ఫిర్యాదుదారుల చెంతకే అధికారులు
Published Fri, Apr 28 2017 1:52 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ‘మీ కోసం’ కార్యక్రమంలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఇకపై అధికారులు ఫిర్యాదుదారుని వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. సమస్యలతో సతమతం అవుతున్న వారు, ప్రభుత్వ సహాయం అర్థించే వారు ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు రావ డం.. వినతిపత్రాలు ఇవ్వడం.. సమస్య పరిష్కారం కాకపోవడంతో పదేపదే అధికారుల చుట్టూ తిరగడం సర్వసాధారణ విషయంగా మారింది. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పలువురు కలెక్టరేట్ వద్దే ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 24న నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుంచి ‘మీ కోసం’లో వచ్చిన అర్జీలను స్వీకరించిన అనంతరం.. వాటిని పరిష్కరించాలి్సన బాధ్యత గల అధికారి అర్జీదారుని వద్దకు వెళ్లాలి. ఫిర్యాదుదారు ఇచ్చిన అర్జీని చదివి వినిపించాలి. ఆ తర్వాత ఆ సమస్యను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించాలి. పరిష్కరించిన విధానాన్ని కూడా అర్జీదారునికి చదివి వినిపించాలి. అర్జీదారుడు తన సమస్య పరిష్కారమైనట్టు సంతృప్తి చెందినదీ, లేనిది వీడియోలో చిత్రీకరించాలి. అనంతరం అర్జీదారునితో సంబంధిత అధికారి సెల్ఫీ తీసుకుని దానిని పరిష్కార నివేదికతోపాటు మీ కోసం వెబ్‌పోర్టల్‌లో పొందుపరచాలి. ఒకవేళ ఆ సమస్య ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించడానికి వీలుకాని పక్షంలో ఆ విషయాన్ని అర్జీదారునికి ఎండార్స్‌మెంట్ ఇచ్చి, దాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలకు సంబంధించిన దరఖాస్తులకు సెల్ఫీతోపాటు వీడియో కూడా కచ్చితంగా అప్‌లోడ్ చేయాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Advertisement