సివిల్ కేసులు కోర్టుల్లో పరిష్కరించుకోండి
సివిల్ కేసులు కోర్టుల్లో పరిష్కరించుకోండి
Published Tue, Jul 11 2017 1:12 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM
ఏలూరు అర్బన్: సివిల్ తగాదాలను కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఫిర్యాదుదారులకు సూచించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ కోసం కార్యక్రమంలో ఎస్పీ రవిప్రకాష్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులకు సంబంధించి సత్వరం విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. చాలా మంది సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోకుండా నేరుగా మీ కోసం కార్యక్రమానికి వస్తున్నారని, అదేవిధంగా పలువురు సివిల్ తగదాలపై ఫిర్యాదు చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. ఇలా చేయడం వల్ల బాధితులు వ్యయప్రయాలకు లోనవుతున్నారని, దీంతో న్యాయం చేయడంలో జాప్యం జరిగే అవకాశముందని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు.
ఎస్పీ దృష్టికి వచ్చిన కొన్ని ఫిర్యాదులు ఇలా..
∙జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులను ఆరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం (ఎస్సీఆర్‌పీఎస్) జిల్లా అధ్యక్షుడు పాము శామ్యూల్ జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ను కోరారు. పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో దళితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంఘ నాయకులు కె.ఆనందరావు, ఉప్పే ధనుంజయరావు తదితరులు ఎస్పీని కలిసిన వారి లో ఉన్నారు.
∙గరగపర్రు గ్రామంలో శాంతిభద్రలను కాపాడాలని, దళితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జిజ్జువరపు జయరాజు వినతిపత్రాన్ని సమర్పించారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ జిల్లాలో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఎస్పీని కలిసిన వారిలో సమితి నాయకులు మాత్రపు లోకేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Advertisement