భయపెడుతున్న హెల్‌న్!
Published Fri, Nov 22 2013 3:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
విజయనగరం వ్యవసాయం/ కలెక్టరేట్, న్యూస్‌లైన్: హెలెన్ తుఫాన్ జిల్లాలో రైతులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. వారిని తీవ్రంగా భయపెడుతోంది. వరుసగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. మొదట వర్షాభావం.. మొన్న పై-లీన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆ తరువాత కురిసిన భారీ వర్షాలు పూర్తిగా ముంచేశాయి. వాటి నుంచి తేరుకుని మిగిలి న పంటను కోసి ఇంటికి తరలించే సమయంలో ఏర్పడిన మరో తుఫాన్ ముంచుకొస్తుండడంతో రైతులు తీవ్రంగా భీతిల్లుతున్నారు. పండిన కొద్దిపాటి గింజలు కూడా దక్కకపోతే తాము ఎలా బతకాలని వారు ఆందోళన చెందుతున్నారు. తమను కాపాడాలంటూ భవంతుడిని వేడుకుంటున్నారు. ఈ తుఫాన్ ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 200 కిలో మీటర్లదూరంలో ఉంది. దీని ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి.
గురువారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. మరో 24 గంటల వరకూ దీని ప్రభావం ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 35 హెక్టార్లలో వరికోతలు పూర్తయ్యాయి. పొలాల్లో ఉంచిన వరిపైరును సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఉరుకులు పరుగులు పెడతున్నారు. ఎస్.కోట, తెర్లాం, బలిజిపేట, నెల్లిమర్ల, పార్వతీపురం డివిజన్‌లో పలు చోట్ల గురువారం జల్లులు కురిసి, పొలాల్లోకి నీరి చేరింది. పంట మరో నాలుగైదు రోజుల్లో చేతికి వస్తుందనుకుంటున్న సమయంలో హెలెన్ తుఫాన్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. మరి కొంతమంది నాలుగు, ఐదు రోజుల్లో కోతలు ప్రారంభించాలని భావించినా తుఫాన్ కారణంగా వాయిదా వేసుకున్నారు. మరో ఒకటి రెండు రోజులు వర్షం కురిస్తే వేలాది ఎకరాల్లో పంట నీటిపాలయ్యే ప్రమాదం ఉంది. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టుడుతున్నారు.
ఆది నుంచి కష్టాలే:
ఈ ఏడాది రైతులకు ఆది నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి. నాట్లు వేయడం దగ్గర నుంచి పంట చేతికి వచ్చేవరకు అన్నీ కష్టాలే. వర్షాభా వ పరిస్థితుల కారణంగా నాట్లు వేయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. జూలై, ఆగస్టు నెలల్లో వరుణుడు కరుణించని కారణంగా సెప్టెంబర్ నెలాఖరు వరకు నాట్లు వేయని పరి స్థితి ఏర్పడింది. కనీసం తిండి గింజలయినా దొరుకుతాయన్న ఆశతో రైతులు నాట్లు వేశారు. వర్షాలు ఆలస్యంగా పడడం వల్ల పూర్తి స్థాయి లో నాట్లు వేయలేదు. లక్షా 24 వేల హెక్టార్లలో ఖరీఫ్ సీజన్‌లో నాట్లు వేయవలసి ఉండగా 96 వేలు హెక్టార్లలో మాత్రమే వేశారు. 28 వేల హెక్టార్లు వరకు సాగవలేదు. నాట్లు వేసిన తరువాత కూడా వరుణుడు ముఖం చాటేయడంతో చాలా వరకు ఎండిపోయాయి. ఈ పరిస్థితుల నుంచి తేరుకోకముందే గత నెలలో భారీ వర్షా ల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిం ది. ఈ నష్టాన్ని అధికారులు ఇంకా పూర్తి స్థాయి లో అంచనా వేయనేలేదు. జిల్లా వ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, చెరుకు, పెసర, మినుము, చోడి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం నుంచి తేరుకోకముందే మళ్లీ హెలెన్ రూపంలో తుఫాన్ భయపెడుతోంది. హెలెన్ తుఫాన్ కొనసాగితే తీవ్ర స్థాయిలో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
తగ్గిన ఉష్ణోగ్రతలు....
తుఫాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీనికి తోడు చల్లగాలులు వేగంగా వీస్తుండడంతో ప్రజలంతా చలికి వణికిపోతున్నారు. గాలులు కొనసాగితే వృద్ధులు, చంటిపిల్లలు అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రోడ్లపై రాకపోకలు సైతం తగ్గిపోయాయి.
అప్రమత్తంగా ఉండాలి
హెలెన్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కోతలు కోయరాదని వ్యవసాయశాఖ జాయింట్ డైరక్టర్ లీలావతి రైతులకు సూచించారు. తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
Advertisement
Advertisement