ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తుపానుగా మారి మరింత బలపడనుంది. ఈ తుపానుకు హెలెన్‌గా నామకరణం చేశారు. హెలెన్ ప్రభావంతో 21, 22, 23 తేదీల్లో జిల్లాలోని కోస్తా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే 25 సెంటీమీటర్లకు పైగా కుండపోత వర్షం పడే అవకాశం ఉన్నట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రకాశం, విశాఖ జిల్లాల మధ్య తుపాను తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అదే విధంగా బుధవారం అర్ధరాత్రి నుంచి గంటకు 55-75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. అదే విధంగా సముద్రంలో అలలు 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తుతో ఎగిసిపడొచ్చు.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈ మూడు రోజులూ జాలర్లు సముద్రంపై వేటకు వెళ్లడాన్ని అధికార యంత్రాంగం పూర్తిగా నిషేధించింది. తుపాను సహాయక చర్యలకు టోల్ ఫ్రీ 1077 నంబరును ఏర్పాటు చేశారు.
స్పెషలాఫీసర్లతో కలెక్టర్ సమావేశం..
తుపాను ప్రభావం జిల్లాలోని కోస్తా తీర ప్రాంతాలపై అధికంగా ఉండనుండటంతో 11 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ మండలాల పరిధిలోని 28 గ్రామాల ప్రజలను 21వ తేదీ మధ్యాహ్నం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్సు హాలులో బుధవారం సాయంత్రం తీర ప్రాంత ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం నుంచే తీరప్రాంత ప్రజలను, అదే విధంగా ముంపునకు గురయ్యే అవకాశాలున్న కాలనీలను ఖాళీ చేసి తక్షణమే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు.
వీటితో పాటు పునరావాస కేంద్రాలను వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ ప్రజల అవసరాాల మేరకు ఆహారాన్ని, మంచినీటిని, కొన్ని మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల్లో మంచినీరు, ఆహారాన్ని ప్రభుత్వ వైద్యాధికారులు పరీక్షించిన తర్వాత మాత్రమే ప్రజలకు పంపిణీ చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాను సమీక్షించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈని ఆదేశించారు. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తే విద్యుత్ సరఫరా నిలిపి వేయాలన్నారు. ఒక వేళ విద్యుత్ లైన్లు దెబ్బతిన్న చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు.
రంగంలోకి జాతీయ విపత్తుల నివారణ సంస్థ..
జాతీయ విపత్తుల నివారణ సంస్థ అసిస్టెంట్ కమాండెంట్ కిషన్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం కోస్తా తీర ప్రాంతంలో ప్రజలు, అధికారులకు అందుబాటులో ఉంటారు. ఇతర సమాచారం కోసం సెల్ నం: 94409 98620లో సంప్రదించవచ్చు.
ప్రత్యేకాధికారిగా కృష్ణబాబు
తుపానుకు సంబంధించిన జిల్లా ప్రత్యేకాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంటీ కృష్ణబాబును ప్రభుత్వం నియమించింది. ఆయన గురువారం మధ్యాహ్నంకల్లా ఒంగోలు నగరానికి రానున్నారు.