విజయనగరం గంటస్తంభం: చౌకధరల దుకాణం డీలర్ పోస్టుల భర్తీలో అక్రమాలకు తెరలేచింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులకు కట్టబెట్టేందుకు అధికారపార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించి ఏ డిపోకు ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై ఇప్పటికే జాబితాలు సిద్ధమైనట్లు బహిరంగంగా చర్చ జరుగుతోంది. వీటికే అధికారులు ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోందని సమాచారం. మరోవైపు ఈపోస్టులు కట్టబెట్టేందుకు డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ప్రతిభను కాదని...
పోస్టు ఏదైనా ప్రతిభను పక్కన పెట్టి తమ అనుయాయులకు కట్టబెట్టడంలో టీడీపీ నేతలకు మించిన వారు లేరు. ఇప్పటికే నాలుగేళ్లుగా అవుట్ సోర్సింగ్ పోస్టుల్లో తమ వారిని నియమించారన్నది అందరికీ తెలిసిందే. మెరిట్ ఉన్నా, అన్ని అర్హతలు ఉన్నా నష్టపోయి ఆందోళన చేసిన సంఘటనలు జిల్లాలో కోకొల్లలు. తాజాగా తెలుగు తమ్ముళ్ల కన్ను డీలర్ పోస్టుల భర్తీపై పడింది. విజయనగరం డివిజన్‌లో 95 రేషన్‌డిపో డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేయడంతో వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. ఇందులో ఆరింటికి అభ్యర్థులు ఎవరూ దరఖాస్తు చేయకపోవడంతో మిగతా పోస్టుల్లో మాత్రం తమవారిని నియమించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే రాత పరీక్ష ముగియడం, ఈ నెల 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూలు జరగనుండడంతో.. అందులో తమ వారినే ఎంపికచేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు.
ఇంటర్వ్యూలు నామమాత్రమేనా..?
ఇంటర్వ్యూలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ఇతర నేతలు తమ వారి పేర్లుతో జాబితాలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ వివరాలను ఇప్పటికే ఎంపిక చేపడుతున్న విజయనగరం ఆర్డీవోకు పంపించారన్న చర్చ జోరందుకుంది. విజయనగరంలో ఒక కీలకనేత తన పరిధిలో 20 డిపోలకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలన్న జాబితా సిద్ధం చేసి ఇచ్చేసినట్లు సమాచారం. ఎవరి పేర్లు ప్రతిపాదించారన్న విషయం కూడా బయట చెప్పుకుంటున్నారు.
గజపతినగరం నియోజకవర్గ పరిధిలో అన్నింటిలోనూ మెరిట్ ఉన్నా లేకున్నా తమ వారికే ఇవ్వాలని అక్కడ నేత అధికారులకు సూచించినట్లు అధికారపార్టీ నేతలు బాహాటంగా చెప్పుకుంటున్నారు. చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎస్.కోట నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు తమ వారి పేర్లును సూచించారు. ఆర్డీవో జె.వి.మురళి వీరి సిఫార్సులు ఎంతవరకు పరగణలోనికి తీసుకుంటారో చూడాలి. ప్రతిభను కాదని ఇచ్చినా ఇబ్బందులు వస్తాయని తెలిసి నిజాయితీగా వ్యవహరిస్తారా?, నేతల ఒత్తిడికి తలొగ్గుతారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశం. ఆర్డీవో మాత్రం అంతా నిష్పక్షపాతంగా చేస్తామని ప్రకటించారు.
అయితే, ఆయన ప్రకటనను అభ్యర్థుల నమ్మడంలేదు. గరివిడి మండలం కుమరాం డీలరు పోస్టుకు ప్రతిభ ఉన్న వారిని పక్కన పెట్టి ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారని ముషిడి కుమార్, మరికొందరు ఇప్పటికే ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. పూల్‌బాగ్‌లో ఒక డిపోకు పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా ఇంటర్వ్యూకు పిలిచారన్న ఆరోపణలు ఉండడంతో అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా చేస్తారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆర్డీవో వద్ద ఇంటర్వ్యూకు సంబంధించి 20 మార్కులు ఉండడంతో వాటితో మేనేజ్ చేసి నేతలు చెప్పిన వారికి ఇస్తారని అభిప్రాయపడుతున్నారు.
పోస్టుకో రేటు?
ఇదిలా ఉండగా తెలుగు తమ్ముళ్లకే డీలర్ పోస్టులు ఇచ్చేలా సిఫార్సు చేస్తున్నా ఇక్కడ కూడా నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ఒక్కో పోస్టుకు రూ.25వేలు నుంచి రూ.50వేలు అధికారపార్టీ నాయకులు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. విజయనగరంలో ఒక పోస్టుకు రూ.25వేలు నుంచి రూ.30వేలు రేటు పెట్టగా గజపతినగరంలో రూ.50 వేలు వరకు, చీపురుపల్లి, ఎస్.కోట, నెల్లిమర్లలో రూ.40వేల వరకు తీసుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారపార్టీ వారే కాకుండా ఇతరలు కూడా ఇంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తక్కువైనా తమ వారికే చేయాలని నేతలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొత్తానికి ఎంతోకొంతకు డీలరు పోస్టులు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతా నిజాయితీగానే చేస్తాం
చౌకధరల డీలరు పోస్టు భర్తీ నియమనిబంధనలకు లోబడి జరుగుతాయి. ప్రతిభ ఉన్న వారినే ఎంపిక చేస్తాం. ఈ విషయంలో ఎటువంటి దళారులను నమ్మి మోసపోవద్దు. ఎటువంటి వదంతులూ నమ్మొద్దు. కొన్ని డిపోల మెరిట్ జాబితాపై ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిని పరిశీలిస్తాం. మొత్తం పక్రియ నిజాయితీగా చేస్తాం. –
జేవీ మురళి, ఆర్డీవో, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment