
రక్తం అందకే పూసల అరుగుదల!
వెన్నెముక డిస్కుల్లో రక్తప్రసరణ గుట్టు రట్టు
నరేశ్ బాబు బృందం వైద్యుల కీలక పరిశోధన
వెన్ను ఆపరేషన్లను తగ్గించే లక్ష్యంతో ప్రయోగాలు
హైదరాబాద్: నిండా నలభై ఏళ్లు కూడా లేకుండానే నడుమునొప్పి బారిన పడుతున్నవారు ఇప్పుడు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. వెన్నులో డిస్కు జారిందనో లేదా అరిగిందనో మెజారిటీ వైద్యులు చెబుతుంటారు. ద్విచక్ర వాహనానికి షాక్ అబ్జర్వర్‌ల మాదిరిగా వెన్నుకు దన్నుగా నిలిచే ఈ డిస్కుల అరుగుదల, జారిపోవడానికి గల కారణాలను ప్రముఖ వెన్నుపూస వైద్యులు డా.నరేష్ బాబు నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది. డిస్కులకు రక్తం అందకపోవడం కారణంగానే అవి అరిగిపోతున్నట్టు ‘డిఫ్యూజన్ స్టడీ ఆఫ్ లంబార్ డిస్క్’ పేరుతో 2008 నుంచి 2014 వరకూ వీరు జరిపిన పరిశోధనల్లో తేలింది. డిస్కుల్లో రక్తప్రసరణ ఎలా జరుగుతోందనే కోణంలో వందమంది రోగులపై వీరు పరిశోధించారు. బయాప్సీ ద్వారా పరీక్షలు రోగికి బాధ కలిగిస్తాయనే ఉద్దేశంతో ఒక్కో రోగిపై 8 నుంచి 10 సార్లు ఎంఆర్‌ఐ స్కానింగ్ ద్వారానే పరీక్షలు నిర్వహించారు. ఉత్తరకొరియాలో ప్రపంచ స్పైనల్ సర్జన్స్ నేతృత్వంలో ఇటీవల జరిగిన సదస్సులో డా.నరేష్ బాబు బృందం సమర్పించిన పరిశోధన పత్రాలను ఆమోదించారు. ‘ప్రపంచ సైన్స్ జర్నల్’ జూలై సంచికలో వీరి పరిశోధన వ్యాసం ప్రచురితం కానుంది.
నాలుగు దశల్లో పరిశోధన
వెన్నెముకలో డిస్కు అనేది పొరలు పొరలుగా ఉన్న రబ్బరు టైరు వంటిది. స్పాంజిలాంటి దీనిలో రక్తనాళాల వ్యవస్థ ఉండదు. ఎముకల నుంచి విడుదలయ్యే రక్తాన్ని పీల్చుకోవడం ద్వారానే డిస్కుకు రక్తం అందుతుందని వీరు మొదటి దశలో గుర్తించారు. రెండో దశలో డిస్కులకు రక్త సరఫరా పెంచే వీలుందా? అనే దిశగా నిమోడిపైన్ మాత్రలు ఇచ్చి పరిశీలించారు. మాత్రలు తీసుకున్న రోగుల్లో డిస్కులకు రక్తసరఫరా 11 శాతం వృద్ధిచెందినట్టు గుర్తించారు. మూడో దశలో డిస్కు ఒత్తిడికి గురైనప్పుడు రక్తప్రసరణ వ్యవస్థను పరిశీలించారు. నాలుగో దశలో డిస్కు చుట్టూ ఉండే పొరలకు రక్త ప్రసరణను పరిశీలించారు. డిస్కు పొరలకు నాడీవ్యవస్థ నుంచే రక్త ప్రసరణ జరుగుతుందని ఇంతవరకూ భావిస్తుండగా, అది తప్పు అని, ఆ పొరలకు సైతం ఎముకల ద్వారానే రక్తం సరఫరా అవుతోందని తేలింది.
శస్త్రచికిత్సలు బాగా తగ్గించొచ్చు
ఎముకలు, డిస్కులు అరిగి పోయి చాలామందికి శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తోంది. రక్తప్రసరణ లోపం కారణంగానే డిస్కులు అరుగుతున్నాయని మా పరిశోధనల ద్వారా తేలింది. కాబట్టి బయోలాజికల్ ట్రీట్‌మెంట్ (మందుల) ద్వారానే దీనిని నయం చేసుకునేందుకు వీలుంటుంది. దీనివల్ల శస్త్రచికిత్సలు బాగా తగ్గుతాయి. రోగులకు వైద్యఖర్చులూ తగ్గుతాయి. గుంటూరులోని మల్లికా స్పైనల్ సెంటర్‌లోనే ఇప్పటివరకూ సాధారణ ఎముకలు ఉన్నవారిపై ఈ ప్రయోగాలు చేశాం. ఇప్పుడు అరిగిపోయిన డిస్కులు, ఎముకలు ఉన్నవారిపై చేస్తున్నాం. ఈ రెండింటికీ వ్యత్యాసం తెలిస్తే అప్పుడు వైద్యం సులువవుతుంది.
- డా.నరేష్‌బాబు, వెన్నుపూస వైద్య నిపుణులు