేన్, వెంకటాద్రి విన్నవించారు. ♦ గుంతకల్లు మండలం ఎసీఎస్ మిల్లు కాలనీకి చెందిన హనుమయ్య కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏడాదిన్నర క్రితం రేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ128604000100) తొలగించారని, ప్రజాసాధికార సర్వేలో తాను ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నట్లు నమోదైందని ఫిర్యాదు చేశాడు. ♦ తనకు 2013లో ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యిందని, ఆ స్థలాన్ని పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయం వారు స్వాధీనం చేసుకున్నారని ధర్మవరం పట్టణం కొత్తపేటకు చెందిన కె.అమీనా ఫిర్యాదు చేసింది. ♦ ప్రభుత్వం తమకు ఇచ్చిన పట్టాకు వేరొకరు నకిలీ పట్టా సృష్టించారని కళ్యాణదుర్గం పట్టణం దేవీరమ్మకాలనీకి చెందిన ఎల్.గోపాల్‌నాయక్ విన్నవించారు. తన తల్లి కమలాబాయి పేరున 359 సర్వే నంబరులో పట్టా ఇచ్చారన్నారు. అదే స్థలానికి లక్ష్మక్క అనే మహిళ పేరున నకిలీ పట్టా పుట్టించి స్థలం తమదని చెప్పుకుంటున్నారన్నారు. పట్టా తిరిగి తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరాడు. ♦ యువ నేస్తం కింద నిరుద్యోగ భృతి కోసం ఐదు నెలలుగా దరఖాస్తు చేసుకుంటున్నా మంజూరు కాలేదని హీరేహల్‌కు చెందిన వై.చిదానంద విన్నవించాడు. ♦ తమ భూమికి వేరొకరి పేరున పట్టా ఇచ్చారని గుమ్మగట్ట మండలం భూప సముద్రానికి చెందిన జె.ఈశ్వరమ్మ ఫిర్యాదు చేసింది. 1990లో ప్రభుత్వం తమకు సర్వే నంబరు 151–13లో 3.50 ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. ♦ ఇల్లు మంజూరు చేయాలని ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని తాడిపత్రి మండలం వంగనూరు గ్రామానికి చెందిన చిలకలరాణి విన్నవించింది. ♦ తన భర్త బాలనాయక్ బీఎస్ఎఫ్ జవానుగా పనిచేస్తూ కోల్‌కోత్‌లో మరణించాడని బుక్కపట్నం మండలం చిన్నచెరువు గ్రామానికి చెంది వై.జయమ్మ చెప్పింది. -
కష్టాలు కాగితాలకే పరిమితమా?
అనంతపురం అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే ‘మీకోసం’ కార్యక్రమం ఫిర్యాదుల స్వీకరణకే పరిమి తమవుతోంది. సమస్యలను అర్జీల రూపంలో రాసుకొని కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారానికి నోచుకోలేదని ప్రజలు నిట్టూరుస్తున్నారు. తమ గోడు కాగితాలకే పరిమితమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ‘మీ కోసం’లో గ్రామీణ ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న సమస్యలే ఇందుకు నిదర్శనం. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ఆర్డీఓలు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 405 అర్జీలు అందాయి. కొన్ని సమస్యలు ఇలా... ♦ తన తండ్రి పేరున ఉన్న సర్వే నంబరు 599–2లో 4.90 ఎకరాల భూమిని వేరొకరి పేరున (చింతల బయమ్మ, చింతల మల్లన్న) మార్చారని ధర్మవరం మండలానికి చెందిన రియాజ్ ఖాన్ ఫిర్యాదు చేశాడు.దాన్ని రద్దు చేసి తమ పేరున ఆన్లైన్లో నమోదు చేయించాలని కోరారు. ♦ వృద్ధాప్య పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యామ్‌కు చెందిన కమలమ్మ ఆవేదన చెందుతోంది. తన గోడును కలెక్టర్‌కు చెప్పుకుందామని వచ్చినట్లు తెలిపింది. ♦ తన భర్త వదిలేసి 20 ఏళ్ల అయ్యిందని, కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కూమార్తె పెళ్లి చేశానని, ప్రస్తుతం కష్టం చేయలేని స్థితిలో ఉన్నానని తనకల్లు మండలం బొంతలపల్లికి చెందిన ఎన్.నాగలక్ష్మి విన్నవించింది. ♦ ఖరీఫ్‌లో వర్షాభావంతో జొన్న పంట దెబ్బతినిందని పరిగి మండలం మోద గ్రామానికి చెందిన ఎం.చంద్రశేఖర్ విన్నవించుకున్నాడు. ♦ తన భర్త గంగరాజు అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా పనిచేశాడని, కంపెనీ చేసిన మోసానికి మానసిక ఒత్తిడికి గురై ఈ ఏడాది ఫిబ్రవరి 9న గుండెపోటుకు గురై మరణించాడని ఉరవకొండ మండలం పాతపేటకు చెందిన వడ్డే ఉష తెలిపింది. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయించాలని కోరింది. ♦ తన భర్త వెంకటేశ్ 2016 అక్టోబరు 7న మరణించాడని, ఆ తరువాత నుంచి కుటుంబం గడవడం కష్టంగా మారిందని బుక్కరాయసముద్రం మండలం విజయనగర్ కాలనీకి చెందిన ఎం.భవాని విన్నవించింది. ♦ తన పేరున ఏఓటీపీ 0754 నంబరుపై వృద్ధాప్య పింఛను వస్తున్నా నెలనెలా డబ్బులు ఇవ్వడంలేదని అనంతపురం రూరల్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దాసరి జయలక్ష్మి విన్నవించింది. -
‘ఇంటికెళ్తే కోడలు చంపేస్తుంది’
ఆస్తి కోసం నా కోడలు వేధిస్తోంది. ఇప్పటికి ఐదుసార్లు కొట్టింది. ఇంటికెళ్తే చంపేస్తుందన్న భయంతో పొరుగింటిలో తలదాచుకున్నా. కోడలు, మనవడి దాడిలో గాయపడి తెనాలి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందిన వృద్ధురాలు ధనలక్ష్మి సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఆర్డీఓ ఎం.శ్రీనివాసరావు ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నారు. గుంటూరు, తెనాలి:‘‘ఆస్తికోసం కోడలి అఘాయిత్యాన్ని భరించలేకపోతున్నా...ఇప్పటికి అయిదుసార్లు కొట్టింది...ఇంటికెళితే చంపేస్తుందని భయపడి, పొరుగింటిలో తలదాచుకున్నా...నా ఇంటినుంచి అందరినీ పంపించేస్తే, నా బతుకు నేను బతుకుతాను’’...అంటూ రూరల్ తెనాలి మండలం సంగంజాగర్లమూడి గ్రామానికి చెందిన నాగమోతు ధనలక్ష్మి తెనాలి ఆర్డీవో ఎం.