ఆర్డీఓ కు తన గోడు విన్నవిస్తున్న నరసయ్య
తెనాలి: ఆదరించకపోగా, చిత్రహింసలకు గురిచేస్తున్న కుమారుల అమానుషానికి ఓ వృద్ధ జంట భయంతో వణికిపోతోంది. ఉన్న ఇంటిని విక్రయించాలంటూ కొడుతున్న కుమారుల రెండురోజుల క్రితం పారిపోయిన ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. సోమవారం తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ‘మీ కోసం’ సమావేశంలోనూ ఆర్డీఓ జి.నరసింహులుకు తన గోడు విన్నవించారు. తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన 64 ఏళ్ల మర్రిపూడి నరసయ్య గతంలో సంగం డెయిరీలో బుల్ అటెండెంట్‌గా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. దేవతా విగ్రహాల తయారీలో కూలీగా ఒకరు, మరొకరు కాంట్రాక్టరుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ కష్టార్జితంతో 74 సెంట్ల స్థలంలో కొంత మేర ఇల్లు నిర్మించుకున్నాడు. 2006లో కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం కుమారులను సంప్రదించగా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి, వచ్చే డబ్బుతో చెల్లి పెళ్లి చేయాలని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లే నరసయ్య తన కుమార్తె పెళ్లి చేశారు.
ఉద్యోగవిరమణతో వచ్చిన డబ్బు ఖర్చయ్యాక కొడుకుల నైజం బయటపడింది. అప్పటికే పెళ్లిళ్లయిన ఇద్దరు కొడుకులు ఆ ఇంట్లోనే వేరు వంట ఆరంభించారు. చేసేదిలేక నరసయ్య దంపతులు కూడా వేరుగా వంట చేసుకుంటున్నారు. కొద్దిరోజులకు ఇంటిపైన రేకుల షెడ్డు వేసుకుని అందులోకి వెళ్లిపోయారు. ఇల్లు అమ్మి డబ్బు పంచాలంటూ కొడుకులు చేయిచేసుకొంటున్నారు. వృద్ధ దంపతులు నెలనెలా వచ్చే రూ.1000 పింఛన్ ఖర్చులకుచాలక కుమార్తెకు తెలిసినవాళ్ల దగ్గర అప్పులు తీసుకున్నారు. ఇందుకుగాను ఇల్లు అగ్రిమెంటు రాసి, ఆమె పేరిట తనఖా రిజిస్టరు చేశారు. అప్పట్నుంచి కొడుకులు మరింతగా వేధింపులు ప్రారంభించారు. పెద్ద కొడుకు నరసయ్య ఇంట్లో, రెండో కుమారుడు తెనాలిలో నెలకు రూ.4 వేల అద్దె ఇస్తూ నివసిస్తున్నారు. వారిద్దరూ తల్లిదండ్రులను పట్టించుకోలేదు. నరసయ్య భార్యకు ఆరోగ్యం బాగోలేక చిక్కిశల్యమైంది. బయటకు రాలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలోనూ వారిని ఆదుకోగా ఇంటి విషయమై తరచూ గొడవలు పెట్టుకోవటం కొడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. కొడుకులను పిలిపించిన పోలీసులు, ఎవరో పెద్దమనిషి ఫోను చేయటంతో కేవలం హెచ్చరికలతో సరిపెట్టి పంపించేశారు. రెండురోజుల క్రితం రెండో కొడుకు, ఇతర బంధువర్గం ఉండగానే పెద్దకొడుకు నరసయ్యపై దాడిచేశాడు. భయంతో పోలీసులను ఆశ్రయించిన నరసయ్య తిరిగి ఇంటికి వెళ్లలేకపోయాడు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసి తనను రక్షించాలని కోరారు. తన ఇంటినుంచి బిడ్డలను ఖాళీచేయిస్తే వేరొకరికి అద్దెకు ఇచ్చి, కొంతయినా బాకీలు తీర్చుకుంటామని వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment