నడిసంద్రంలో..
Published Fri, Nov 22 2013 2:57 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
సూర్యారావుపేట (కాకినాడ రూరల్), న్యూస్‌లైన్ :కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట నుంచి వేటకు వెళ్లిన బోటు సముద్రంలో చిక్కుకోవడంతో మత్స్యకార కుటుంబాలు ఆందోళనలో కొట్టుమిట్టాడాయి. సోమవారం ఉదయం సూర్యారావుపేట నుంచి ఏడుగురి సభ్యులతో వేటకు బయలుదేరిన బోటు హెలెన్ తుపానులో చిక్కుకుంది. మెత్తని వల వేట కావడంతో మూడురోజుల్లో అంటే బుధవారం సాయంత్రానికే తిరిగి రావాలి, అయితే బుధవారం నాటికే తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. వేటకు వెళ్లిన మిగతావారందరూ తిరిగి వచ్చినా, ఒక బోటుతో సహా ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. రాత్రి 12 గంటల వరకు పనిచేసిన ఫోన్లు ఆ తరువాత ఆగిపోవడంతో తమవారి సమాచారం తెలియడంలేదని ఆయా కుటుంబాల వారు ఆందోళన చెందారు.
బాధితులు మెరైన్, సీ పోర్టు అధికారులకు సమాచారం తెలిపారు. అమలాపురంలో ఫిర్యాదు చేయాలని సీపోర్ట్ అధికారులు చెప్పారని, చిన్న బోటు మాత్రమే ఉండడంతో తుపానులో సముద్రంలోకి వెళ్లడం కుదరదని మెరైన్ అధికారులు చెప్పారని మత్స్యకారులు వాపోయారు. కాగా సర్పంచ్ యజ్జల బాబ్జీ, గ్రామ కార్యదర్శి ఎస్‌వీవీ శ్రీనివాసరావు జిల్లా అధికారులతో చర్చిం చారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు ఓడలరేవు సమీపంలోని రిలయన్స్ రిగ్ వద్ద మత్స్యకారులతో కనిపించిన ఒక బోట్‌ను తొలుత సూర్యారావుపేట బోట్‌గా మెరైన్ సిబ్బంది భావించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే వీరు అద్దరిపేట మత్స్యకారులని తేలింది.
ఏడుగురు ఇంకా ప్రమాదంలోనే...
ఓడలరేవు(అల్లవరం) : సూర్యారావు పేటకు చెందిన ఏడుగురు మత్సకారులు బోటు ఇంజన్ చెడిపోవటంతో తీరానికి చేరుకోలేక, రక్షించేవారు లేక అగచాట్లు పడుతున్నా రు. రెండు రోజులుగా వీరు తమవారికి ఫోన్‌లో వారు సమాచారం అందిస్తూ వచ్చారు. దూడా తాతారావుకు చెందిన ఫైబర్ బోట్‌లో తిక్కాడ అప్పారావు, కొండబాబు, సత్తిబాబు,దూడా జగన్నాథం, అప్పన్న, ఎరుపల్లి సామేలు, కర్రి చిన్నలు 18న సముద్రంలో వేటకు వెళ్లారు. తుపాను పట్టిందని బోటు ఓనర్ తాతారావు సమాచారం ఇవ్వటంతో తీరానికి బుధవారం బయలుదేరారు. భైరవపాలెం రిలయన్స్ రిగ్గుల వద్దకు వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంటకు బోటు ఇంజన్ చెడిపోయి వారు సముద్రంలో చిక్కుకున్నారు.
లంగరు వేసి బోట్‌ను నిలిపి తాతారావుకు సమాచారం ఇచ్చారు. ఈదురు గాలులు, సముద్రపు ఉధృతికి బోట్ కొట్టుకు పోతున్నదంటూ సెల్ ఫోన్ ద్వారా సందేశాలు పంపుతూనే ఉన్నారు. బోటును కదలకుండా ఆపేందుకు రూ. 50 వేల వలను సముద్రంలో వేసినప్పటికీ ఫలించలేదు. వల తెగిపోయి, లంగరు ఇనుప రాడ్లు విరిగిపోవటంతో బోటు ఓడలరేవు వైపు కదులుతూ ఉందని తీరానికి సమాచారం అందించారు. బోటు బోల్తాపడుతుందని, తమను రక్షించాలని వారు వేడుకున్నారు. బోటు ఓనర్ తాతారావు కోస్టల్ సెక్యూరిటీ, కోస్టుగార్డు, కలెక్టర్, మత్స్యశాఖ అధికారులకు ఈవిషయం బుధవారమే తెలిపారు.
తగిన బోట్‌లు లేవని అధికారులు చెప్పడం తగ దని దీనిపై తాతారావు ఆవేదన వ్యక్తం చేశారు. కోస్టల్ సెక్యూరిటీ, కోస్టుగార్డు, నావీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాగా గురువారం సాయంత్రం నుంచి రెండు రెస్క్యూ టీమ్‌లు ఈ మత్స్యకారుల కోసం గాలిస్తున్నా యి. ఇదిలా ఉండగా ఓడలరేవు సమీపంలో సముద్రంలో చుక్కాని విరిగిపోయి నిలిచిన మరో బోటులోని ఆరుగురిని కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు రక్షించారు. గురువారం మరో బోటు పంపి వీరిని రప్పించారు. ఉప్పాడ కొత్తపల్లి మైనాబాద్‌కు చెందిన దూల జోతిబాబు, సొది పులుసు, జెల్లా యాదవయ్య, చెక్కా కాశియ్య, నక్కా రాజు, కుచ్చి సూరిబాబు సురక్షితంగా ఓడలరేవు తీరానికి చేరిన వారిలో ఉన్నారు.
Advertisement