శ్రీనివాసరావును కలిసి మొరపెట్టుకుంది. తెలిసిన మహిళల సాయంతో సోమవారం ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన ఆమె ‘మీకోసం’ సమావేశంలో ఆర్డీవోను కలిసింది. కోడలు, మనుమడు కొట్టటంతో గాయపడి, తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందిన ఆమె అక్కడ్నుంచే ఆర్డీవోకు అర్జీని పంపారు. స్వయంగా తన గోడును వినిపించేందుకు ‘మీకోసం’కు వచ్చారు. కోడలు తనపై ఇప్పటికి అయిదుసార్లు చేయిచేసుకుందని ఆర్డీవోకు చెప్పారు. తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు చెప్పారు. ఇంటికి వెళితే కోడలు తనను చంపేస్తుందని భయంగా ఉందని ధనలక్ష్మి వాపోయింది. తన ఇంటినుంచి వారిని బయటకు పంపితే, పనిమనిషిని పెట్టుకుని తన బతుకు తాను బతకగలనని, విచారించి న్యాయం చేయాలని కోరారు. ఆర్డీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆమె కుటుంబసభ్యులకు నోటీసులు పంపి, తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కొడుకులు వెళ్లగొట్టారు తనను ఇంటినుంచి వెళ్లగొట్టి, కొడుకులు ఇల్లు ఆక్రమించుకున్నారని వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన తాడిబోయిన రామయ్య (71) ‘మీకోసం’లో ఇచ్చిన అర్జీలో ఆరోపించారు. కూతురు మోసంతో ఆస్తి రాయించుకుందిపొన్నూరుకు చెందిన ఇంటూరి సత్యనారాయణరావు ఇచ్చిన అర్జీలో తన కుమార్తె మోసపూరితంగా తనతో ఆస్తిని రాయించుకుందని ఆరోపించారు. తెనాలి పట్టణానికి చెందిన గుంటూరు జకరయ్య కూడా తనను బిడ్డలు ఇంటినుంచి గెంటేశారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. -
విసిగి.. వేసారి !
తెనాలి: తన 25 సెంట్ల భూమి సర్వేకు 2007 నుంచి రెవెన్యూ అధికారులు కాళ్లరిగేలా తిప్పుతున్నారని కృష్ణవేణి అనే మహిళ స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన ‘మీకోసం’లో తన గోడును మరోసారి ఆర్డీవోకు విన్నవించుకుందామని ఆమె గుంటూరు నుంచి వచ్చారు. తీరా ఆర్డీవో జి.నరసింహులు బదిలీపై వెళ్లారని తెలిసి నిరాశకు లోనయ్యారు. తహసీల్దారు, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ఏళ్లుగా తిరగడమే తనకు సరిపోతోందనీ, సర్వేలకని, పట్టాదారు పుస్తకాలకని, కిందిస్థాయి ఉద్యోగులకని, ఖర్చులకనీ ఇప్పటికే లక్ష రూపాయలకు పైగా ఖర్చయ్యాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... తెనాలి రూరల్ మండలం గుడివాడలో సర్వేనంబరు 148సి–5బిలో 25 సెంట్ల మాగాణి భూమి కృష్ణవేణి తండ్రి కంచర్ల నాగేశ్వరరావు పేరిట ఉంది. 2007 నుంచి సర్వే చేయించాలని కోరుతూ వచ్చారు. సాధ్యపడలేదు. ఆయన మరణించాక వీలునామా ప్రకారం తన పేరును అడంగల్‌లో చేర్చి, పట్టాదారు పుస్తకం ఇప్పించాలని దరఖాస్తు చేశారు. ఎలాంటి స్పందన లేకపోవటంతో జిల్లా కలెక్టరును కలిశారు. జిల్లా సర్వే, లాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.కెజియాకుమారి కూడా ఆర్డీవోకు రిఫర్ చేశారు. ఈ క్రమంలోనే కృష్ణవేణి 2015లో 20 సెంట్ల భూమిని వేరొకరికి విక్రయించారు. అడంగల్‌లో నమోదు కానందున అగ్రిమెంటు ప్రకారం వారు రూ.25 వేల అడ్వాన్సు మినహా డబ్బు మొత్తాన్ని చెల్లించలేదు. ఇదిలా ఉంటే, వీలునామాను పరిగణనలోకి తీసుకోవాల్సిన మండల తహసీల్దారు ఆ భూమి వివాదంలో ఉందనీ, కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలంటూ ఇటీవల నివేదించారని కృష్ణవేణి చెప్పారు. ప్రస్తుతం ఆ భూమి ఇతరుల స్వాధీనంలో ఉందనీ, 1987లోనే వారి పెద్దలకు కృష్ణవేణి తండ్రి నాగేశ్వరరావు విక్రయ అగ్రిమెంటు రాశారనీ, మళ్లీ ఇప్పుడు వారి వారసుడితోనే కృష్ణవేణి విక్రయ అగ్రిమెంటు చేసుకున్నారని తహసీల్దారు ఆ నివేదికలో పేర్కొన్నారు. అడ్వాన్సు రూ.25 వేలు మినహా మిగిలిన రూ.4.75 లక్షలు చెల్లించనందున వివాదం నెలకొందని, కోర్టులో పరిష్కరించుకోవాలని హితవు చెప్పారు. 1987లో విక్రయ ఒప్పందం ఉంటే ఎందుకు రిజిస్టరు చేసుకోలేదు? అలాంటి ఒప్పందం ఉంటే వారి వారసులే ఈ భూమిని తన దగ్గర ఎందుకు కొంటారు? అడంగల్‌లో నమోదు కానపుడు పూర్తి డబ్బులు ఎందుకు చెల్లిస్తారు? అసలు వీలునామా ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇవన్నీ ఎందుకు? అనే కృష్ణవేణి ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పటం లేదు. గుడివాడ గ్రామ అధికార పార్టీ నేత జోక్యంతో మండల తహసీల్దారు ఈవిధంగా చేశారని కృష్ణవేణి ఆరోపించారు. విసిగివేసారి తక్కువ ధరకు భూమిని అమ్మేసుకొనేలా చేయాలనే కుట్ర జరుగుతోందన్న సందేహాన్ని ఆమె వ్యక్తం చేశారు. ‘మీకోసం’లో మూడు అర్జీలు... ‘మీకోసం’లో అర్జీలను ఆర్డీవో కార్యాలయ ఏవో ఎ.చెంచులక్ష్మి స్వీకరించారు. రూరల్ మండలం బుర్రిపాలెంలో తన 18 సెంట్ల స్థలంలో రోడ్డు నిమిత్తం వదిలిన 3 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైందనీ, విచారించి న్యాయం చేయాలని శాఖమూరి సామ్రాజ్యం అర్జీనిచ్చారు. అమృతలూరు మండలం మూల్పూరులో తన పొరుగు రైతు పసుపులేటి శ్రీను పంటకాలువ మూసేసి, తన పొలానికి నీళ్లు రాకుండా చేస్తున్నారని భవనాసి ఆశీర్వాదం అర్జీలో ఆరోపిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణ బాలాజీరావుపేటలో ప్రభుత్వ ఖాళీస్థలంలో రేకుల షెడ్డు వేసుకుని గత 30 ఏళ్లుగా జీవిస్తున్న తనకు పట్టాను ఇప్పించాలని కోరుతూ పాలపర్తి మహాలక్ష్మి అనే మహిళ అర్జీనిచ్చారు. విద్యుత్ సమస్యలపై రూరల్ మండలం చావావారిపాలెం నివాసి భవతుల రవి, అమృతలూరు మండలం యడవూరు గ్రామస్తులు ఇచ్చిన అర్జీలను ‘మీకోసం’లో ఉన్న విద్యుత్ డీఈఈకి చర్యల నిమిత్తం ఇచ్చారు. వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
విన్నపాలు వినవలే..!
