విన్నపాలు వినవలే..! | People Sharing Their Sorrowa To Collector In Meekosam Prakasam | Sakshi
Sakshi News home page

విన్నపాలు వినవలే..!

Published Tue, Jun 12 2018 12:44 PM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM

People Sharing Their Sorrowa To Collector In Meekosam Prakasam - Sakshi

మీకోసంలో కలెక్టర్‌కు సమస్యలు చెప్పుకునేందుకు వేచి ఉన్న ప్రజలు

ఒంగోలు అర్బన్‌: ప్రకాశం భవన్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో కలెక్టర్‌ వి. వినయ్‌చంద్‌ సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చి వినతిపత్రాలు అందచేశారు. పింఛన్లు, పొలాలకు సంబంధించిన సమస్యలు, ఇళ్లు కావాలంటూ ప్రజలు తమ వినతి పత్రాల్లో పేర్కొన్నారు. కలెక్టర్‌తో పాటు అదనపు సంయుక్త కలెక్టర్‌ డి.మార్కండేయులు, రెవెన్యూ డివిజనల్‌ అధికారి శ్రీనివాసరావు, డీటీడబ్ల్యూఓ రాజ్యలక్ష్మిలు బాధితుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలు మీకోసం కార్యక్రమానికి వచ్చి వినతిపత్రాలు అందజేస్తారని, వాటి పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం లేకుండా సత్వరమే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్‌ ఆదేశించారు.

మర్రిపూడి మండలం జువ్విగుంటకు చెందిన వైష్ణవి డ్వాక్రా గ్రూపులో రుణమాఫీ కాలేదని ధనలక్ష్మి అనే మహిళ వినతిపత్రం అందజేసింది. తక్షణమే రుణమాఫీ వర్తింపజేయాలని ఆమె కోరింది.
సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన అనంతవరపు చిన్న ఏసు తనకు 67 ఏళ్లు ఉన్నా వృద్ధాప్య ఫింఛన్‌ మంజూరు కాలేదని, దయచేసి మంజూరు చేయాలంటూ వేడుకున్నాడు.
సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామానికి చెందిన మాదాల కోటయ్య తనకు సర్వే నంబర్‌ 851లో 1.77 సెంట్ల భూమి ఉందని, ఆ భూమిని వేరే వ్యక్తికి వీఆర్‌ఓ డబ్బులు తీసుకుని ఆన్‌లైన్‌ చేసాడని ఫిర్యాదు చేశాడు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు.
దొనకొండ మండలం కలివలపల్లె గ్రామానికి చెందిన చిన్నం సోనమ్మ తాను కూలిపని చేస్తూ జీవిస్తున్నానని, ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నానని కలెక్టర్‌కు తెలిపింది. తనకు పక్కా ఇల్లుళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.
యద్దనపూడి మండలం చింతపల్లిపాడుకు చెందిన ఐ.యానాది తన కుమార్తె మరియమ్మకు నూరుశాతం వికలత్వం ఉందని, వికలాంగ పింఛన్‌ ఇప్పించాలని కోరాడు.
బేస్తవారిపేట మండలం బండుట్ల గ్రామానికి చెందిన జి.నెమలిగుండం తనకు పూర్తి చెవుడు ఉండి వినికిడి పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నాని, వాటిని మంజూరు చేయించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు.

ఒంగోలు నగర పాలక సంస్థలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకం, వాహనాల వినియోగంపై అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు నాగరాజు మీకోసంలో కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి కైలాస్‌ గిరీశ్వర్, ఏపీఎస్‌పీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ సుబ్బరాజు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement