
పరిటాల కాలనీ పేరుతో దందా!
అనంతపురం రూరల్ : టీడీపీ మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కాలనీ పేరుతో కొందరు భూ దందాకు తెరదీశారు...ఇళ్ల స్థలాలు, వాటికి పట్టాలు ఇప్పిస్తాం... ప్రభుత్వం మాదేనంటూ అమాయకుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. పేదలను అడ్డంగా మోసగించారు. అధికార పార్టీ పేరుతో అరాచకాలు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే... కక్కలపల్లిలో సుమారు ఐదు ఎకరాలు వంక పోరంబోకు స్థలాన్ని ఓ ఐదుగురు వ్యక్తులు అధికార పార్టీ అండంతో ఆక్రమించారు.
ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి, వారికి కేటారుుంచారు. ఇలా సుమారు 150 నుంచి 200 మంది బండలు పాతి వారపాకలా ఆ స్థలంలో వేసుకున్నారు. ఐదు నెలల నుంచి ఈ దందా నడుస్తున్నా పట్టించుకోని రెవెన్యూ విభాగం సోమవారం పోలీసు బందోబస్తుతో రంగంలోకి దిగింది. అక్కడి గుడిసెలను పొక్లెరుున్‌తో తొలగించింది. మొదట్లో అక్కడ నివాసముండే ప్రజలు అడ్డుకున్నా...తహశీల్దార్ షేక్ మహబూబ్‌బాషా, రూరల్ సీఐ కృష్ణమోహన్ ప్రభుత్వ స్థలంలో ఇళ్లు వేయడం చట్టరీత్యా నేరమని చెప్పడంతో శాంతించారు. చివరకు పోలీసులు 200 పాకలను తొలగించారు. తహశీల్దార్‌తో పాటు ఆర్‌ఐ రవిశంకర్‌రెడ్డి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు పాల్గొన్నారు.
నమ్మకద్రోహమే
కక్కలపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు వేయించి, అధికార పార్టీ పేరుతో నమ్మకద్రోహం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో పదుల సంఖ్యలో రూరల్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితులు నరసింహులు, బండల మనోహర్, మహబూబ్ బాషా, నాగరాజు తదితరలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్కొక్కరు రూ.20 వేల వరకు ఖర్చు చేసి వారపాకలు వేసుకున్నామని తెలిపారు.
ప్రభుత్వ స్థలం కాదని, మంత్రికి చెప్పి పని చేయించుకుందామని భరోసా ఇచ్చారన్నారు. తీరా ఇవాళ పాకలు తొలగించడం బాధగా ఉందని బోరున విలపించారు. తమ వద్ద స్థలం ఇచ్చినందుకు కొంత ఎమౌంట్ తీసుకున్నారని ఆరోపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో కుళ్లాయప్ప, నసీర్, మనోహర్, ఫరీదా బేగం, వీ రామకృష్ణ, వై రాధాకృష్ణ, బీ ఫణికుమార్, సుశీలమ్మ, జబీనా, భాను, మాబున్ని, బాబయ్య తదితరులున్నారు.
నిందితులను వదిలే ప్రసక్తి లేదు :
నిందితులను వదిలే ప్రసక్తే లేదని సీఐ కృష్ణమోహన్ ‘సాక్షి’కి తెలిపారు. తహశీల్దార్ నుంచి తమకు సూచనలందితే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూముల్లో దొంగగా ఇళ్లు వేసుకోవడం సరైన పద్ధతికాదని తెలిపారు. ఇక నుంచైనా ఆ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. బాధితుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారని ఆరోపణలు నిజమైతే కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.