ఒంగోలు అర్బన్: ప్రకాశం భవన్‌లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ వి. వినయ్‌చంద్ సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చి వినతిపత్రాలు అందచేశారు. పింఛన్లు, పొలాలకు సంబంధించిన సమస్యలు, ఇళ్లు కావాలంటూ ప్రజలు తమ వినతి పత్రాల్లో పేర్కొన్నారు. కలెక్టర్‌తో పాటు అదనపు సంయుక్త కలెక్టర్ డి.మార్కండేయులు, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, డీటీడబ్ల్యూఓ రాజ్యలక్ష్మిలు బాధితుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలు మీకోసం కార్యక్రమానికి వచ్చి వినతిపత్రాలు అందజేస్తారని, వాటి పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం లేకుండా సత్వరమే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ ఆదేశించారు. ♦ మర్రిపూడి మండలం జువ్విగుంటకు చెందిన వైష్ణవి డ్వాక్రా గ్రూపులో రుణమాఫీ కాలేదని ధనలక్ష్మి అనే మహిళ వినతిపత్రం అందజేసింది. తక్షణమే రుణమాఫీ వర్తింపజేయాలని ఆమె కోరింది. ♦ సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన అనంతవరపు చిన్న ఏసు తనకు 67 ఏళ్లు ఉన్నా వృద్ధాప్య ఫింఛన్ మంజూరు కాలేదని, దయచేసి మంజూరు చేయాలంటూ వేడుకున్నాడు. ♦ సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామానికి చెందిన మాదాల కోటయ్య తనకు సర్వే నంబర్ 851లో 1.77 సెంట్ల భూమి ఉందని, ఆ భూమిని వేరే వ్యక్తికి వీఆర్ఓ డబ్బులు తీసుకుని ఆన్లైన్ చేసాడని ఫిర్యాదు చేశాడు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు. ♦ దొనకొండ మండలం కలివలపల్లె గ్రామానికి చెందిన చిన్నం సోనమ్మ తాను కూలిపని చేస్తూ జీవిస్తున్నానని, ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నానని కలెక్టర్‌కు తెలిపింది. తనకు పక్కా ఇల్లుళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ♦ యద్దనపూడి మండలం చింతపల్లిపాడుకు చెందిన ఐ.యానాది తన కుమార్తె మరియమ్మకు నూరుశాతం వికలత్వం ఉందని, వికలాంగ పింఛన్ ఇప్పించాలని కోరాడు. ♦ బేస్తవారిపేట మండలం బండుట్ల గ్రామానికి చెందిన జి.నెమలిగుండం తనకు పూర్తి చెవుడు ఉండి వినికిడి పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నాని, వాటిని మంజూరు చేయించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు. ఒంగోలు నగర పాలక సంస్థలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకం, వాహనాల వినియోగంపై అక్రమాలు జరిగాయని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు నాగరాజు మీకోసంలో కలెక్టర్ వినయ్‌చంద్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కైలాస్ గిరీశ్వర్, ఏపీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ సుబ్బరాజు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆస్తికోసం కుమారుల అమానుషం
తెనాలి: ఆదరించకపోగా, చిత్రహింసలకు గురిచేస్తున్న కుమారుల అమానుషానికి ఓ వృద్ధ జంట భయంతో వణికిపోతోంది. ఉన్న ఇంటిని విక్రయించాలంటూ కొడుతున్న కుమారుల రెండురోజుల క్రితం పారిపోయిన ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. సోమవారం తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ‘మీ కోసం’ సమావేశంలోనూ ఆర్డీఓ జి.నరసింహులుకు తన గోడు విన్నవించారు. తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన 64 ఏళ్ల మర్రిపూడి నరసయ్య గతంలో సంగం డెయిరీలో బుల్ అటెండెంట్‌గా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. దేవతా విగ్రహాల తయారీలో కూలీగా ఒకరు, మరొకరు కాంట్రాక్టరుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ కష్టార్జితంతో 74 సెంట్ల స్థలంలో కొంత మేర ఇల్లు నిర్మించుకున్నాడు. 2006లో కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం కుమారులను సంప్రదించగా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి, వచ్చే డబ్బుతో చెల్లి పెళ్లి చేయాలని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లే నరసయ్య తన కుమార్తె పెళ్లి చేశారు. ఉద్యోగవిరమణతో వచ్చిన డబ్బు ఖర్చయ్యాక కొడుకుల నైజం బయటపడింది. అప్పటికే పెళ్లిళ్లయిన ఇద్దరు కొడుకులు ఆ ఇంట్లోనే వేరు వంట ఆరంభించారు. చేసేదిలేక నరసయ్య దంపతులు కూడా వేరుగా వంట చేసుకుంటున్నారు. కొద్దిరోజులకు ఇంటిపైన రేకుల షెడ్డు వేసుకుని అందులోకి వెళ్లిపోయారు. ఇల్లు అమ్మి డబ్బు పంచాలంటూ కొడుకులు చేయిచేసుకొంటున్నారు. వృద్ధ దంపతులు నెలనెలా వచ్చే రూ.1000 పింఛన్ ఖర్చులకుచాలక కుమార్తెకు తెలిసినవాళ్ల దగ్గర అప్పులు తీసుకున్నారు. ఇందుకుగాను ఇల్లు అగ్రిమెంటు రాసి, ఆమె పేరిట తనఖా రిజిస్టరు చేశారు. అప్పట్నుంచి కొడుకులు మరింతగా వేధింపులు ప్రారంభించారు. పెద్ద కొడుకు నరసయ్య ఇంట్లో, రెండో కుమారుడు తెనాలిలో నెలకు రూ.4 వేల అద్దె ఇస్తూ నివసిస్తున్నారు. వారిద్దరూ తల్లిదండ్రులను పట్టించుకోలేదు. నరసయ్య భార్యకు ఆరోగ్యం బాగోలేక చిక్కిశల్యమైంది. బయటకు రాలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలోనూ వారిని ఆదుకోగా ఇంటి విషయమై తరచూ గొడవలు పెట్టుకోవటం కొడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. కొడుకులను పిలిపించిన పోలీసులు, ఎవరో పెద్దమనిషి ఫోను చేయటంతో కేవలం హెచ్చరికలతో సరిపెట్టి పంపించేశారు. రెండురోజుల క్రితం రెండో కొడుకు, ఇతర బంధువర్గం ఉండగానే పెద్దకొడుకు నరసయ్యపై దాడిచేశాడు. భయంతో పోలీసులను ఆశ్రయించిన నరసయ్య తిరిగి ఇంటికి వెళ్లలేకపోయాడు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసి తనను రక్షించాలని కోరారు. తన ఇంటినుంచి బిడ్డలను ఖాళీచేయిస్తే వేరొకరికి అద్దెకు ఇచ్చి, కొంతయినా బాకీలు తీర్చుకుంటామని వేడుకున్నారు. -
ఎక్కడి సమస్యలు అక్కడే
సాక్షి ప్రతినిధి, ఏలూరు:‘రేషన్ ఇప్పించాలంటూ రెండేళ్లుగా తిరుగుతున్నాను. కాళ్లరిగిపోతున్నాయి కాని సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ప్రమాదంలో గాయపడటంతో గుంటూరు ఆసుపత్రిలో రెండునెలలు ఉండాల్సి వచ్చింది.దీంతో రేషన్ నిలిపివేశారు. దీని కోసం రెండేళ్ల నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను’. ఇది ఒక్కడి ఆవేదన కాదు. కలెక్టరేట్‌కు ప్రతి సోమవారం మీ కోసం కార్యక్రమానికి వచ్చేవారిలో సగానికి పైగా బాధితులు రెండు, మూడుసార్లు జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి తమ సమస్యలు విన్నవించుకోవడానికి కలెక్టరేట్‌కు వచ్చినవారే. మండల, గ్రామస్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు అక్కడ పరిష్కారం కాకపోవడంతో జిల్లా కలెక్టరేట్కువస్తున్నారు. ఇక్కడ కూడా మళ్లీ అక్కడి అధికారులకే రిఫర్ చేస్తున్నా వారు స్పందించడం లేదు. దీంతో ఒకటికి రెండుసార్లు జిల్లా కలెక్టర్‌ను కలిస్తేగాని సమస్య పరిష్కారం కాని పరిస్థితి ఏర్పడుతోంది. వీటికి తోడు వ్యక్తిగత సమస్యలతో కూడా జిల్లా కలెక్టరేట్‌కు వస్తున్నారు. కుటుంబసభ్యులు సరిగ్గా చూడకపోయినా మీ కోసం కార్యక్రమానికి వస్తున్నారు. దీంతో వీరిని మళ్లీ ఎస్పీ కార్యాలయానికి పంపుతున్నారు. రాజకీయ కారణాలతో ఇళ్లస్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు తిరస్కరించిన వాటిపై ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. తమతో పాటు దరఖాస్తు చేసుకున్న వారందరికి ఇళ్ల స్థలం మంజూరు అయినా ఎంపీటీసీ అడ్డం పడటంతో తమకు రాలేదని కోడూరుపాడుకు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేసింది. అక్రమంగా మట్టి తవ్వకాలు, అనుమతి లేకుండా చేపల చెరువులు, రొయ్యల చెరువుల తవ్వకాలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే వాటిపై చర్యలు ఉండటం లేదు. దీంతో పదేపదే ఆదే ఫిర్యాదుపై రావాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం భూమిని స్వాధీనం చేసుకున్నా పరిహారం అందక బాధితులు కలెక్టరేట్‌కు వచ్చారు. ఇంతకుముందే స్థానిక ఎమ్మార్వోతో పాటు అడిషనల్ జేసీని కలిసినా తమకు న్యాయం జరగలేదని వాపోయారు. గణపవరం మండలం కొమ్మర గ్రామంలో చేపల చెరువులకు అనుమతులు తీసుకుని ఉప్పునీరు తోడి రొయ్యలు సాగు చేస్తున్నారని దానివల్ల సమీపంలో ఉన్న అన్ని పంట పొలాలు దెబ్బతిని దిగుబడి తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామంలో సర్వే నెంబర్ 235లో సబ్‌డివిజన్ చేయకుండా, లే అవుట్ వేయకుండా అర్హత లేని వారికి కూడా ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని, గ్రామంలో అర్హత ఉన్న పేదలను పట్టించుకోకుండా గ్రామ సర్పంచ్ బంధువులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని ఫిర్యాదు చేశారు. ఇదే మండలం దొండపూడి గ్రామంలో పంచాయతీకి సంబంధించిన స్థలంలో సర్పంచ్ దగ్గర బంధువు సొంతంగా పక్కా బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ చేసి న్యాయం చేస్తాంఇన్ఛార్జి కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు మీ – కోసంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అవసరమైతే సమగ్ర విచారణ చేసి తప్పనిసరిగా అర్జీదారులకు న్యాయం చేస్తామని ఇన్చార్జి కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో అర్జీదారులు నుండి ఇన్చార్జి కలెక్టర్ వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారులు ఫిర్యాదులను అందచేసి పరిష్కారం కాలేదంటూ మళ్ళీ వారం మీకోసం కార్యక్రమానికి సమయం, సొమ్ములు వెచ్చించుకుని వస్తున్నారని అయితే ఇచ్చిన దరఖాస్తులు అధికారులు పరిశీలించి విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకుని అర్జీదారులకు పూర్తి న్యాయం చేయడానికి కొంత సమయం పడుతుందని, అర్జీదారులు వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. పదే పదే మీకోసం కార్యక్రమానికి సమయం, సొమ్ము వృథా చేసుకుని రావాల్సిన అవసరం లేదని ఇచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించి అవసరమైన న్యాయం చేయడానికి అధికారులు ఎప్పుడూ చిత్తశుద్ధిగా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. -
అర్జీలు సత్వరం పరిష్కారం కావాలి
కాకినాడ రూరల్: ప్రజావాణి–మీకోసం కార్యక్రమంలో స్వీకరించిన ప్రజల దరఖాస్తులు, అర్జీలపై అధికారులు సత్వరమే చర్యలు చేపట్టి పరిష్కరించాలని జేసీ ఎ.మల్లికార్జున ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఆయనతోపాటు జేసీ–2 రాధాకృష్ణమూర్తి ప్రజల నుంచి 278 అర్జీలను స్వీకరించారు. వీటిపై తీసుకున్న చర్యలను అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజన్, మండలాల్లో నిర్వహిస్తున్న మీకోసం అర్జీల పరిష్కారంపై సమీక్ష చేసి జేసీ ఈ ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రలోభాలకు లొంగినా, అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సీతానగరం మండలం వంగలపూడికి చెందిన చెల్లూరి మంగయ్యమ్మ ఎకరం భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసినా చర్యలు తీసుకోలేదన్న అర్జీపై సీతానగరం తహసీల్దార్‌ను విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. సామర్లకోట మండలం చింతపల్లి నాగార్జున తన స్థలంలో అంగన్వాడీ కేంద్రం నిర్మించి, వేరే స్థలం ఇస్తానని చెప్పారని, ఇప్పుడు స్థలం ఇవ్వకుండా రూ.2 లక్షలు ఇవ్వాలని ప్రెసిడెంట్, గ్రామస్తులు అడుగుతున్నారని ఇచ్చిన అర్జీపై సామర్లకోట తహసీల్దార్ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కాకినాడ అర్బన్‌కు చెందిన పెమ్మాడ సత్యవతి మున్సిపాలిటీలో నాలుగేళ్లుగా కాంట్రాక్టు స్వీపరుగా పని చేస్తుంటే చెప్పకుండా విధుల నుంచి తొలగించారని, వేతనం కూడా ఇవ్వలేదని అర్జీ అందజేసింది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను విచారణ చేసి ఆమెకు పని కల్పించాలని జేసీ ఆదేశించారు. తాళ్లరేవు మండలం పటవల పంచాయతీ శాంతిమూలకు చెందిన పిట్లా అర్జునరావు అందజేసిన అర్జీలో...పోరంబోకు భూమి ఆక్రమణపై తహసీల్దారుకు అర్జీ పెట్టినా పట్టించుకోలేదని వాపోయారు. తాళ్లరేవు తహసీల్దార్ విచారణ చేసి చర్యలు చేపట్టాలని జేసీ ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంపైనివేదిక ఇవ్వాలి గత వారంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలుపై సమగ్రమైన నివేదిక అందజేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. తీసుకున్న చర్యలు, పెండింగ్‌లో ఉంచడానికి కారణాలు తెలియజేయాలన్నారు. మీకోసం పోర్టల్‌లో తీసుకున్న చర్యలు, పరిష్కరించిన వాటి వివరాల నివేదిక అప్లోడ్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీడీ జి.రాజకుమారి, జెడ్పీ సీఈఓ గోవిందరావు, ఎస్డబ్ల్యూ డీడీ శోభారాణి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
‘మీ కోసం’లో వినతుల వెల్లువ
అనంతపురం అర్బన్ : సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ జి.వీరపాండియన్‌కు ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జరిగిన మీ కోసంలో ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు జేసీ రమామణి, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డీఆర్ఓ ఎస్.రఘునాథ్, జేడీఏ శ్రీరామ్మూర్తి, ఐసీడీఎస్ పీడీ వెంకటేశం, డీఆర్డీఏ పీడీ కె.ఎస్.రామారావు అర్జీలు స్వీకరించారు. అర్జీల్లో ఏ సమస్యలున్నాయంటే...: ♦ రోడ్డు స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని రుద్రంపేట పంచాయతీకి చెందిన జి.రామాంజనేయులు ఫిర్యాదు చేశాడు. రోడ్డు స్థలంలో కట్టడాలు తొలగించాలని కోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదు చేశాడు. ♦ రేషన్ కార్డు ఉన్న బధిరులకు కూడా 35 కేజీలు బియ్యం ఇవ్వాలని బధిరుల సంఘం ప్రధాన కార్యదర్శి బి.రాఘవేంద్ర మీకోసంలో విన్నవించాడు. ♦ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న కాం ట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరి ష్కరించాలని సంఘం అధ్యక్షుడు కె.విజయ్, ఇతర నాయకులు కోరారు. ♦ ఎస్ఎస్ఏలో వివిధ విభాగాల్లోని ఉద్యోగులకు విద్యాశాఖలో విలీనం చేయాలని ఎస్ఎస్ఏ ఉద్యోగుల రిజిష్టర్డ్ యూనియన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సాజిద్‌బాషా, కార్యదర్శి హాజీమాలిక్, నాయకురాళ్లు నాగరత్నమ్మ, కల్పన, సుమలత, రాజమ్మ, భావన, ఇందిరా విన్నవించారు. ♦ బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేట, రేకులకుంట, కొండాపురం, ఓబుళాపురం గ్రామాల్లో అధికంగా రజక కుటుంబాలు ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో ధోబీఘాట్ నిర్మించాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు లింగమయ్య, నాయకులు హరికృష్ణ, రజకులు కోరారు. అయ్యా..నాళుగేళ్లగా తిరుగుతున్నాం అయ్యా.. మా అబ్బాయి తరుణ్‌రెడ్డి (12) బుద్ధిమాద్యంతో ఎదుగుదలలేకుండా పోయింది. పింఛను కోసం నాలుగేళ్లగా తిరుగుతున్నాం. రేషన్ కార్డు మీద వేరొకరు పింఛను తీసుకుంటున్నట్లుగా ఆన్లైన్లో చూపుతోందని అధికారులు చెప్తున్నారు. మార్పు చేయించుకుపోయినా పింఛన్ రాలేదు. ఎంపీడీఓను అడిగితే ఎమ్మెల్యే చెప్పిన వారికే పింఛన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలున్నాయని సమాధానం ఇస్తున్నారు. మాలాంటి పేదోళ్లకు న్యాయం చేయండి అంటూ గుంతకల్లు మండలం అయ్యవారిపల్లికి గ్రామానికి చెందిన వి. శివరామిరెడ్డి కలెక్టర్‌కు విన్నవించుకున్నాడు. ఇలా ఎందరో వివిధ సమస్యలపై కలెక్టరేట్లో వినతులు అందజేశారు. -
సమస్యలు పరిష్కరించండయ్యా..
