స్తంభించిన జనజీవనం | Cyclone Hudhud: Heavy rains disrupt normal life in AP | Sakshi
Sakshi News home page

స్తంభించిన జనజీవనం

Published Mon, Oct 13 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

స్తంభించిన జనజీవనం

స్తంభించిన జనజీవనం

 సాక్షి, రాజమండ్రి :హుదూద్ తుపాను ప్రభావంతో జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఈదురుగాలులు, ఎడతేరిపి లేని వర్షంతో జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. తెల్లవారు జామునే వర్షం ప్రారంభం కాగా, పది గంటల ప్రాంతం నుంచి ఈదురు గాలులు మొదలయ్యాయి. తుపాను తీరం దాటే సమయానికి మధ్యాహ్నం 12.00 గంటల ప్రాంతం నుంచి గంటకు సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీర ప్రాంతంలో 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుని, కాకినాడ రూరల్ నియోజక వర్గాల పరిధిలోని సముద్రతీరంలో గాలుల వేగం 80 కిలోమీటర్లు దాటింది.
 
 కొత్తపేట, కాకినాడ రూరల్, తొండంగి, ఏలేశ్వరం, కె.గంగవరం, కాజులూరు, రామచంద్రపురం పిఠాపురం, జగ్గంపేట, ముమ్మిడివరం, కడియం, రాజమండ్రి రూరల్, రాజానగరం, మండపేట పరిసర ప్రాంతాల్లో పంట దశలో ఉన్న వరిచేలు నేలకు ఒరిగాయి. ఆలమూరు మండలం సంధిపూడిలో రోడ్డుపై చెట్టు కూలి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది.  ఏలేశ్వరం, కె.గంగవరం ప్రాంతాలతో పాటు కోనసీమలో అక్కడక్కడా అరటి తోటలు నేలకు ఒరిగాయి.  ముమ్మిడివరం, కొత్తపేట పరిసరాల్లో కొబ్బరి తోటలకు పాక్షికంగా నష్టం వాటిల్లింది.  శంఖవరం మండలంలో సర్వేతోటలు నేలకూలాయి. అమలాపురం సహా కోనసీమలోని, పలు ప్రాంతల్లోను. ఏజెన్సీలోను తుఫాను తీవ్రత పెద్దగా కనిపించలేదు.  ఈదురుగాలులతో జల్లులు పడ్డాయి. రాజవొమ్మంగి మండలంలో ఎక్కువగావర్షం కురిసింది.   
 
 నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
 ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంత గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలుపు చేశారు. అక్కడక్కడా కరెంటు స్తంభాలు నేలకు ఒరిగాయి. ఆదివారం సాయంత్రానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో సుమారు 70 విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు కుప్పకూలాయి.  ఒక్క సూర్యారావుపేట ప్రాంతంలోనే 12 కరెంటు స్తంభాలు, మూడు ట్రాన్ఫ్‌ఫార్మర్లు కూలి పోయాయి. చాలా చోట్ల చెట్టుకొమ్మలు కరెంటు స్తంభాలపై విరిగి పడి నష్టాన్ని తెచ్చిపెట్టాయి. కాజులూరు, అండ్రంగి, ఓదూరు పరిసర ప్రాంతాల్లో చెట్టుకొమ్మలు విరిగిపడి విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఒకటి రెండు చోట్ల మినహా జిల్లా వ్యాప్తంగా విద్యుత్తు అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్తు సరఫరా నిలుపు చేశారు.
 
 విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నాం
 జిల్లాలో విద్యుత్తు అంతరాయాలు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్టు ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ గంగాధర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం ముందు జాగ్రత్త చర్యగా సరఫరా నిలుపు చేశామన్నారు. గాలులు భారీగా ఉన్న చోట్ల మినహా మిగిలిన చోట్ల ఆదివారం రాత్రి విద్యుత్తు సరఫరా పునరుద్ధరించామని పేర్కొన్నారు. కాకినాడలో ఈదురుగాలుల ప్రభావం తీవ్రం గా ఉండడంతో రాత్రి వరకూ విద్యుత్‌సరఫరా ఇవ్వలేకపోయామన్నారు. ఎక్కడ బ్రేక్‌ైడౌన్ అయినా తాను స్వయంగా హాజరై చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాయంత్రం వరకూ భారీ గాలులు కొనసాగడం వల్ల ఎన్ని చెట్ల నష్టం జరిగింది. ఎన్ని స్థంభాలు నేలకూలాయి అనే అంశాలపై ఇంకా ఒక అంచనాకు రావాల్సి ఉందన్నారు. కాగా రాత్రి ఏడున్నర నుంచి వర్షం తగ్గినా గాలుల తీవ్రత పెరగడంతో విద్యుత్తు అధికారులకు పునరుద్దరణచర్యలకు ఆటంకం ఏర్పడింది. ఉదయం నుంచి జిల్లాలోని సుమారు 500 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచి పోయింది.
 
 వైజాగ్‌లో సహాయక చర్యలకు  200 మంది
 ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) : హుదూద్ తుపానుతో అతలాకుతలమైన విశాఖపట్నంలో సహాయక చర్యలు చేపట్టేందుకు రాజమండ్రి నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బంది బయలుదేరి వెళ్లారు. ఉన్నతాధికారులు 300 మందిని పంపించాలని ఆదేశించగా 200 మందిని పంపారు.
 13,14 తేదీల్లో జన్మభూమి రద్దు
 కాకినాడ సిటీ : హుదూద్ తుపాను కారణంగా సోమ, మంగళవారాల్లో నిర్వహించే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ నీతూప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జన్మభూమి కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామన్నారు.
 
 ‘అల’కల్లోలం
 తొండంగి : హుదూద్ ప్రభావంతో ఆదివారం తొండంగి మండలం ఈదురగాలులతో కురిసిన వర్షంతో అల్లకల్లోలమైంది. కొత్తచోడిపల్లిపేట తీరంలో 30 మీటర్ల మేరకు సముద్రం ముందుకు వచ్చింది. నాలుగు మీటర్ల మేర సముద్రం కోతకుగురైంది. మత్స్యకారులు వలలు భద్రపరుచుకున్న గుడిశెలు పైకప్పులు ఎగిరిపోయాయి. చోడిపల్లిపేటలో మత్స్యకారులను ఎస్సై రవికుమార్, ఇతర పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది పునరావాసకేంద్రాలకు తరలించారు.  ముసలయ్యపేటలో మూడు ఇళ్లు దెబ్బతిన్నాయి. దానవాయిపేటలో పాక్షికంగా మరో ఇల్లు దెబ్బతిందని రెవెన్యూఅధికారులు తెలిపారు.
 
 కూలిన వృక్షాలు
 చోడిపల్లిపేట నుంచి ఒంటిమామిడి వెళ్లే బీచ్‌రోడ్డులో మూడు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. పెరుమాళ్లపురం నుంచి తలపంటిపేట బీచ్‌రోడ్డులో విద్యుత్‌వైర్లు తెగిపడటంతో  రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా గోపాలపట్నం నుంచి తొండంగి వె ళ్లే రహదారిలో రైల్వేగేటుకుసమీపంలోనూ, ఎ.కొత్తపల్లి, శృంగవృక్షం గ్రామాల సమీపంలోనూ, కోదాడ పంచాయతీ కార్యాలయం వద్ద, జీడిపిక్కల ఫ్యాక్టరీ వద్ద, ఎరబంద మలుపు వద్ద చెట్లు పడిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
 
 తెరుచుకోని రైల్వేగేట్లు
 తుపాను కారణంగా రావికంపాడు, చిన్నాయిపాలెం, గోపాలపట్నం రైల్వేగేట్లు తెరవలేదు. దీంతో పునరావాసకేంద్రాల వద్ద ఉన్న ప్రజలకు, అధికారులకు మధ్యాహ్న భోజనం తరలింపులో ఇబ్బందులు ఎదురయ్యాయి.
 
 కొనసాగుతున్న పునరావాస కేంద్రాలు
 తీరప్రాంత గ్రామాల్లో అధికారులు ఏర్పాటు చేసిన 10 పునరావాసకేంద్రాలను ఆదివారం కొనసాగించారు. సుమారు రెండు వేలమందికిపైగా ప్రజలను కేంద్రాల వద్దకు తరలించారు. ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు, ప్రత్యేకాధికారి మధుసూదనరావు, ఎంపీడీవో సీహెచ్‌కేవిశ్వనాథరెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణలు దానవాయిపేట, ఎల్లయ్యపేట, వేమవరం, అద్దరిపేట, ఆవులమంద, లక్ష్మణుడుపేట, హుకుంపేట, చోడిపల్లిపేటల్లోని పునరావాసకేంద్రాలను పరిశీలించారు. 40 మంది ఎన్డీఆర్‌ఎఫ్ బృందం,220 మంది వరకూ పోలీసులు, 200మంది వివిధ శాఖల అధికారులు వీఆర్వోలు, వీఆర్‌ఏలు, సెక్రటరీలు, ఆర్‌డబ్ల్యూయస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వైద్యారోగ్యశాఖ సిబ్బంది, స్ధానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పునరావాసకేంద్రాల వద్ద సేవలందించారు.
 
  కొనసాగుతున్న కంట్రోల్ రూం
 తొండంగిలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం కొనసాగుతోంది. తుపాను ప్రత్యేకాధికారి చక్రవర్తి తహశీల్దార్ కార్యాలయం ఉండి అధికారులను పని తీరును సమీక్షించారు. సోమవారం కూడా కంట్రోల్ రూం కొనసాగుతుందన్నారు. ప్రజలు 08854 248825, 08854248108కు గానీ ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement