పేదల ఆస్తులు ఆక్రమిస్తే కఠిన చర్యలు
పేదల ఆస్తులు ఆక్రమిస్తే కఠిన చర్యలు
Published Mon, Mar 20 2017 9:51 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు సిటీ : నిరుపేదల గృహాలను, స్థలాలనుఆక్రమించుకునే వారిపై సమగ్ర విచారణ చేసి పోలీస్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ కె.భాస్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ’మీ కోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఇటీవల జిల్లాలో పేదలకు చెందిన భూములు, స్థలాలు, ఇళ్లను ఆక్రమించుకుంటున్నారని మీకోసంలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టర్ చెప్పారు. అస్తులను దౌర్జన్యంగా ఆక్రమించుకోవటం క్షమించరాని నేరమని, పేదలను ఆదుకోవాలే తప్ప ఇబ్బందులకు గురిచేయటం సమంజసం కాదన్నారు. పేదల ఆస్తులను ఆక్రమించుకునే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తానని కలెక్టర్ హెచ్చరించారు. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన 70 ఏళ్ల కారుటూరి చంద్రయ్య నడవలేనిస్థితిలో వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తూ తన 3 సెంట్ల స్థలంలోని పెంకుటింటిలో నివాసం ఉంటున్నానని, తనకు ఎవరూలేరని ఒంటరిగా జీవిస్తున్నానని, కొందరు నా ఇంటిలో సామాను బయటకు పారవేసి ఇంటికి తాళాలు వేసి బయటకు పంపారని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ చంద్రయ్యను స్వయంగా తహసీల్దార్ వద్దకు తీసుకువెళ్లాలని సిబ్బందిని ఆదేశించారు. సమగ్ర విచారణ చేసి ఆక్రమితదారులపై చర్యలు తీసుకోవాలని దేవరపల్లి తహసీల్దా«ర్‌ను ఆదేశించారు. జాలిపూడి, కాట్టంపూడి, మాదేపల్లి గ్రామాలకు చెందిన రైతులు రెడ్డి సూర్యనారాయణ, కె.శ్రీనివాస్, పల్నాటి రామచంద్రరావు కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తూ ఏలూరు నగర మురుగునీరు తప్ప తమ పంటలకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదని, పోణంగి పుంత కాలువకు 4.7, 5.0 కిలోమీటర్ల వద్ద లెవెలింగ్ చేసి తూరలు వేస్తే సుమారు 280 ఎకరాలకు సాగునీరందుతుందని వివరించారు. కలెక్టర్ స్పందిస్తూ నీరుచెట్టు పథకంలో పనులు చేపట్టాలని ఇరిగేషన్ ఎస్‌ఈని ఆదేశించారు. మరుగుదొడ్లు నిర్మించేందుకు రూ.3 వేలు ఇవ్వాలని లేకుంటే మరుగుదొడ్లు నిర్మించమని బెదిరిస్తున్నారని అత్తిలి మండలం వనుమువారిపాలెంకు చెందిన గరికిపూడి శ్రీధర్, కోడెల్లి కేశవరావు, కె.పాండురంగ ఫిర్యాదు చేశారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సొమ్ములు వసూలు చేస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతానని భాస్కర్ హెచ్చరించారు. విచారణ చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈని ఆదేశించారు. గణపవరం మండలం కుందేపాడుకు చెందిన గంధం వీరాస్వామి, సంకు బంగారయ్య వినతిపత్రం సమర్పిస్తూ అత్తిలి కాలువ నుంచి మురుగునీరు రావటంతో ప్రజలు తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ పులిపాటి కోటేశ్వరరావు, ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, డీఆర్‌వో కట్టా హైమావతి, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, డ్వామా పీడీ వెంకట రమణ, హౌసింగ్ పీడీ శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి, సోషల్ వెల్ఫేర్ డీడీ రంగలక్ష్మీదేవి, సర్వే లాండ్ రికార్డ్స్ ఏడీ లాల్ అహ్మద్, ఎల్డీఎం యం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఇతర అధికారులు ఉన్నారు.
Advertisement