ఒంగోలు టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు జిల్లా ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన మీకోసంలో జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జీఓలు అమలు చేయాలి జిల్లాలోని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ఏడురకాల జీఓలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు సీహెచ్ మజుందార్, కార్యదర్శి కె.శ్రీనివాసరావు కోరారు. పర్మినెంట్ పంచాయతీ కార్మికులకు 010 పద్దు కింద జీతాలు చెల్లించేందుకు, టెండర్ విధానం రద్దు చేసి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్టు పద్ధతిన కనీస వేతనం ఇచ్చి వారినే కొనసాగించాలని, ఎన్ఎంఆర్, పార్ట్‌టైం, ఫుల్‌టైమ్ కాంట్రాక్టు పద్ధతిన పంచాయతీల్లో పనిచేస్తున్న అర్హుల జాబితా తయారు చేసి కమీషనరేట్‌కు పంపించడం తదితర వాటికి సంబంధించిన జీఓలను జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి పంపించలేదని పేర్కొన్నారు. నివేశన స్థలాలు కేటాయించాలి చినగంజాం మండలం చినగంజాం, కడవకుదురు, చింతగుంటల గ్రామాల్లో అర్హులైన 400 మందికి నివేశన స్థలాలు ఇవ్వాలని ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు వేడుకున్నారు. సర్వే నం 828, 128, 129లో ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. కూలీనాలి చేసుకొని జీవించే తమకు ఇళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో స్థలాలు ఇవ్వమని స్థానిక తహసీల్దార్‌ను వేడుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. మీరైనా న్యాయం చేసి ఇళ్లు ఇప్పించాలని కోరారు. హేచరీలపై చర్యలు తీసుకోవాలి నాసిరకం రొయ్య పిల్లలు తయారు చేస్తున్న హేచరీలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మండవ శ్రీనివాసరావు, దుగ్గినేని గోపీనా«థ్ కోరారు. తీర ప్రాంతాల్లోని 20 వేల హెక్టార్లలో రైతులు వెనామీ రకం రొయ్య సాగు చేస్తున్నారన్నారు. 36 వెనామీ రకం రొయ్య పిల్లలను తయారు చేసే హేచరీలు ఉన్నాయని, వీటి నుంచి రైతులు రొయ్య పిల్లలను కొనుగోలు చేసి వారి చెరువుల్లో సాగు చేస్తారన్నారు. రెండేళ్ల నుంచి కొన్ని హేచరీలు నాసిరకం రొయ్య పిల్లలు తయారు చేసి రైతులకు అమ్ముతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఒక్కో రైతు ఎకరాకు 3 లక్షల రూపాయల వరకు నష్టపోయారని విచారం వ్యక్తం చేశారు. హేచరీలపై నిఘా ఉంచి నాణ్యమైన రొయ్య పిల్లలను అందించేలా చూడాలని కోరారు. బట్వాడాలు ఆగిపోయాయి మార్కాపురంలోని పలకల కార్మికులను ఆదుకోవాలని మార్కాపురం డిజైన్ స్లేట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. మార్కాపురంలో తీవ్ర కరువు నెలకొన్న నేపథ్యంలో వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పలకల పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. పలకల యజమానులు తాము ఎగుమతి చేసిన సరుకు తాలూకు హెడ్ఫారం సకాలంలో అందజేయలేదన్న సాకుతో పరిశ్రమ బ్యాంకు ఖాతాలను హోల్డ్‌లో పెట్టారన్నారు. దీంతో కార్మికులకు నెల రోజులకు పైగా బట్వాడాలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నుల శాఖ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అకౌంట్స్‌ను హోల్డ్‌లో పెట్టిందని ఫిర్యాదు చేశారు. మౌలిక వసతులు కల్పించాలి ఒంగోలు నగరం 50వ డివిజన్ జయప్రకాష్ ఎక్స్టెన్షన్ కాలనీలో నివాసం ఉంటున్న తమకు మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు వేడుకున్నారు. తమ కాలనీ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ దుర్బర జీవితాన్నే గడుపుతున్నామన్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రోడ్డు లేకపోవడంతో గుంటల నుంచి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నట్లు వాపోయారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ల మధ్యే మురుగునీరు నిలిచి వ్యాధులు విజృంభిస్తున్నాయన్నారు. తమ కాలనీకి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మిరప పంటను వైరస్ కాటేసింది మిరప పంటకు జెయిని వైరస్ వ్యాపించి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని యర్రగొండపాలెం మండలం వీరభద్రాపురానికి చెందిన రైతులు వాపోయారు. గ్రామంలో 300 ఎకరాల్లో మిరప పంట సాగు చేశామని, పూత పిందె దశలో ఒక్కసారిగా తామర పురుగు, నల్లి, తెల్లదోమ వ్యాపించడంతో పూర్తిగా దెబ్బతిందన్నారు. ఒక్కో రైతుకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 5 క్వింటాళ్లకు మించి రాలేదన్నారు. ఇప్పటికే 100 ఎకరాల్లో పంట తీసివేయడం జరిగిందన్నారు. తమ పంటకు నష్టపరిహారం నమోదు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. -
సివిల్ కేసులు కోర్టుల్లో పరిష్కరించుకోండి
ఏలూరు అర్బన్: సివిల్ తగాదాలను కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఫిర్యాదుదారులకు సూచించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ కోసం కార్యక్రమంలో ఎస్పీ రవిప్రకాష్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులకు సంబంధించి సత్వరం విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. చాలా మంది సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోకుండా నేరుగా మీ కోసం కార్యక్రమానికి వస్తున్నారని, అదేవిధంగా పలువురు సివిల్ తగదాలపై ఫిర్యాదు చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. ఇలా చేయడం వల్ల బాధితులు వ్యయప్రయాలకు లోనవుతున్నారని, దీంతో న్యాయం చేయడంలో జాప్యం జరిగే అవకాశముందని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు. ఎస్పీ దృష్టికి వచ్చిన కొన్ని ఫిర్యాదులు ఇలా.. ∙జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులను ఆరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం (ఎస్సీఆర్పీఎస్) జిల్లా అధ్యక్షుడు పాము శామ్యూల్ జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ను కోరారు. పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో దళితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంఘ నాయకులు కె.ఆనందరావు, ఉప్పే ధనుంజయరావు తదితరులు ఎస్పీని కలిసిన వారి లో ఉన్నారు. ∙గరగపర్రు గ్రామంలో శాంతిభద్రలను కాపాడాలని, దళితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జిజ్జువరపు జయరాజు వినతిపత్రాన్ని సమర్పించారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ జిల్లాలో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఎస్పీని కలిసిన వారిలో సమితి నాయకులు మాత్రపు లోకేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
ఫిర్యాదుదారుల చెంతకే అధికారులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ‘మీ కోసం’ కార్యక్రమంలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఇకపై అధికారులు ఫిర్యాదుదారుని వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. సమస్యలతో సతమతం అవుతున్న వారు, ప్రభుత్వ సహాయం అర్థించే వారు ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు రావ డం.. వినతిపత్రాలు ఇవ్వడం.. సమస్య పరిష్కారం కాకపోవడంతో పదేపదే అధికారుల చుట్టూ తిరగడం సర్వసాధారణ విషయంగా మారింది. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పలువురు కలెక్టరేట్ వద్దే ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 24న నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుంచి ‘మీ కోసం’లో వచ్చిన అర్జీలను స్వీకరించిన అనంతరం.. వాటిని పరిష్కరించాలి్సన బాధ్యత గల అధికారి అర్జీదారుని వద్దకు వెళ్లాలి. ఫిర్యాదుదారు ఇచ్చిన అర్జీని చదివి వినిపించాలి. ఆ తర్వాత ఆ సమస్యను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించాలి. పరిష్కరించిన విధానాన్ని కూడా అర్జీదారునికి చదివి వినిపించాలి. అర్జీదారుడు తన సమస్య పరిష్కారమైనట్టు సంతృప్తి చెందినదీ, లేనిది వీడియోలో చిత్రీకరించాలి. అనంతరం అర్జీదారునితో సంబంధిత అధికారి సెల్ఫీ తీసుకుని దానిని పరిష్కార నివేదికతోపాటు మీ కోసం వెబ్‌పోర్టల్‌లో పొందుపరచాలి. ఒకవేళ ఆ సమస్య ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించడానికి వీలుకాని పక్షంలో ఆ విషయాన్ని అర్జీదారునికి ఎండార్స్మెంట్ ఇచ్చి, దాన్ని వెబ్సైట్లో పొందుపరచాలి. రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలకు సంబంధించిన దరఖాస్తులకు సెల్ఫీతోపాటు వీడియో కూడా కచ్చితంగా అప్లోడ్ చేయాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పేదల ఆస్తులు ఆక్రమిస్తే కఠిన చర్యలు
ఏలూరు సిటీ : నిరుపేదల గృహాలను, స్థలాలనుఆక్రమించుకునే వారిపై సమగ్ర విచారణ చేసి పోలీస్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ కె.భాస్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ’మీ కోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఇటీవల జిల్లాలో పేదలకు చెందిన భూములు, స్థలాలు, ఇళ్లను ఆక్రమించుకుంటున్నారని మీకోసంలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టర్ చెప్పారు. అస్తులను దౌర్జన్యంగా ఆక్రమించుకోవటం క్షమించరాని నేరమని, పేదలను ఆదుకోవాలే తప్ప ఇబ్బందులకు గురిచేయటం సమంజసం కాదన్నారు. పేదల ఆస్తులను ఆక్రమించుకునే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తానని కలెక్టర్ హెచ్చరించారు. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన 70 ఏళ్ల కారుటూరి చంద్రయ్య నడవలేనిస్థితిలో వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తూ తన 3 సెంట్ల స్థలంలోని పెంకుటింటిలో నివాసం ఉంటున్నానని, తనకు ఎవరూలేరని ఒంటరిగా జీవిస్తున్నానని, కొందరు నా ఇంటిలో సామాను బయటకు పారవేసి ఇంటికి తాళాలు వేసి బయటకు పంపారని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ చంద్రయ్యను స్వయంగా తహసీల్దార్ వద్దకు తీసుకువెళ్లాలని సిబ్బందిని ఆదేశించారు. సమగ్ర విచారణ చేసి ఆక్రమితదారులపై చర్యలు తీసుకోవాలని దేవరపల్లి తహసీల్దా«ర్ను ఆదేశించారు. జాలిపూడి, కాట్టంపూడి, మాదేపల్లి గ్రామాలకు చెందిన రైతులు రెడ్డి సూర్యనారాయణ, కె.శ్రీనివాస్, పల్నాటి రామచంద్రరావు కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తూ ఏలూరు నగర మురుగునీరు తప్ప తమ పంటలకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదని, పోణంగి పుంత కాలువకు 4.7, 5.0 కిలోమీటర్ల వద్ద లెవెలింగ్ చేసి తూరలు వేస్తే సుమారు 280 ఎకరాలకు సాగునీరందుతుందని వివరించారు. కలెక్టర్ స్పందిస్తూ నీరుచెట్టు పథకంలో పనులు చేపట్టాలని ఇరిగేషన్ ఎస్ఈని ఆదేశించారు. మరుగుదొడ్లు నిర్మించేందుకు రూ.3 వేలు ఇవ్వాలని లేకుంటే మరుగుదొడ్లు నిర్మించమని బెదిరిస్తున్నారని అత్తిలి మండలం వనుమువారిపాలెంకు చెందిన గరికిపూడి శ్రీధర్, కోడెల్లి కేశవరావు, కె.పాండురంగ ఫిర్యాదు చేశారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సొమ్ములు వసూలు చేస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతానని భాస్కర్ హెచ్చరించారు. విచారణ చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. గణపవరం మండలం కుందేపాడుకు చెందిన గంధం వీరాస్వామి, సంకు బంగారయ్య వినతిపత్రం సమర్పిస్తూ అత్తిలి కాలువ నుంచి మురుగునీరు రావటంతో ప్రజలు తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ పులిపాటి కోటేశ్వరరావు, ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, డీఆర్వో కట్టా హైమావతి, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరావు, డ్వామా పీడీ వెంకట రమణ, హౌసింగ్ పీడీ శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి, సోషల్ వెల్ఫేర్ డీడీ రంగలక్ష్మీదేవి, సర్వే లాండ్ రికార్డ్స్ ఏడీ లాల్ అహ్మద్, ఎల్డీఎం యం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఇతర అధికారులు ఉన్నారు. -
విన్నపాలు వినవలె..
వివిధ సమస్యలపై ‘మీ కోసం’లో కలెక్టర్‌కు అర్జీలు అనంతపురం అర్బన్ : వంద శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువ పత్రం ఇచ్చినా పింఛను మంజూరు చేయలేదని కలెక్టర్ కోన శశిధర్‌కు దివ్యాంగుడు గౌతమ్ తల్లిదండ్రులతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీ కోసంలో గౌతమ్ పరిస్థితిని వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం 48వ డివిజన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో దివ్యాంగుడు గౌతమ్ పరిస్థితిని వారి తల్లిదండ్రులు గురునాథ్‌రెడ్డికి వివరించారు. పింఛన్ కోసం పలుమార్లు అధికారులకు అర్జీ ఇచ్చినా పింఛన్ మంజూరు చేయలేదని చెప్పారు. వారి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే సూచించారు. దీంతో గౌతమ్ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు నిమ్మల నాగరాజు, గోపాల్ మోహన్, కసునూరు శ్రీనివాసులు, చంద్రమోహన్ రెడ్డి, తిరుమలరెడ్డి, రాజునాయక్, గుజ్జల శివయ్యలు కలెక్టర్‌కు పరిస్థితిని వివరించారు. దీంతో పింఛను మంజూరుకు తక్షణం చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారు. న్యాయం చేయండి తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కోన శశిధర్‌కి మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్లు విన్నవించుకున్నారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామక వ్యవహారంలో నిలిపివేసిన జాబితాను పునరుద్ధరించాలని వారు కోరారు. దీంతో డీఎంహెచ్ఓ వెంకటరమణను కలెక్టర్ పిలిపించి మాట్లాడి వివరాలు తీసుకున్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈఎస్ఐ ఆస్పతి నిర్మించాలని వినతి జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించడానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ఈఎస్ఐ కార్పొరేషన్ అంగీకరించిందని కలెక్టర్‌కు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఇందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రి కోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించాలన్నారు. అర్జీ ఇచ్చిన వారిలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర ఉన్నారు. -
జిల్లాకు గుర్తింపు తెచ్చేలా పనిచేద్దాం
చిలకలపూడి(మచిలీపట్నం) : భారతదేశంలో జిల్లాకు గుర్తింపు వచ్చేలా పనిచేయాలని కలెక్టర్ బాబు.ఎ కోరారు. కలెక్టరేట్లో మీ కోసం సోమవారం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మార్చి నెలాఖరు నాటికి జిల్లాకు మంజూరైన 16 వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో ఆయా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి 302 గ్రామాలను ఆత్మగౌరవ గ్రామాలుగా ప్రకటించినట్లు వివరించారు. గ్రామానికి 25 చొప్పున మరుగుదొడ్లు నిర్మిస్తే మరో 300 గ్రామాలు ఆత్మగౌరవ గ్రామాలుగా ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జన్మభూమి- మాఊరులో 90,181 అర్జీలు వచ్చాయని చెప్పారు. వీటిలో ముఖ్యంగా గృహనిర్మాణం, రేషన్‌కార్డులు, ఇళ్లపట్టాలపై అర్జీలు వచ్చాయన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీలో 75 శాతం నగదు రహిత లావాదేవీలు నిర్వహించగా ఐదువేల మందికి ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం అందజేసిందన్నారు. జిల్లాలో సోలార్ పంపుసెట్ల పంపిణీలో దేశంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీన అవార్డు అందుకోనున్నట్లు తెలిపారు. అర్జీలు ఇవే.. – పామర్రు మండలం పెరిసేపల్లి గ్రామానికి చెందిన అక్కినేని లక్ష్మి తనకు చెందిన భూమిని బంధువులు స్వాధీనం చేసుకుని దక్కకుండా చేస్తున్నారని, ఇటీవల పండిన పంట కూడా తమదేనంటూ లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, బంధువుల నుంచి తనకు సంబంధించిన పంటను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. – మచిలీపట్నం పట్టాభి రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రూ. 14 లక్షల విలువైన కాంపోనెంట్స్ యంత్రం గత తొమ్మిది నెలలుగా నిరుపయోగంగా ఉందని ఈ యంత్రం ద్వారా రక్తంలోని ప్లేట్లెట్స్, తెల్లరక్త కణాలు, ఎర్ర రక్త కణాల నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయాయన్నారు. యంత్రాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. -
ప్రజా ఫిర్యాదులపై స్పందించాలి
కడప సెవెన్‌రోడ్స్ : వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు తక్షణమే స్పందించాలని కలెక్టర్ కేవీ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్త కలెక్టరేట్లో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఆయన వినతులు స్వీకరించారు. ప్రతి సోమవారం వందల సంఖ్యలో ప్రజలు మీ కోసం కార్యక్రమానికి వస్తున్నారని పేర్కొన్నారు. మండల స్థాయిలోనే సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాలన్నారు. కిందిస్థాయిలో పరిష్కారం కాని సమస్యలు మాత్రమే కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. సర్వే నెంబరు 1747/10–4లో తనకున్న 39సెంట్ల భూమిని ఆన్లైన్లో నమోదు చేయించాలని వీరబల్లి మండలం గుర్రప్పగారిపల్లెకు చెందిన పద్మావతి కోరారు. – తన భర్త మరణించినందున జీవనం కష్టంగా ఉందని, తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని దువ్వూరు మండలం సింగసింగనిపల్లెకు చెందిన దస్తగిరమ్మ కోరారు. వృద్ధాప్యంతో బాధపడుతున్న తాను ఏ పని చేయలేకున్నానని, జీవనాధారం కోసం పెన్షన్ మంజూరు చేయాలని కడప నగరం సంగంపేటకు చెందిన సరోజమ్మ కోరారు. తనకున్న ఎకరా 68 సెంట్ల పొలానికి ఈ–పాస్ పుస్తకం ఇప్పించాలని ఎర్రగుంట్ల మండలం తిప్పలూరుకు చెందిన మహమ్మద్ రఫీ కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్వేత తెవతీయ, ఇన్‌ఛార్జి జేసీ–2 నాగేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.