విన్నపాలు వినవలె..
విన్నపాలు వినవలె..
Published Tue, Jan 17 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
వివిధ సమస్యలపై ‘మీ కోసం’లో కలెక్టర్‌కు అర్జీలు
అనంతపురం అర్బన్ : వంద శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువ పత్రం ఇచ్చినా పింఛను మంజూరు చేయలేదని కలెక్టర్ కోన శశిధర్‌కు దివ్యాంగుడు గౌతమ్ తల్లిదండ్రులతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీ కోసంలో గౌతమ్ పరిస్థితిని వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం 48వ డివిజన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో దివ్యాంగుడు గౌతమ్ పరిస్థితిని వారి తల్లిదండ్రులు గురునాథ్‌రెడ్డికి వివరించారు. పింఛన్ కోసం పలుమార్లు అధికారులకు అర్జీ ఇచ్చినా పింఛన్ మంజూరు చేయలేదని చెప్పారు. వారి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే సూచించారు. దీంతో గౌతమ్ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు నిమ్మల నాగరాజు, గోపాల్ మోహన్, కసునూరు శ్రీనివాసులు, చంద్రమోహన్ రెడ్డి, తిరుమలరెడ్డి, రాజునాయక్, గుజ్జల శివయ్యలు కలెక్టర్‌కు పరిస్థితిని వివరించారు. దీంతో పింఛను మంజూరుకు తక్షణం చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారు.
న్యాయం చేయండి
తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కోన శశిధర్‌కి మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్లు విన్నవించుకున్నారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామక వ్యవహారంలో నిలిపివేసిన జాబితాను పునరుద్ధరించాలని వారు కోరారు. దీంతో డీఎంహెచ్‌ఓ వెంకటరమణను కలెక్టర్ పిలిపించి మాట్లాడి వివరాలు తీసుకున్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు.
ఈఎస్‌ఐ ఆస్పతి నిర్మించాలని వినతి
జిల్లాలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించడానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ఈఎస్‌ఐ కార్పొరేషన్ అంగీకరించిందని కలెక్టర్‌కు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఇందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రి కోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించాలన్నారు. అర్జీ ఇచ్చిన వారిలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర ఉన్నారు.
Advertisement