ముంచుకొస్తున్న ‘హెలన్’
Published Thu, Nov 21 2013 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
తుపాను తాకిడి నుంచి రాష్ర్టం తప్పించుకుందని సంతోష పడుతుండగానే మరోవైపు నుంచి ‘హెలన్’ భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను గురువారం సాయంత్రం చెన్నై- ఒంగోలు (ఆంధ్రప్రదేశ్) మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైన నెల న్నర రోజుల్లో భయపెడుతున్న రెండో తుపాను ఇది. నైరుతీ రుతపవానాల సమయం(ఆగస్టు, సెప్టెంబరు)లో పైలీన్ తుపాను ప్రజలను కల్లోలపరిచింది. ఆ తరువాత అక్టోబరులో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యూయి. అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. వారం రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి భారీవర్షాలు కురిసినా పెద్దగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. దాదాపు ప్రశాంతంగానే నాగపట్నం వద్ద ఈనెల 15వ తేదీన తీరం దాటేసింది. తుపాను సహాయక చర్యలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న రాష్ట్ర యంత్రాంగం హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకుంది.
ఇంతలోనే ‘హెలన్’
బంగాళాఖాతంలో ఈనెల 18వ తేదీన ఏర్పడిన అల్పపీడనం 19వ తేదీ ఉదయూనికి బలమైన ద్రోణిగా రూపాంతరం చెంది సాయంత్రానికి తుపానుగా మారింది. తుపాను తీవ్రతను బట్టి వారంరోజుల క్రితం నాటి తుపానుకు పెట్టదలుచుకున్న హెలన్ పేరును తాజా తుపానుకు పెట్టారు. బుధవారం నాటి సమాచారం ప్రకారం చెన్నైకి ఈశాన్యంలో 400 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను గురువారం రాత్రి కి చెన్నై- ఒంగోలు మధ్య తీరం దాటవచ్చని భావిస్తున్నారు. దీని ప్రభావంతో చెన్నై, తిరువళ్లూరు, తిరునెల్వేలీ, తూత్తుకూడి, కన్యాకుమారి, దిండిగల్లు, మధురై, తేనీ, శివగంగై,
విరుదునగర్ కాంచీపురంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఎన్నూరు, చెన్నై హార్బర్లలో తుపాను హెచ్చరిక సూచిక నెంబర్1 ను ఎగురవేశారు. రాష్ట్రంలోని జాలర్లను చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని ఆదేశించారు. కారైక్కాల్, పుదుచ్చేరి, పాంబన్, తూత్తుకూడి, నాగపట్నంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేశారు. ఈ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంచనాకు తగినట్లుగా అదే తీవ్రతతో తుపాను తీరం దాటినట్లైతే గురువారం ఒక్కరోజే 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర యంత్రాంగం యథావిధిగా తుపాను ప్రభావిత జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది.
Advertisement
Advertisement