ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జేసీలు మలికార్జున, రాధాకృష్ణమూర్తి
కాకినాడ రూరల్: ప్రజావాణి–మీకోసం కార్యక్రమంలో స్వీకరించిన ప్రజల దరఖాస్తులు, అర్జీలపై అధికారులు సత్వరమే చర్యలు చేపట్టి పరిష్కరించాలని జేసీ ఎ.మల్లికార్జున ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఆయనతోపాటు జేసీ–2 రాధాకృష్ణమూర్తి ప్రజల నుంచి 278 అర్జీలను స్వీకరించారు. వీటిపై తీసుకున్న చర్యలను అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజన్, మండలాల్లో నిర్వహిస్తున్న మీకోసం అర్జీల పరిష్కారంపై సమీక్ష చేసి జేసీ ఈ ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రలోభాలకు లొంగినా, అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సీతానగరం మండలం వంగలపూడికి చెందిన చెల్లూరి మంగయ్యమ్మ ఎకరం భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసినా చర్యలు తీసుకోలేదన్న అర్జీపై సీతానగరం తహసీల్దార్‌ను విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు.
సామర్లకోట మండలం చింతపల్లి నాగార్జున తన స్థలంలో అంగన్‌వాడీ కేంద్రం నిర్మించి, వేరే స్థలం ఇస్తానని చెప్పారని, ఇప్పుడు స్థలం ఇవ్వకుండా రూ.2 లక్షలు ఇవ్వాలని ప్రెసిడెంట్, గ్రామస్తులు అడుగుతున్నారని ఇచ్చిన అర్జీపై సామర్లకోట తహసీల్దార్ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కాకినాడ అర్బన్‌కు చెందిన పెమ్మాడ సత్యవతి మున్సిపాలిటీలో నాలుగేళ్లుగా కాంట్రాక్టు స్వీపరుగా పని చేస్తుంటే చెప్పకుండా విధుల నుంచి తొలగించారని, వేతనం కూడా ఇవ్వలేదని అర్జీ అందజేసింది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను విచారణ చేసి ఆమెకు పని కల్పించాలని జేసీ ఆదేశించారు. తాళ్లరేవు మండలం పటవల పంచాయతీ శాంతిమూలకు చెందిన పిట్లా అర్జునరావు అందజేసిన అర్జీలో...పోరంబోకు భూమి ఆక్రమణపై తహసీల్దారుకు అర్జీ పెట్టినా పట్టించుకోలేదని వాపోయారు. తాళ్లరేవు తహసీల్దార్ విచారణ చేసి చర్యలు చేపట్టాలని జేసీ ఆదేశించారు.
ఫిర్యాదుల పరిష్కారంపైనివేదిక ఇవ్వాలి
గత వారంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలుపై సమగ్రమైన నివేదిక అందజేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. తీసుకున్న చర్యలు, పెండింగ్‌లో ఉంచడానికి కారణాలు తెలియజేయాలన్నారు. మీకోసం పోర్టల్‌లో తీసుకున్న చర్యలు, పరిష్కరించిన వాటి వివరాల నివేదిక అప్‌లోడ్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీడీ జి.రాజకుమారి, జెడ్పీ సీఈఓ గోవిందరావు, ఎస్‌డబ్ల్యూ డీడీ శోభారాణి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment