అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్. సుబ్బరాజు, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ఆర్‌డీఓలు
అనంతపురం అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే ‘మీకోసం’ కార్యక్రమం ఫిర్యాదుల స్వీకరణకే పరిమి తమవుతోంది. సమస్యలను అర్జీల రూపంలో రాసుకొని కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారానికి నోచుకోలేదని ప్రజలు నిట్టూరుస్తున్నారు. తమ గోడు కాగితాలకే పరిమితమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ‘మీ కోసం’లో గ్రామీణ ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న సమస్యలే ఇందుకు నిదర్శనం. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ఆర్‌డీఓలు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 405 అర్జీలు అందాయి.
కొన్ని సమస్యలు ఇలా...
♦ తన తండ్రి పేరున ఉన్న సర్వే నంబరు 599–2లో 4.90 ఎకరాల భూమిని వేరొకరి పేరున (చింతల బయమ్మ, చింతల మల్లన్న) మార్చారని ధర్మవరం మండలానికి చెందిన రియాజ్ ఖాన్ ఫిర్యాదు చేశాడు.దాన్ని రద్దు చేసి తమ పేరున ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని కోరారు.
♦ వృద్ధాప్య పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యామ్‌కు చెందిన కమలమ్మ ఆవేదన చెందుతోంది. తన గోడును కలెక్టర్‌కు చెప్పుకుందామని వచ్చినట్లు తెలిపింది.
♦ తన భర్త వదిలేసి 20 ఏళ్ల అయ్యిందని, కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కూమార్తె పెళ్లి చేశానని, ప్రస్తుతం కష్టం చేయలేని స్థితిలో ఉన్నానని తనకల్లు మండలం బొంతలపల్లికి చెందిన ఎన్.నాగలక్ష్మి విన్నవించింది.
♦ ఖరీఫ్‌లో వర్షాభావంతో జొన్న పంట దెబ్బతినిందని పరిగి మండలం మోద గ్రామానికి చెందిన ఎం.చంద్రశేఖర్ విన్నవించుకున్నాడు.
♦ తన భర్త గంగరాజు అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా పనిచేశాడని, కంపెనీ చేసిన మోసానికి మానసిక ఒత్తిడికి గురై ఈ ఏడాది ఫిబ్రవరి 9న గుండెపోటుకు గురై మరణించాడని ఉరవకొండ మండలం పాతపేటకు చెందిన వడ్డే ఉష తెలిపింది. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయించాలని కోరింది.
♦ తన భర్త వెంకటేశ్ 2016 అక్టోబరు 7న మరణించాడని, ఆ తరువాత నుంచి కుటుంబం గడవడం కష్టంగా మారిందని బుక్కరాయసముద్రం మండలం విజయనగర్ కాలనీకి చెందిన ఎం.భవాని విన్నవించింది.
♦ తన పేరున ఏఓటీపీ 0754 నంబరుపై వృద్ధాప్య పింఛను వస్తున్నా నెలనెలా డబ్బులు ఇవ్వడంలేదని అనంతపురం రూరల్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దాసరి జయలక్ష్మి విన్నవించింది.
Comments
Please login to add a commentAdd a comment