ఎకరానికి లక్ష ! | Demoralize in Uda | Sakshi
Sakshi News home page

ఎకరానికి లక్ష !

Published Thu, Sep 3 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

Demoralize in Uda

సీఆర్‌డీఏలో మామూళ్లు మామూలే
ఉడా అవినీతిమయమంటూ మొదట్లో హడావుడి
ఆ తర్వాత అందరూ కలిసి దోపిడీ
లేఅవుట్లు, అపార్టుమెంట్లకు యథేచ్ఛగా వసూళ్లు

 
విజయవాడ బ్యూరో : వీజీటీఎం ఉడా స్థానంలో ఆవిర్భవించిన సీఆర్‌డీఏ మొదట్లో ఉప్పులా కనిపించినా ప్రస్తుతం చప్పగా మారిపోయింది. మామూళ్లు, పైరవీలు ఉడా మాదిరిగానే చాలా మామూలుగా జరిగిపోతున్నాయి. ఉడాలో పనిచేసిన అధికారులు, సిబ్బంది అవినీతిపరులని, ఎవరికీ పని రాదని, అందరినీ మార్చేస్తామని తొలుత సీఆర్‌డీఏ పగ్గాలు చేపట్టిన ఉన్నతాధికారులు ఘీంకరించారు. దీంతో పాత ఉడా ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయోనని బెంగపెట్టుకుని కంటి మీద కునుకు లేకుండా గడిపారు. ఆ సమయంలో పాత ఉద్యోగులను సీఆర్‌డీఏ కార్యాలయంలో దోషులుగా చూసే పరిస్థితి ఉండేది. దీన్ని తట్టుకోలేక కొందరు హెచ్‌వోడీలు వేరే శాఖల్లోకి వెళ్లిపోయారు.

 సీన్ కట్ చేస్తే...
 ప్రస్తుతం అవినీతిలో సీఆర్‌డీఏ ఉడాను మించిపోయిందనే  విమర్శలు వినిపిస్తున్నాయి. పాత, కొత్త యంత్రాంగం కలిసి అందినకాడికి దోచుకుంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు నిబంధనలే, మామూళ్లు మామూలే అన్నట్లుంది అక్కడ పరిస్థితి. అన్నీ నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి అయినా ఆమ్యామ్యాలు సమర్పించుకోవాలి. రియల్ వెంచర్లు, అపార్టుమెంట్లకు అనుమతులిచ్చే డెవలప్‌మెంట్ కంట్రోల్ విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఉన్నతాధికారులంతా రాజధాని వ్యవహారాల హడావుడిలో మునిగితేలుతుంటే ఈ విభాగంలో పనిచేసేవారు చాపకింద నీరులా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు.

అన్ని స్థాయిల్లోనూ మామూళ్లు తప్పనిసరి...
కిందిస్థాయి నుంచి విభాగాధిపతి వరకూ అన్ని స్థాయిల్లోనూ మామూళ్లు సమర్పించుకుంటే గానీ ఫైలు కదలడం లేదు. లేఅవుట్లకు అనుమతి ఇచ్చేందుకు ఏరియాను బట్టి మామూళ్ల రేట్లను ఫిక్స్ చేశారు. విజయవాడ పరిసరాల్లో ఎక్కడైనా ఎకరం భూమిని లేఅవుట్ చేయించుకోవాలంటే కనీసం లక్ష ఖర్చు పెడితేగానీ పని జరగడంలేదు. సాధారణంగా ఎకరం భూమి లేఅవుట్ కోసం సీఆర్‌డీఏకు కట్టాల్సిన ఫీజులే రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఉంటున్నాయి. మామూళ్లతో కలిపి ఈ ఖర్చు రూ.5 లక్షలకు చేరుతోంది. సర్వేయర్ మొదలు పైస్థాయి అధికారులకు ఇచ్చే మొతం లక్షకు మించిపోతోంది. ఇటీవల ఇబ్రహీంపట్నం సమీపంలో నాలుగు ఎకరాల భూమికి లేఅవుట్ మంజూరు చేసేందుకు ఒక రియల్ కంపెనీ నుంచి రూ.4.25 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. అన్నీ సక్రమంగా ఉంటేనే ఈ రేటు. ఏదైనా తేడా ఉంటే ఇక ఆ కంపెనీ ప్రతినిధులను రోజుల తరబడి తమ చుట్టూ తిప్పుకుని సాధారణంగా ఇచ్చే మామూలు కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఫైలు ప్లానింగ్ అధికారి దగ్గర ఉందని, డెరైక్టర్ పెండింగ్‌లో పెట్టారని, కొన్నిసార్లు కమిషనరే ఆపేశారని చెబుతూ డబ్బు గుంజేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కంకిపాడు సమీపంలోని రియల్ కంపెనీ మూడున్నర ఎకరాల లేఅవుట్‌కు రూ.8 లక్షలు సమర్పించుకోవాల్సి వచ్చినట్లు సమాచారం.

గాలిలో కలుస్తున్న నిబంధనలు...
ఇక అపార్టుమెంట్ల నిర్మాణానికి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి శివార్లలో నిబంధనలు అతిక్రమించి మరీ ఇష్టానుసారం భవనాలు కట్టేస్తున్నారు. కానూరు నుంచి కంకిపాడు వరకూ, గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం వరకూ, ఎనికేపాడు నుంచి గన్నవరం వరకూ అనేక భవనాలు సీఆర్‌డీఏ నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. వీటిని చూసీచూడకుండా ఉండడం కోసం సీఆర్‌డీఏ అధికారులకు భారీ ఎత్తున డబ్బులు ముట్టజెబుతున్నారు. ఉన్నతాధికారులకూ ఇందులో భాగం ఉంటోంది. కానీ వాటి గురించి ఎవరైనా వారి వద్ద ప్రస్తావిస్తే అలా జరుగుతోందా, నిజమా.. మాకు తెలియదే! అంటూ నటిస్తున్నారు. దీనివల్ల సీఆర్‌డీఏ నిబంధనలు గాలిలో కలిసిపోతుండగా, అధికారుల జేబులు మాత్రం నిండుతున్నాయి. పైకి సీఆర్‌డీఏ ఇంటర్నేషనల్ ఏజెన్సీలా ఉందనే కలరింగ్ ఇస్తున్నా లోపల మాత్రం అంతా మామూళ్ల మయంగా మారిపోయింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement