- 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కష్టాలు
- మొదటి వారంలో బిల్లులు స్వీకరించే అవకాశం
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాలు ఆలస్యం కానున్నాయి. ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తేదీకిచ్చే జీతాలు ఖజానా అధికారుల కారణంగా జాప్యమవుతున్నాయి. అధికారిక కారణాలు తెలియలేదుగానీ.. జీతాల బిల్లులేవీ తీసుకోవద్దన్న మౌఖిక ఆదేశాలు రాష్ట్ర ఖజానా అధికారుల నుంచి అందాయి. అక్కడి నుంచి ఉప ఖజానా కార్యాలయాలకు ఇప్పటికే చేరాయి. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీకి జీతాలొచ్చే పరిస్థితులు దాదాపు లేనట్టే!
ప్రతి నెలా 25వ తేదీలోగా ఖజానా/ఉప ఖజానా కార్యాలయాలకు జీతా లు, ఇతరత్రా బిల్లులు సమర్పించాలి. 23 వరకు బిల్లులు తీసుకున్నా.. సోమవారం నుంచి బిల్లులపై నియంత్రణపెట్టారు. ఏటా ఆర్థిక సంవత్సరం చివర్లో ఖజానా శాఖ ఆంక్షలు తప్పనిసరి. కానీ అవి బకాయిలు, ఇతరత్రా చెల్లింపులకు మాత్ర మే పరిమితం. ఈసారి ఏకంగా జీతా ల బిల్లులే నిలిపేయాల్సిందిగా ఆదేశించారు.
వీటితోపాటు ఉద్యోగుల సరెండర్ లీవు బిల్లులు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పదవీ విరమణకు సంబంధిం చిన ఇతర బిల్లులు, గ్రాట్యుటీ బిల్లు లు, పంచాయితీల నిర్వహణకు సం బంధించిన బిల్లులు, పంచాయతీ సిబ్బంది జీతాలు ఆర్థికపరమైన అం శాలతో ఇప్పటికే అనుమతించలేదు. ఇప్పటికే తీసుకున్న బిల్లులకు కూడా జీతాలు పెట్టొద్దన్న ఆదేశాలున్నట్టు తెలిసింది. 010 పద్దు కిందకు వచ్చేవారితోపాటు సుమారు 30 వేల మంది ఉద్యోగులకు తిప్పలు తప్పేలా లేవు.
‘మధ్యాహ్న’ బిల్లులకూ బ్రేక్!
మధ్యాహ్న భోజన బిల్లులకూ గత రెండు మాసాలుగా బ్రేక్ పెట్టారు. ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించకపోతే అవి ఫ్రీజ్ అయ్యే పరిస్థితులున్నాయి. దీంతో మధ్యాహ్న భోజన కుకింగ్ వ్యయం, కుక్ కమ్ హెల్పర్ల జీతాల్లో మరింత జాప్యం నెలకొనే ప్రమాదముంది. ఒకసారి మధ్యాహ్న భోజన నిధులు ఫ్రీజ్ అయితే వాటిని మళ్లీ జిల్లాకు రప్పించడానికి నానా యాతనలు పడాలని అధికారులు చెప్తున్నారు.