ఆ బస్సుల రూటే సెపరేటు!
శ్రీకాకుళం: దసరా రద్దీని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు సొమ్ము చేసుకుంటున్న తీరు దారుణంగా ఉంది. ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నా రవాణా శాఖ అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదు. పండుగల సీజనులో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుందన్నది తెలి సిందే. ఆర్టీసీ, రైల్వే శాఖలు ఎన్ని అదనపు సర్వీసులు నడుపుతున్నా ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు ప్రయాణికుల ముక్కుపిండి కాసుల పంట పండించుకుంటున్నాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
ఏ రోజు ఏ రేటు వసూలు చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. దసరా సెలవుల సందర్భంగా బస్సులకు తీవ్ర గిరాకీ ఉండడంతో గత పది రోజులుగా కొన్ని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు డిమాండ్‌ను బట్టి ఏ రోజుకు ఆ రోజు రేటు నిర్ణయించి వసూలు చే స్తున్నాయి. సాధారణంగా శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు గానీ, హైదరాబాద్ నుంచి శ్రీకాకుళానికి గానీ ఏసీ బస్సుకు రూ.900, నాన్ ఏసీకి రూ.600 రేటు వసూలు చేస్తుంటారు. దసరా రద్దీ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్, విజయవాడలకు సాధారణ రేటుపై రూ. 50 నుంచి 100 వరకు అదనంగా వసూలు చేస్తుండగా..
అటునుంచి అంటే హైదరాబాద్, విజయవాడల నుంచి శ్రీకాకుళం వచ్చే బస్సులకు వసూలు చేస్తున్న రేటు మాత్రం బెదరగొడుతోంది. హైదరాబాద్ నుంచి ఏసీ బస్సుకు 2,500 నుంచి రూ. 3 వేల వరకు ఒక్కొక్కరికీ వసూలు చేస్తుండగా, నాన్ ఏసీ బస్సుకు రూ. 1200 నుంచి 1500 వరకు వసూలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు వేల సంఖ్యలో హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో విద్య, ఉద్యోగం వంటి వ్యాపకాల్లో స్థిరపడ్డారు. వారంతా పండుగకు స్వగ్రామాలకు రావడం సహజం. దాంతో అటువైపు నుంచి ఉండే డిమాండ్‌ను దాదాపు మూడింతలు రేటు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. అధిక రేట్లు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న అధికారులు దీన్ని పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యాలు ఈ రేట్లను ఆన్‌లైన్‌లో ప్రకటించి మరీ బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
యథేచ్ఛగా సరుకు రవాణా
ఇక ప్రైవేట్ బస్సుల్లో సరుకులను రవాణా చేస్తే కఠినచర్యలు తీసుకోవాలన్న నిబంధన ఉంది. అయితే ప్రతిరోజూ ఈ బస్సుల ద్వారా సుమారు రూ. 15లక్షల విలువైన వస్తువులు జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటువంటి సరుకుల్లో 60 నుంచి 70 శాతానికి బిల్లులే లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. తమకు మామూళ్లు ముడుతుండటంతో అధికారులు ప్రభుత్వ ఆదాయం పోతున్నా పట్టించుకోవడం లేదు.
అనుమతి లేని రూట్లలో..
రూట్ పర్మిట్‌లో నిర్దేశించిన మార్గంలోనే ప్రైవేట్ బస్సులు ప్రయాణించాల్సి ఉంది. అయితే జిల్లాలో ప్రైవేట్ బస్సులు అనుమతి రూట్లలో పయనిస్తున్నాయి. ఉదాహరణకు శ్రీకాకుళం ఆస్పత్రి జంక్షన్‌లో బయలు దేరే బస్సులు కొత్తరోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంది. అయితే దాదాపు ఈ బస్సులు డేఅండ్‌నైట్ జంక్షన్ మీదుగా పయనిస్తుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అలాగే ఓ రోజు విశాఖపట్నం వెళ్లకుండా ఆనందపురం, పెందుర్తి మీదుగా వెళ్తుంటే.. మరో రోజు విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి గాజువాక మీదుగా వెళుతూ.. తమ అవసరాన్ని బట్టి మార్గాన్ని మార్చేసుకుంటున్నాయి.
పరిమిట్లు లేకుండానే..
దసరా కావడంతో ప్రైవేటు బస్సులకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరా చేసుకొని కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు పర్మిట్ ఉన్న బస్సుల ముసుగులో పర్మిట్లు లేని బస్సులను తిప్పుతున్నాయి. ఈ విధంగా కూడా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఇటువంటి బస్సులు ప్రమాదాలకు గురైనప్పుడు మాత్రమే రవాణా, పోలీసు, ఇతర శాఖలు హడావుడి చేస్తుంటాయి. మిగతా సమయాల్లో ప్రైవేటు బస్సు యాజమాన్యాలకు కొమ్ముకాస్తుండడంతో అక్రమాలకు పాల్పడుతున్న వారి ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది.