చైనా, సింగపూర్ బృందాల పర్యటనతో రైతుల్లో ఆందోళన
భూములు తీసుకుంటామంటున్న ఉన్నతాధికారులు
భూపరిరక్షణ పోరాట సమితి ఆందోళనలు
సీఆర్డీఏ అధికారుల పరిశీలనతో మరింత గందరగోళం
మచిలీపట్నం : సర్కారు భూదందాపై సర్వత్రా ఆందోళన నెలకొంది. మచిలీపట్నంలో పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 30 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 30న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 14,427 ఎకరాల ప్రైవేటు భూమి, మరో 15 వేల ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. భూమినే నమ్ముకుని జీవిస్తున్న రైతులు భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దుచేయాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు. పరిశ్రమలకు భూములివ్వాలని కోరుతూ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కోన, బుద్దాలపాలెం, చిన్నాపురం గ్రామాల్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన తర్వాతే మళ్లీ గ్రామాల్లో పర్యటిస్తామని మంత్రి, ఎంపీ హామీ ఇచ్చి నెల రోజులు గడిచినా భూసేకరణ నోటిఫికేషన్ రద్దు కాలేదు. కాగా సింగపూర్ బృందం రెండు నెలల కిందట పోర్టు, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటుచేసే ప్రాంతంలోని భూములను పరిశీలించి వెళ్లింది. తాజాగా గురువారం రాత్రి సీఆర్డీఏ అధికారులు చైనా బృందంతో కలిసి గుట్టుచప్పుడు కాకుండా తపసిపూడి గ్రామానికి వచ్చి పోర్టు, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటుచేసే భూములు, వాటికి సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించి వెళ్లడం రైతుల్లో మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అధికారులు భూసేకరణ ప్రక్రియను గుట్టుచప్పుడు కాకుండా కానిస్తున్నారా అనే ప్రశ్నలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.
4,889 అభ్యంతరాలు
ఆగస్టు 30వ తేదీన ప్రభుత్వం జారీచేసిన భూసేకరణ నోటిఫికేషన్‌పై రైతులకు ఏమైనా అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా తెలియజేసేందుకు వెసులుబాటు ఇచ్చారు. ఆర్డీవో కార్యాలయంలో గత నెల 28వ తేదీ వరకు 4,889 అభ్యంతరాలు రైతుల నుంచి వచ్చాయి. వీటిని తహశీల్దార్లతో పరిశీలన చేయిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. భూసేకరణ నోటిఫికేషన్ ఏడాది పాటు అమలులో ఉంటుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి భూములు సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం పోర్టు కాకుండా అనుబంధ పరిశ్రమలను ఏర్పాటుచేస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు.. ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు.. స్థాపించే పరిశ్రమలకు అనుమతులున్నాయా, లేదా వంటి అంశాలను వెల్లడించడం లేదు. సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్, చైనా దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపన పేరుతో భూములను అప్పగించే పని ప్రభుత్వం చేపడితే న్యాయపరంగానైనా ఎదుర్కొంటామని రైతులు అంటున్నారు. అందుకు అనుగుణంగా వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
భూపరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు
భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచే వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూపరిరక్షణ పోరాట సమితిని ఏర్పాటుచేసి గ్రామగ్రామాన ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజులుగా మీఇంటికి - మీభూమి కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్నారు. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టాలంటూ భూపరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆయా పార్టీల నాయకులు రెవెన్యూ అధికారులను అడ్డుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు మచిలీపట్నం ప్రాంతాన్ని సందర్శించి రైతుల తరఫున పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించైనా భూములను సేకరించకుండా అడ్డుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా అధికారులు గుట్టుచప్పుడు కాకుండా భూసేకరణ వ్యవహారాన్ని నడుపుతున్నారనే ఆందోళన రైతులను వెంటాడుతోంది.
సర్కారు భూదందా గుట్టుగా..
Published Sat, Nov 7 2015 1:50 AM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM
Advertisement
Advertisement