ఇండస్ట్రియల్‌ హబ్‌గా దొనకొండ | Donakonda Will Become Industrial Hub | Sakshi
Sakshi News home page

కల నిజమాయెగా..

Published Tue, Aug 6 2019 9:58 AM | Last Updated on Tue, Aug 6 2019 9:59 AM

Donakonda Will Become Industrial Hub - Sakshi

దొనకొండలో మ్యాప్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్, జేసీ

సాక్షి, దొనకొండ: జిల్లా వాసులను ఊరిస్తున్న ఇండస్ట్రియల్‌ హబ్‌ కల నెరవేరనుంది. ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ను పిలిచి వివరాలు సేకరించిన సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి సమాచారంతో మరోసారి రావాలంటూ ఆదేశించినట్లు సమాచారం. జిల్లాలోని దొనకొండ, కురిచేడు మండలాల్లో సుమారు 25 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటుకు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇక్కడ ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలు చేయడం మినహా ఒక్క అడుకూడా ముందుకు వేయని పరిస్థితి.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలల కూడా గడవక ముందే జిల్లాలో ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు అయితే పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందడంతోపాటు జిల్లా రూపు రేఖలే మారిపోతాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పరిశ్రమలు నిర్మించేందుకు అణువైన రోడ్డు, రైలు మార్గాలు, సాగు, తాగునీటి ప్రాజెక్ట్‌లకు ఎంత దూరంలో ఉంది, విద్యుత్‌ సౌకర్యం, భౌగోళిక స్వరూపం వంటì  పూర్తి వివరాలు సేకరించేందుకు జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ సోమవారం సాయంత్రం దొనకొండ, కుర్చేడు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి వివరాలు సేకరించారు.

నిరుద్యోగులకు వరం..
పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా సీఎం వైఎస్‌ జగన్‌ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అనుకున్న ప్రకారం దొనకొండలో ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు జరిగితే యువతకు ఉద్యోగాలకు కొదువే ఉండదు. నిరుద్యోగ సమస్య దాదాపుగా తగ్గిపోతుందనే చెప్పవచ్చు.

కలెక్టర్‌ పరిశీలన..
కలెక్టర్‌ పోలా భాస్కర్‌ సోమవారం సాయంత్రం దొనకొండ మండలంలో విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన రుద్రసముద్రం, రాగమక్కపల్లి, భూమనపల్లి, కొచ్చెర్లకోట, పోచమక్కపల్లి, ఇండ్లచెరువు, బాదాపురం రెవెన్యూ గ్రామాల్లోని భూములు పరిశీలించారు. లైసెన్స్‌ సర్వేయర్‌ సీహెచ్‌ వెంకట్రావు హబ్‌కు సంబంధించిన ప్రాంతంలోని మ్యాపు గురించి వివరించారు. ఏపీఐఐసీ వారికి సుమారు 25 వేల ఎకరాలు రెవెన్యూ వారు తయారు చేయటం జరిగిందన్నారు. 2490 ఎకరాలు ఏపీఐఐసీ వారికి అప్పగించారు. అందులో టైటాన్‌ ఏవియేషన్‌ విమానాల విడిభాగాల పరికరాల కేంద్రానికి 6 వేల ఎకరాలు, కార్ల సామాగ్రి శక్తి సామర్థ్యం కేంద్రానికి 2300 ఎకరాలు, ప్రైడ్‌ ప్రాజెక్టు గృహ నిర్మాణాలు, ఇంటర్నల్‌ వస్తు విభాగాల నిర్మాణ సంస్థకు 5 వేల ఎకరాలు, విదేశీయులు చూసి వెళ్లటం జరిగిందన్నారు. మండల విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, విద్యుత్, రవాణా గురించి కలెక్టర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

దొనకొండ నుంచి మార్కాపురానికి రూట్, వాటి మధ్య దూరం, దొనకొండ 6 వే రోడ్డు, కర్నూలు, గుంటూరు, కనిగిరి జంక్షన్‌ ఎన్ని కిమీ ఉంటుందనే వివరాలు మ్యాపు ద్వారా తెలుసుకున్నారు. మండల పరిధిలో రైల్వే ట్రాకులు ఎంత విస్తీర్ణంలో వెళ్తుంది. ట్రాకు వెలుపల, బయట ఉన్న గ్రామాలు గురించి క్షుణ్ణంగా అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దొనకొండ రావటం జరిగిందని, ఎప్పుడైనా ప్రభుత్వం హబ్‌ గురించి అడిగితే తాము చెప్పటానికి ఈ ప్రాంతాన్ని పరిశీలించామని తెలిపారు. ఆయన వెంట జేసీ ఎస్‌.షన్మోహన్, ఏపీఐఐసీ జనరల్‌ మేనేజర్‌ నరసింహారావు, సర్వేయర్‌ అసిస్టెండ్‌ డైరెక్టర్‌ జయరాజు, తహసీల్దార్‌ పాలడుగు మరియమ్మ, సర్వేయరు కె.దర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement