కలెక్టర్ పోల భాస్కర్
సాక్షి, ఒంగోలు అర్బన్: ‘వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్’ పథకం కింద జిల్లాలో పెండింగ్, తిరస్కరణకు గురైన దరఖాస్తులపై త్వరితగతిన విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రకాశం భవనంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ వ్యవసాయ, మార్కెట్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1.35 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయన్నారు. మరో 1.6 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 61253 దరకాస్తులు ఆధార్ అనుసంధానంలో పొరపాట్లు జరిగాయని చెప్పారు. రైతు కుంటుంబాల్లో భార్య లేదా భర్త మృతి చెందితే వారి వారసులకు కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం ద్వారా లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక సమస్యల వల్ల లక్షలాది మంది రైతులకు రైతు భరోసా అందలేదని ప్రభుత్వం గుర్తించిందన్నారు.
అందుకే నవంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ గడుబు పొడగించినట్లు తెలిపారు. అధికారులు చిత్తశుద్ధితో పూర్తి స్థాయిలో విచారణ చేయాలన్నారు. ప్రజాసాధికారిక సర్వేలో లేని రైతు కుంటుంబాలను తక్షణమే నమోదు చేయాలన్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయాలని అందుకోసం ఆర్‌టిజిఎస్ ద్వారా తహశీల్దర్లు, ఎంపిడిఓలు, వ్యవసాయ శాఖ అధికారులు, ఈఓఆర్‌డిలు, ఉప తహశీల్దార్లుకు లాగిన్‌లు నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాకు ఆర్‌టిజిఎస్ కో ఆర్డినేటర్‌ను ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు.
శనగ పంటకు రాయితీ..
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు శనగపంట రాయితీ రైతులకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఇప్పటివరకు కోల్డ్ స్టోరేజ్‌ల్లో నిల్వ ఉన్న శనగల వివరాలు సమగ్రంగా పరిశీలించాలన్నారు. 6896 మంది రైతులను అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. 17247 మంది దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందన్నారు. ఈ క్రాఫ్ట్, కోల్డ్ స్టోరేజ్‌ల్లో నిల్వ చేసిన రైతు వివరాలు, బ్యాంకు ఖాతాలు పోల్చి చూడాలన్నారు. 75 వేల క్వింటాళ్లు జెజె11రకం, కాక్–2 రకం శనగ విత్తనాలు 50 శాతం రాయితీపై రైతులకు పంపిణి చేసేందుకు సిద్ధగా ఉన్నట్లు తెలిపారు. కిలో 31రూపాయల చొప్పున నాణ్యమైన విత్తనాలు పంపిణి చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 49 మండలాల్లో 65 కేంద్రాలు గుర్తించామని వాటిద్వారా పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తం కావాలన్నారు.
నవంబర్ 15వ తేది లోపు ఈ క్రాప్ జీపీఎస్ ద్వారా పంటల వారీగా రైతుల వివరాలు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు రైతు ప్రకాశం కార్యక్రమాన్ని త్వరలో చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా రైతుల్లో మానసిక ధైర్యం కల్పించడం, రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయడం, మార్కెట్ సౌకర్యం కల్పించడం వంటి నూతన వ్యవస్థకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. అందుకోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తున్నట్లు వివరించారు. సంక్రాంతి నాటికి రైతు ఉత్పత్తి సంఘాల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన పంటలు జిల్లాలోని 26 మార్కెట్ యార్డుల్లో విక్రయించుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
జాయింట్ కలెక్టర్ షన్మోహన్ మాట్లాడుతూ గ్రామ సభలు పూర్తి అయిన వెంటనే రైతుల నుంచి అందే దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ లబ్ది చేకూరాలన్నారు. శనగ విత్తనాలు అక్రమ అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ–2 నరేంద్రప్రసాద్, డీఆర్‌ఓ వెంకట సుబ్బయ్య, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ఆర్‌డీఓలు ప్రభాకర్‌రెడ్డి, ఓబులేష్, శేషిరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామమూర్తి, మార్కెంటింగ్ శాఖ ఏడీ ఉపేంద్రతో పాటు జిల్లా అధికారులు, తహశీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment