
'హెలెన్' తుఫానుగా మారిన వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. దీనికి 'హెలెన్' అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. బుధవారం సాయంత్రానికి ఇది తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
తుఫాను ప్రభావం వల్ల బుధవారం రాత్రి నుంచి వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, గురువారం సాయంత్రానికి ఇది కావలి - ఒంగోలు మధ్య ఏదైనా ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను రాగల 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది వాయవ్య దిశగా పయనించి, తర్వాత నైరుతి దిశకు మళ్లుతుందని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పరిసరాల్లో కావలి సమీపంలో గురువారం రాత్రి తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది.
దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడుతుందని, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అవి 75 కిలోమీటర్ల వరకు కూడా వెళ్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి తీరప్రాంతాల్లో కనిపిస్తుంది. తీరాన్ని దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని తెలిపింది.