సాక్షి, ఒంగోలు : వలంటీర్లు గ్రామ స్వరాజ్యానికి పట్టుగొమ్మల వంటి వారని, వారి ద్వారా క్షేత్రస్థాయిలో పాలన సులువుగా మారిందని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పేర్కొన్నారు. ఈ వ్యవస్థతో ప్రజలకు సత్వర సేవలు అందించే అవకాశం లభించిందన్నారు. ‘రైతు భరోసా’ ప్రక్రియలో ఎదురైన సమస్యలను రెండు రోజుల్లోపే పరిష్కరించ గలగడం దీనివల్లే సాధ్యపడిందన్నారు. ప్రకాశం జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు పది ప్రత్యేక కార్యక్రమాలకు తాము రూపకల్పన చేస్తున్నామన్నారు.
ప్ర: వలంటీర్ల వ్యవస్థ ఎలా ఉపయోగపడుతుంది?
కలెక్టర్: ఈనెల 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు అనేక సమస్యలు వెల్లువెత్తాయి. వాటన్నింటిని పరిష్కరించాలంటే ఫీల్డులో పని చేసేవారు కావాలి. దీంతో వలంటీర్లను రంగంలోకి దించాం. వారందరికి మొబైల్‌కే అప్లికేషన్ ఇవ్వడంతో కేవలం ఒకటిన్నర రోజులోనే వాటన్నింటిని పూర్తిచేశారు. వాస్తవానికి గ్రామ వలంటీర్ల వ్యవస్థ అందుబాటులో లేకపోతే ఇది అసాధ్యంగా ఉండేది. వలంటీర్లవల్ల ప్రభుత్వ కార్యక్రమాలు సత్వరమే ప్రజల ముంగిటకు తీసుకువెళ్లగలుగుతున్నామనేది వందశాతం వాస్తవం.
ప్ర: రైతు భరోసా పథకంలో ఎంతమందికి లబ్ది చేకూరుతుంది
కలెక్టర్: రైతు భరోసా పథకం కింద ఇప్పటికే దాదాపు 4 లక్షల మందిని అర్హులుగా గుర్తించాం. ఇంకా కొంతమంది ప్రజాసాధికార సర్వేలో లేనివారు కూడా ఉన్నారు. వారికి అర్హత కల్పించేందుకు ప్రజాసాధికార సర్వేచేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం. అయితే ప్రజాసాధికార సర్వేతోపాటు వారు వెబ్‌ల్యాండ్‌లో కూడా నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా చుక్కల భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. గతంలో వీటికి సంబంధించి కొంత పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు.
అందువల్ల వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం. అయితే తాము, గ్రామస్థాయిలో వాలంటీర్లు చూపుతున్న చొరవ వల్ల మరో 10వేల మంది లబ్దిదారులు పెరుగుతారని భావిస్తున్నాం. అయినా భూములు తమపైన లేనివారు, భూమి యజమాని చనిపోయినా వాటిని తమ పేరు మీదకు మార్చుకోని కుటుంబాలవారు ఇలాంటి చిన్న చిన్న అంశాలు తప్ప అత్యధికంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. రైతు భరోసా స్కీములో లబ్దిదారులను గుర్తించడంలో ప్రకాశం ప్రథమ స్థానంలో ఉంది.
ప్ర: సచివాలయ భవనాల పరిస్థితి
కలెక్టర్: గ్రామ సచివాలయాలకు ప్రస్తుతం జిల్లాలో 1038 పంచాయతీలకుగాను 1038 పంచాయతీ కార్యదర్శులు అందుబాటులోకి వచ్చారు. ప్రస్తుతం ఉన్న భవనంకు అదనంగా గదులు నిర్మించడం లేదా అంతస్తు నిర్మించడం కోసం దాదాపు 180 వరకు గుర్తించాం. వీటికి రు25లక్షలు కేటాయిస్తున్నాం. అయితే ప్రతి గ్రామ సచివాలయ భవనం 2వేల చదరపు అడుగులలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇక నూతనంగా నిర్మించేవాటికి మాత్రం రు40లక్షలు కేటాయిస్తున్నాం. ఇందుకు రూ.350కోట్లు సిద్ధంగా ఉన్నాయి.
ప్ర: వలంటీర్లను ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు?
కలెక్టర్: వలంటీర్లు పెద్ద ఎత్తున జిల్లాలో విధులు నిర్వర్తించేందుకు వచ్చారు. వీరంతా చాలా మంచి నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. వీరందరి సేవలను సద్వినియోగం చేసుకునేందుకు సచివాలయ స్థాయిలో పంచాయతీ కార్యదర్శితో వీరికి సమన్వయం చేయబోతున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కనెక్టివిటీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే విధంగా పంచాయతీ నుంచి మండల స్థాయికి కూడా కనెక్టివిటీని తీసుకురావడం ద్వారా వేగవంతంగా ఫలితాన్ని పొందేందుకు, ప్రజలకు సేవలు అందించొచ్చు.
ప్ర: ఇసుక సమస్య గురించి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు?
కలెక్టర్: పాలేరు–బిట్రగుంటకు సంబంధించిన ఇసుకను ఒంగోలు, కందుకూరు, పొదిలి, కనిగిరి ప్రాంతాలలో నాలుగు స్టాక్ యార్డులకు తరలించడం ద్వారా ఇసుక సమస్యకు పరిష్కారం చేయదలిచాం. అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు టీములను కూడా ఆదివారమే పంపిస్తున్నాం. వారు వారితో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపడం ద్వారా ఇసుక సమస్యకు అతి త్వరలోనే ఫుల్‌స్టాప్ పడనుంది. గిద్దలూరుకు ఇసుక సమస్యను నివారించేందుకు ఏంచేయాలనే దానిపై ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నాం. అక్రమంగా ఇసుక తవ్వకాలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. పట్టా భూముల్లో ఇసుకను సైతం మైనింగ్‌శాఖ ద్వారా తవ్వకాలు జరిపి సంబంధిత సమీప ప్రాంతాల ప్రజలకు అప్పగించేందుకు ప్లాన్ చేస్తున్నాం.
ప్ర: ఒంగోలు వైద్యశాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపడతున్నారు
కలెక్టర్: ఒంగోలు ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే ఆసుపత్రి ఆవరణలో అనధికారికంగా ఆక్రమించుకున్న షాపులను ఖాళీచేయించాం. వాటిని వేలం వేయడం ద్వారా ఆసుపత్రి అభివృద్ధి నిధిని పెంచుకుంటాం. అంతేకాకుండా దిగువ అంతస్తులో ఉన్న రక్షిత మంచినీటిని ప్రతి అంతస్తులోను పొందేందుకే వీలుగా చర్యలు చేపట్టాలని నిర్ణయించాం. అంతే కాకుండా ఏరియా వైద్యశాలలకు సైతం ఎక్స్‌రే మిషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈమేరకు ఇటీవలే డీసీహెచ్‌ఎస్‌కు లేఖ కూడా పంపాం.
Comments
Please login to add a commentAdd a comment