
తుఫాను దెబ్బకు తూర్పుగోదావరి అతలాకుతలం
హెలెన్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఉప్పాడ కొత్తపల్లి వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. రోడ్డు మొత్తం కోతకు గురైంది. కాకినాడ-ఉప్పాడ మధ్య నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న రాక్ వే మొత్తం ధ్వంసమైంది. అలలు తీవ్రంగా ఎగసిపడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో రోడ్డు మొత్తం కొట్టుకుపోయి రాళ్లు మాత్రమే మిగిలాయి. పది నుంచి పన్నెండు మీటర్ల ఎత్తు మేర అలలు ఎగసిపడుతున్నాయి.
కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో ఆరుగురు మరణించారు. అమలాపురం రూరల్ వన్నెచింతలపూడిలో ఒకరు, ఉప్పలగుప్తం మండలం వాడపర్రులో ఒకరు, కాట్రేనికోన మండలంలో ఇద్దరు, ఐ.పోలవరం మండలం కొత్త మురముళ్లలో ఒకరు, కొత్తపేట మండలం గంటి చినపేటలో ఒకరు చొప్పున మరణించారు. గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు వంద కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. చెట్ల, గుడిసెలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలకు అపార నష్టం వాటిల్లింది.
అంతర్వేది వరకు ఉన్న తీరప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. 13 మండలాల పరిధిలో ఉన్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఆగిపోయారు. కాకినాడ హార్బర్ నుంచి ఐదు బోట్లలో వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. దాదాపు 20 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ద్వారా గాలిద్దామనుకున్నా, వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో కోస్ట్గార్డ్ బృందాలు మాత్రమే గాలిస్తున్నాయి. లక్షన్నర హెక్టార్లలో వరి కోత దశలో ఉంది. మరికొన్ని చోట్ల చేలు కోతలు కోసి ఆరబెట్టుకున్నారు. ఈ పంటలన్నీ హెలెన్ తుఫాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు సర్వనాశనం అయిపోయాయని రైతులు అంటున్నారు.