
రాజధానిగా కర్నూలు
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలునే రాజధాని చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, వివిధ సంఘాల ప్రతినిధులు శివరామకృష్ణన్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రం రాజధానిగా ఉన్న కర్నూలులో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏర్పాటుకు అపార వనరులు ఉన్నాయని, 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదన్నారు. రాజధాని ఏర్పాటు కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సోమవారం కర్నూలులో పర్యటించింది.
కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో అసెంబ్లీ నిర్వహించిన భవనాలను కమిటీ సభ్యులు నలుగురు పరిశీలించారు. తొలుత కర్నూలు నగరంలోని కేవీఆర్ కాలేజ్, ఎస్టీబీసీ కళాశాల, టౌన్ మోడల్ స్కూల్, జిల్లా కోర్టు, కొండారెడ్డి బుర్జు లాంటి చారిత్రక కట్టడం, మెడికల్ కళాశాలలోని పురుషుల హాస్టల్, ఏ.. సీ క్యాంపు ప్రాంతాల్ని సందర్శించింది. అనంతరం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో అభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని చేపట్టగా.. వివిధ వర్గాల ప్రజలు వారి అభిప్రాయాలను విన్నవించారు. జగన్నాథగట్టు నుంచి డోన్ వరకు రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టవచ్చని, అనేక ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయని వివరించారు. మిర్చి, పత్తి, టమోటా, ఉల్లి వంటి పంటలు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారని, మౌలిక వసతుల పరంగా రైల్వే, రోడ్డు రవాణా వంటి సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయని తెలియజేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాలున్న హైదరాబాద్, బెంగళూరు నగరాలు కర్నూలుకు చేరువలోనే ఉన్నాయన్నారు.
సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఈ నగరాన్ని ఎంపిక చేసుకుంటే రాజధాని నిర్మాణం, దాని అభివృద్ధికి పదేళ్లు అవసరం ఉండదని కమిటీకి విన్నవించారు. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఓర్వకల్లు, గడివేముల, నన్నూరు, తంగడంచ తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ బంజరు భూములున్నాయని, దీంతో భూముల కొనుగోలు సమస్య తప్పుతుందని గుర్తు చేశారు. ఈ జిల్లాలో నీటి వనరులు ఉన్నాయని, కృష్ణా, తుంగభద్ర, కుందు నదులు పారుతున్నాయని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల తాగునీటి సమస్య ఏర్పడదని వివరించారు. కాగా కొందరు సీనియర్ సిటిజన్లు మాత్రం కమిటీ తీరుపై ధ్వజమెత్తారు. రాజధాని ఎక్కడా అన్నది నిర్ణయం జరిగాక.. ఇప్పుడు మళ్లీ ఈ కమిటీ పర్యటన, ప్రజల అభిప్రాయసేకరణ ఎందుకు అని కమిటీ సభ్యుల్ని ప్రశ్నించారు.
కర్నూలునే మళ్లీ రాజధానిగా ప్రకటించండి..
ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు రాజధానిని కోల్పోయామని, నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా త్వరితగతిన అభివృద్ధి చెందడానికి గల అన్ని వనరులు కర్నూలులో ఉన్నాయని, వీటిని దృష్టిలో ఉంచుకుని స్థానికంగానే రాజధానిని ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రాజధాని నిర్ణయం జరిగిపోయాక తాజాగా కర్నూలు పర్యటనకు ఎందుకొచ్చినట్లని, ఇది కంటి తుడుపు చర్యే? అని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, మణిగాంధీ, గౌరు చరిత తదితరులు మాట్లాడారు.